సబ్ ఫీచర్

ఆర్థిక వ్యవస్థకు ‘వాతావరణం’ దెబ్బ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాతావరణంలో మార్పులకు వెనుకబడిన దేశాలే కాదు, అభివృద్ధి చెందిన దేశాలు సైతం తీవ్ర ప్రభావాలను ఎదుర్కొంటున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడమే గాక, ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలను కూడా వాతావరణ మార్పులు ఛిన్నాభిన్నం చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ బీమా సంస్థలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని ‘పర్యావరణపరమైన రక్షణ లేని’ భౌగోళిక వనరుల పట్ల నిరాసక్తత చూపుతున్నాయా? ఈ ప్రశ్నకు సమాధానం ‘అవును’ అన్నట్లయితే అంతర్జాతీయ వ్యాపార సంస్థలు అభివృద్ధి చెందుతున్న, వెనుకబడిన దేశాలను వాతావరణ మార్పులకు బలిపశువులను చేస్తున్నాయన్నమాట.
వాతావరణంలో వచ్చే మార్పులకు ఎక్కువగా ప్రభావితమయ్యేవి అభివృద్ధి చెందుతున్న దేశాలు, వెనుకబడిన దేశాలు, ద్వీప సముదాయాలున్న దేశాలు. వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంలో వాటి ప్రమేయం మాత్రం అతి స్వల్పం. ‘గ్రీన్‌వాచ్’ సంస్థ ఏటా ‘గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్’ను విడుదల చేస్తుంది. తుపానులు, వరదలు, వడగాడ్పులు వంటి ప్రకృతి ఉత్పాతాలు సంభవించినప్పుడు తీవ్రంగా నష్టపోయే దేశాల సూచీని ఈ నివేదికలో ప్రచురిస్తారు. ‘గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్’ 2018లో ప్రచురించిన నివేదిక ప్రకారం ప్రకృతి ఉత్పాతాలకు తీవ్రంగా నష్టపోయే దేశాలలో భారత్ ఆరవ స్థానంలో ఉంది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే- వాతావరణంలో సంభవిస్తున్న అవాంఛనీయ మార్పుల విషయంలో అభివృద్ధి చెందుతున్న, వెనుకబడిన దేశాల ప్రమేయం స్వల్పమే. ఉదాహరణకు వాయుకాలుష్యానికి ప్రధాన కారణమైన కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తి విషయంలో 1850 నుండి ఇప్పటివరకు భారతదేశం ప్రమేయం ఐదు శాతం కన్నా తక్కువ. అదే అమెరికా, ఐరోపా దేశాల ప్రమేయం ఇరవై శాతం కన్నా ఎక్కువే.
‘వాతావరణంలో మార్పులకు త్వరగా ప్రభావితమయ్యే అభివృద్ధి చెందుతున్న, వెనుకబడిన దేశాలు భారీ మూల్యానే్న చెల్లించాల్సిన పరిస్థితి వస్తోంది. ఆ దేశాల తమ ఆర్థిక, రాజకీయ స్వావలంబన ప్రశ్నార్థకంగా మారుతోంది. ఎందుకంటే బడా దేశాలు తమపై చెలాయించే పెత్తనానికి ఆ దేశాలు తల వంచాల్సిన పరిస్థితి అనివార్యవౌతుంది గనుక..’ అని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక పేర్కొంది.
ప్రకృతి విపత్తులకు భారీ మూల్యం!
వాతావరణ మార్పుల కారణంగా వివిధ దేశాలలో సంభవిస్తున్న నష్టాల తీవ్రత ఇటీవలి సంవత్సరాలలో వేగంగా పెరుగుతోంది. ‘1950వ సంవత్సరం నుంచి చూస్తే వాతావరణ సంబంధమైన విపత్తులు ఆరు రెట్లు అధికమయ్యాయి. 1980 నుంచి చూస్తే వాతావరణ మార్పులతో సంభవించిన ఆర్థిక నష్టాలు వివిధ దేశాలలో ఐదు రెట్లు పెరిగింది. 2017కి సంబంధించిన వాతావరణ గణాంకాలు అత్యధిక నష్టాన్ని నమోదు చేశాయి. తీవ్రమైన ప్రకృతి ఉత్పాతాల వల్ల ఒక్క 2017లోనే ప్రపంచవ్యాప్తంగా 320 బిలియన్ల డాలర్ల మేరకు నష్టం వాటిల్లింది. ఇప్పటికే ఐరోపాలోనూ, ఉత్తర అమెరికాలోను అతి శీతల గాడ్పుల వల్ల, ఆస్ట్రేలియా, కెనడా, అర్జెంటీనాలలో వడగాడ్పుల వల్ల, కేప్‌టౌన్ (దక్షిణ ఆఫ్రికా) సిటీలో తీవ్ర నీటి ఎద్దడివల్ల, జపాన్‌లో కొండ చరియలు విరిగిపడటం వల్ల బిలియన్ డాలర్లలో నష్టం వాటిల్లింది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని స్విట్జర్లాండ్‌కి చెందిన స్విస్ రే (స్విస్ రీ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్) తెలిపింది. ‘స్విస్ రే’ అన్నది ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద రీ-ఇన్స్యూరెన్స్ కంపెనీ. రీ-ఇన్స్యూరెన్స్ కంపెనీ అంటే ఇన్స్యూరెన్స్ కంపెనీలకే ఇన్స్యూరెన్స్ వ్యవహారాలు చూస్తుందన్న మాట. ప్రకృతి ఉత్పాతాల కారణంగా వివిధ దేశాలలో ఇన్స్యూరెన్స్ కంపెనీలకి పెద్ద దెబ్బే తగులుతోందన్నమాట. వాతావరణంలో సంభవిస్తున్న అవాంఛనీయమైన, అనూహ్యమైన మార్పులతో రిస్క్ ప్రొటెక్షన్ గ్యాప్ (అంటే ఆర్థికపరమైన నష్టాలకూ, ఇన్స్యూరెన్స్ పరమైన నష్టాలకూ మధ్య అంతరం) పెరుగుతోంది. ఇప్పటికే ఈ అంతరం అభివృద్ధి చెందుతున్న దేశాలలో చాలా ఎక్కువగానే ఉంది. ఎందుకంటే ఆ దేశాలలో బీమా చేయబడని వనరులే అధికంగా ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఈ సమస్య అభివృద్ధి చెందుతున్న దేశాలలో కూడా పెరుగుతోంది.
