సబ్ ఫీచర్

ఒక మహిళ చేసిన న్యాయ పోరాటం ( ప్రపంచ సినిమా : బ్రిటన్ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రీ బిల్‌బోర్డ్స్ అవుట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి (2017)

** ** **** *** *

ప్రముఖ బ్రిటన్ దర్శకుడు, రచయిత మార్టిన్ మాక్ డొనాగ్ 1998లో దక్షిణ అమెరికా పర్యటిస్తున్నప్పుడు- పరిష్కరింపబడని నేరానికి సంబంధించిన నినాదాలు గల రెండు బిల్‌బోర్డులను (హోర్డింగ్స్) చూస్తాడు. టెక్సాస్‌లోని వెడార్ ప్రాంతంలో హత్యకావింపబడిన మహిళకు సంబంధించి, పరిశోధించాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ వివాదప్రాయమైన విషయాలు అందులో పేర్కొనబడి వుంటాయి. ఆ బిల్‌బోర్డుల ప్రేరణతో, వాటినే నేపథ్యంగా తీసుకుని, అదే కేసును మరింత పకడ్బందీగా సినిమాకు అనుకూలంగా రాసుకున్నారు. ఇది ఒక రూపాన్ని సంతరించుకోవడానికి పదేళ్ళు పట్టింది. ఇదే 2017లో ‘‘త్రీ బిల్‌బోర్డ్స్ అవుట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి’’ పేరుతో సినిమాగా మన ముందుకు వచ్చింది.
మిస్సోరి దగ్గర వున్న ఎబ్బింగ్ అనే పట్టణంలో విడాకులు తీసుకున్న 45 ఏళ్ళ మిల్‌డ్రెడ్ అనే మహిళ తన టీనేజ్ కూతురు ఏంజెలాతో, మరో టీనేజ్ కొడుకు రాబీతో నివసిస్తుంటుంది. ఆమె ఒక చిన్న షాప్‌లో పనిచేస్తూ, చాలీచాలని జీతంతో పిల్లల అవసరాలను కూడా తీర్చలేని నిస్సహాయతలో కూరుకుని వుంటుంది. స్కూల్‌కి వెళుతున్న ఆమె టీనేజ్ కూతురు ఏంజెలాపై ఎవరో అత్యాచారం జరిపి హత్యచేసి పోతారు. ఈ సంఘటన జరిగి ఏడు నెలలు అవుతున్నా, పోలీసుల పరిశోధన ఏమాత్రం ముందుకు సాగలేదు. న్యాయంకోసం వాళ్ళచుట్టూ తిరిగి విసుగెత్తిన మిల్‌డ్రెడ్ అడ్వర్టయిజ్‌మెంట్ ఏజన్సీకి పోయి, నగర శివార్లలో ఖాళీగావున్న మూడు బిల్‌బోర్డులను (హోర్డింగ్స్) అద్దెకు తీసుకుని, వాటిపై ‘‘బలాత్కారం మరియూ హత్య’’, ‘‘ఇప్పటివరకు ఎవర్నీ పట్టుకోలేదు’’, ‘‘ఏమంటారు, ఛీఫ్ విలోబీ’’అని రాయిస్తుంది. ఒకదాని వెనుక ఒకటి కొంత దూరంలోవున్న ఆ బిల్‌బోర్డులు, పట్టణ వాసులలో సంచలనం కలిగిస్తాయి. ఇవి చూసి పోలీస్ ఛీఫ్ విలోబీ, జాత్యహంకారి, క్రూరుడు, తాగుబోతు అయిన పోలీస్ ఆఫీసర్ జేసన్ డిక్సన్ మండిపడతాడు. పోలీస్ ఛీఫ్ విలోబీ, మిల్‌డ్రెడ్ బాధను అర్ధంచేసుకుంటాడు. కాని ఆమె తన నిజాయితీని శంకించడం ఆయన భరించలేకపోతాడు. దాంతో పోలీసులు మిల్‌డ్రెడ్‌ను, ఆమె కొడుకు రాబీలను వేధించడం, భయపెట్టడం మొదలవుతుంది. పోలీస్ ఆఫీసర్ డిక్సన్ నేరుగా మిల్‌డ్రెడ్ దగ్గరకువచ్చి ఆ బిల్‌బోర్డులను తీసివేయమని, లేకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తాడు. ఆమె వినకపోతే బిల్‌బోర్డులను అద్దెకిచ్చిన రెడ్ వెల్బీనీ పోలీస్‌స్టేషన్‌కు పిలిచి, ఆ బోర్డులను తీసివేయమని బెదిరిస్తే, ఇందులో చట్టవిరుద్ధమైనది ఏమీలేదు కాబట్టి ఆ పని చేయలేనంటాడు. మిల్‌డ్రెడ్ పనిచేసే పింగాణి దుకాణపు యజమానిని మాదకద్రవ్యాల కేసుపెట్టి లోపల పడవేస్తారు. దీనివల్ల మిల్‌డ్రెడ్ ఉద్యోగం పోతుంది సరికదా ఆమెను ఎవరూ పనిలో పెట్టుకోకుండా వార్నింగ్‌గా అది పనిచేస్తుంది. ఆమె మాజీ భర్త చార్లీని పోలీసులు వేధిస్తే, వాడు తన కుర్ర ప్రేయసితో కలిసివస్తాడు. ఆ బిల్‌బోర్డులు తీసేయమని బెదిరిస్తూ చెప్పినా ఆమె పట్టించుకోదు. దాంతో వాడు ఆమెమీద దాడికి ప్రయత్నించగా, కొడుకు రాబీ వచ్చి కత్తితో ఎదుర్కొంటాడు. దాంతో వాడు తమ కూతురి మరణానికి ఆమెనే కారణమని నిందిస్తూ వెళ్ళిపోతాడు. పోలీస్ ఛీఫ్ విలోబీ కాన్సర్‌తో బాధపడుతున్నాడు. అతను త్వరలో రిటైర్ కాబోతున్నాడు. అతను తన సర్వీసులో ఎలాంటి రిమార్కులేకుండా ప్రశాంతంగా రిటైర్ కావాలనే కోరికతో డిక్సన్ ఈ కేసును విత్‌డ్రా చేసుకోమని మిల్‌డ్రెడ్‌ను వేధిస్తుంటాడు. ఒకసారి మిల్‌డ్రెడ్ పంటినొప్పితో ఒక దంతవైద్యుడి దగ్గరకుపోతే, వాడు ఆమెను బెదిరించాలని చూస్తే, వాడి డ్రిల్లింగ్ మెషిన్‌తోనే వాడి బొటనవ్రేలు మీద డ్రిల్లింగ్ చేసి వస్తుంది. ఈ విషయమై పోలీస్‌స్టేషన్‌కు మిల్‌డ్రెడ్‌ను పిలిచి విచారణ చేస్తుండగా, విలోబీకి దగ్గురావడం ఆ దగ్గులో రక్తం పడటం జరుగుతుంది. మిల్‌డ్రెడ్ పోలీసులను పిలిచి అతడ్ని ఆస్పత్రిలో చేర్పిస్తుంది. ఆస్పత్రినుండి విడుదలైన విలోబీ ఇంటికిపోయి భార్యాపిల్లలతో ఆటపాటలతో హాయిగా గడుపుతాడు. తాను కాన్సర్‌తో బాధపడుతూ చావడం, కుటుంబ సభ్యులు చూడటం ఇష్టంలేని విలోబీ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. చనిపోతూ మిల్‌డ్రెడ్‌కు, డిక్సన్‌కు విడిగా ఉత్తరాలు రాసి పెడతాడు. మిల్‌డ్రెడ్ తన దగ్గరవున్న డబ్బు అంతా ఇచ్చేసి బిల్‌బోర్డులను ఏర్పాటుచేయిస్తుంది. తీరా ఏజెన్సీవాడు ఆమె ఇచ్చింది ఒక నెల కిరాయికే సరిపోతుంది. ఇంకో అయిదువేలు ఇస్తేనే మరో నెల పొడిగిస్తానంటాడు. ఆమెదగ్గర డబ్బులు వుండవు. ఎవరో అనామకుడు ఇంకొక నెల బిల్‌బోర్డుల అద్దెకోసం డబ్బును పోస్టులో పంపిస్తాడు. మిల్‌డ్రెడ్ తనకొచ్చిన ఉత్తరంలో ఆ డబ్బు చెల్లించింది పోలీస్ ఛీఫ్ విలోబీ అని తెలుసుకుంటుంది. తన ఆత్మహత్యకు ఆమె కారణం కాదనీ, ఈ బిల్‌బోర్డులవల్ల ఆమె కేసు పరిష్కారమవచ్చని సూచిస్తాడు. విలోబీ ఆత్మహత్య వార్త విన్న డిక్సన్ క్రోధావేశుడై అడ్వర్టయిజ్‌మెంట్ ఏజన్సీ నిర్వాహకుడైన రెడ్ విల్బీ ఆఫీసుకుపోయి అక్కడ విధ్వంసం సృష్టించి, వాడ్ని మొదటి అంతస్తు కిటికిలోనుండి రోడ్డుమీదికి విసిరేస్తాడు. విలోబీ స్థానంలో వచ్చిన కొత్త ఛీఫ్ ఇదంతా చూసి, అధికార దుర్వినియోగం చేసిన డిక్సన్‌ను డిస్మిస్ చేస్తాడు. డిక్సన్ రివాల్వర్ అప్పగించి, బ్యాడ్జ్ ఎక్కడో వుంది తర్వాత ఇస్తానని చెప్పి బయటపడతాడు.
శివార్లలోవున్న మూడు బిల్‌బోర్డులను ఎవరో తగులబెట్టి నాశనం చేస్తారు. అది పోలీసుల పని అని ఆగ్రహించిన మిల్‌డ్రెడ్ చీకట్లో పోలీస్‌స్టేషన్ మీద పెట్రోలు బాంబులు విసురుతుంది. ఈలోగా విలోబీ తనకోసం రాసిపెట్టిన ఉత్తరంకోసం పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన డిక్సన్ ఆ ఉత్తరం చదువుతూ లోకాన్ని మరిచిపోతాడు. అందులో ‘జనాల’పట్ల ఆగ్రహాన్ని, అసహ్యాన్ని పెంచుకోవడం మానేసి వారిపట్ల ప్రేమను, ఆదరాన్ని చూపించు. తెలివితేటలనుపయోగించి మంచి డిటెక్టివ్‌గా మారమంటాడు. బార్లలో నిఘావేసి తాగుబోతుల మాటలను వింటే, సగం క్రైమ్‌ను అరికట్టవచ్చు’ అని వుంటుంది. అంతలో విజృంభించిన మంటలను చూసి జాగరూకుడై ఎంజెలా కేసు ఫైల్‌తీసుకుని మంటల్లోనుండి కిటికిగుండా బయటకు దూకుతాడు. కాలిన గాయాలతో రోడ్డుమీద పడిన డిక్సన్‌ను ఆస్పత్రిలో చేరుస్తారు. అడ్వర్టయిజ్ ఏజెన్సీ వెల్బీ కూడా అక్కడ గాయాలతో పేషంట్‌గా కనిపించడంతో, వాడికి తన క్షమాపణలు చెప్పుకుంటాడు.
ఆస్పత్రినుండి విడుదలైన డిక్సన్ ఒక బార్‌కు వస్తాడు. స్టోర్స్‌లో మిల్‌డ్రెడ్‌ను బెదిరించిన ఒక గూండా, అక్కడ తన మిత్రుడితో కలిసి తాగుతూ, తాను ఒక అమ్మాయిని రేప్‌చేసి చంపానని చెప్పడం విన్న డిక్సన్, వాడ్ని రెచ్చగొట్టి వాడితో చావుదెబ్బలు తింటాడు. ఆ పోట్లాటలో వాడి మొహాన్ని రక్కి, వాడి డిఎన్‌ఎ సంపాదించి లాబ్‌కు పంపిస్తాడు. కాని అది ఎంజెలాను చంపిన హంతకుడితో సరిపోలేదనీ పైగా ఆ గూండా సైన్యంలో పనిచేసి వచ్చాడనీ, హత్య జరిగినప్పుడు వాడు విదేశాల్లో వున్నాడనీ తేలడంతో డిక్సన్ నిరాశపడతాడు.
పోలీస్‌స్టేషన్ కాల్చివేతపై కొత్త పోలీస్ ఛీఫ్ మిల్‌డ్రెడ్‌ను అనుమానిస్తాడు. ఆమెను ఇంటరాగేషన్ చేస్తే, ఆ రాత్రి తన మిత్రుడు జేమ్స్‌తో డేటింగ్‌లో వున్నానని చెబుతుంది. పొట్టివాడైన జేమ్స్, మిల్‌డ్రెడ్ పట్ల అభిమానం పెంచుకుంటాడు. ఆమెను డేటింగుకు పిలిస్తే, విందుకు తప్ప నీతో పడుకోనని ఖచ్చితంగా చెబుతుంది. వాళ్ళిద్దరు కలిసి హోటల్‌కు వెళ్ళినప్పుడు ఆమె మాజీ భర్త చార్లీ, తన కుర్ర ప్రేయసితో అక్కడకు వస్తాడు. తాగిన మత్తులో తానే ఆ బిల్‌బోర్డులను నాశనంచేశానని చెబుతాడు. డేటింగ్ నిస్సారంగా మారినందుకు ఆగ్రహించిన జేమ్స్ ప్రేమ, జాలి అనేవి మరిచిపోయి మిల్‌డ్రెడ్ యాంత్రికంగా మారిపోయిందని నిందించి వెళ్ళిపోతాడు.
మరుసటిరోజు డిక్సన్, మిల్‌డ్రెడ్ ఇంటికి వస్తాడు. ఇద్దరు కలిసి కారులో లాంగ్‌డ్రైవ్‌కు వెళుతుంటారు. పోలీస్‌స్టేషన్‌పై బాంబులు విసిరానని ఆమె చెబుతుంది. తనకు తెలుసంటాడు డిక్సన్. ఎంజెలాను చంపిన హంతకుడ్ని ఎలాగైనా పట్టుకుంటానంటాడు. వాడు దొరికితే ఏం చేస్తావని డిక్సన్ అడిగితే, ఏంచేయాలో ఇంకా నిర్ణయించుకోలేదంటుంది. వాడు దొరుకుతాడా అని ప్రశ్నిస్తే వెదుకుదాం అంటాడు. అంటే వాళ్ళ అనే్వషణ కొనసాగుతునే వుంటుందని సూచిస్తూ సినిమా ముగుస్తుంది.
ఎట్టి పరిస్థితులకు వెరవకుండా, ఎలాంటి బెదిరింపులకు లొంగకుండా దృఢంగా, స్థిరచిత్తంగా కనిపించే మిల్‌డ్రెడ్‌గా ఫ్రానె్సస్ మాక్ డొర్మాండ్ నటన అపూర్వం. పోలీసులతో వ్యవహరించినప్పుడు కనిపించే నిబ్బరం, తమ కారుమీద రాళ్ళు విసిరిన విద్యార్థులను శిక్షించడంలో, పోలీస్‌స్టేషన్ మీద పెట్రోల్ బాంబులు వేసినప్పుడు చూపిన తెగువ, ధైర్యసాహసాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. అహంకారం, అధికారమదంతో విర్రవీగే పోలీసాఫీసర్‌గా మొదటి భాగంలో, పూర్తిగామారిపోయి డిఎన్‌ఎకోసం గూండా చేతిలో చావుదెబ్బలు తినడం, బ్యాడ్జ్ వెతికి తెచ్చి పై ఆఫీసర్‌కిచ్చి వెళ్ళిపోయే దశలో, క్లైమాక్స్ సీన్‌లో మంచి అభినయం కనబరిచిన సామ్ రాక్‌వెల్, జేసన్ డిక్సన్ పాత్రలో అద్భుతంగా నటించారు. అందుకే వీరిద్దరు అనేక ఫిలిం ఫెస్టివల్స్‌లో ఉత్తమ నటి, ఉత్తమ సహాయక నటుడుగా అవార్డులను అందుకున్నారు. ఈ చిత్రానికి రచయితగా, సహ నిర్మాతగా, దర్శకుడిగా మార్టిన్ మాక్ డొనాగ్ చూపిన ప్రతిభ ప్రశంసనీయం. 15 మిలియన్ డాలర్ల ఖర్చుతో తయారైన ఈ చిత్రం, 160 మిలియన్ల డాలర్లను వసూలుచేసింది.
ఈ చిత్రం 75వ గోల్డెన్ గ్లోబ్ అవార్డులలో నాలుగింటిని, 71వ బ్రిటీష్ అకాడమీ ఫిలిం అవార్డులలో అయిదు అవార్డులను, 24వ స్క్రీన్ ఆక్టర్స్ గిల్డ్ అవార్డులలో ఉత్తమ చిత్రంగా, 90వ అకాడమీ అవార్డులలో ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ సహాయ నటుడిగా బహుమతులనందుకున్నారు. ఇవేకాకుండా 2017లో వెనీస్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, సాన్ సెబాస్టియన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ (ఆడియన్స్ అవార్డును గెలుచుకుంది) బిఎఫ్‌ఐ లండన్ ఫిలిం ఫెస్టివల్, జ్యూరిచ్ ఫిలింఫెస్టివల్, మాడ్‌డెల్ ప్లాటా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొని ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఈ చిత్రాన్ని 2017లో వచ్చిన అత్యుత్తమ పది చిత్రాలలో ఒకటిగా అమెరికన్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్ వారు ఎంపికచేయడం విశేషం.

-కె.పి.అశోక్‌కుమార్