‘ప్రకృతిపరమైన ఉత్పాతాలకు సంబంధించి వివిధ దేశాలలో ఇప్పటిదాకా 30 శాతం మాత్రమే వనరులు బీమా చేయబడి ఉన్నాయి. మిగతా వనరుల నష్టాన్ని ఆయా ప్రభుత్వాలు, సంస్థలు, వ్యక్తులే భరించాలి. ఇప్పటికే వాతావరణపరమైన రిస్క్ ప్రొటెక్షన్ గ్యాప్ ఏడాదికి 100 బిలియన్ డాలర్ల మేరకు ఉంది. ఈ అంతరం ముందు ముందు ఇంకా పెరగనుంది. ఎందుకంటే పర్యావరణపరంగా తీవ్ర నష్టానికి గురయ్యే అవకాశమున్న వనరులను పరిగణనలోకి తీసుకోకపోవడమో లేదా వాటికి అధిక మొత్తంలో ప్రీమియం చార్జీలు వసూలు చెయ్యడమో బీమా కంపెనీలు చేస్తాయి కాబట్టి. దీనివల్ల అభివృద్ధి చెందుతున్న, వెనుకబడిన దేశాలలో పెద్ద మొత్తంలో ప్రకృతి వనరులు బీమా చెయ్యబడకుండా ఉండిపోతాయని స్విస్ రే తాజా విశే్లషణ తెలుపుతోంది.
‘క్లైమేట్ ఛేంజ్ అండ్ ది కాస్ట్ ఆఫ్ కేపిటల్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్’ పేరుతో పర్యావరణంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన నివేదిక ఇలా పేర్కొంటోంది. ‘ప్రకృతి ఉత్పాతాల వల్ల మరణించిన వారి సంఖ్య 117 లోపు ఉంటే నష్టం స్థాయి సాధారణమైనదిగానే పరిగణిస్తారు. కానీ ఎంపిక చేసిన 25 అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ స్థాయిని ఎప్పుడో దాటిపోయాయి. అనగా ఈ మరణించిన వారి స్థానంలో ఆ నష్టాన్ని పూరించడానికి ఆయా దేశాల ప్రభుత్వాలకు అయ్యే ఖర్చు అదనంగా 40 బిలియన్ డాలర్లు అవుతోంది. ఈ దేశాలలో ఇది గత పదేళ్లుగా జరుగుతున్నదే. పర్యావరణ ఉత్పాతాల వల్ల అదనంగా పడిన ఈ ఆర్థికభారం ఆయా దేశాల ప్రభుత్వాలను అప్పులపాలు చేస్తోంది. ప్రపంచ బ్యాంకు లేదా బడా దేశాల నుండి అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రభుత్వాలు అప్పుగా తీసుకునే ప్రతి 10 డాలర్లలోను ఒక డాలరు ప్రకృతి ఉత్పాతాల వల్ల కలిగిన నష్టాలను పూడ్చడానికే ఖర్చు అవుతోంది. మరో పదేళ్ళలో ఇది రెండు డాలర్లకు పెరగవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు అప్పులిచ్చే అంతర్జాతీయ సంస్థలు ఆయా దేశాలలో ఉన్న వాతావరణపరమైన రిస్క్‌లను తమ అంచనాలలో పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఇప్పుడిప్పుడే ఆ సంస్థలు ఈ విషయంపై దృష్టిపెడుతున్నాయి. అంటే రాబోయే రోజులలో వాతావరణపరమైన ఉత్పాతాలు అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక స్వావలంబనపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయన్నమాట! అదే జరిగితే ఆ దేశాల రాజకీయ స్వావలంబన సైతం ప్రమాదంలో పడ్డట్టే! ఇప్పటికే అంతర్జాతీయ బీమా సంస్థలు అభివృద్ధి చెందుతున్న దేశాలలో వాతావరణపరమైన ప్రమాదం ఉన్న ఆస్తులను బీమా చేయడానికి నిరాకరిస్తున్నాయి. ఆయా దేశాలకు అప్పులు ఇస్తున్న అంతర్జాతీయ ఫైనాన్స్ ఏజెన్సీలు వడ్డీ రేట్లను భారీగా పెంచేశాయి. రిస్క్ ఎంత ఎక్కువగా ఉంటే వడ్డీ రేటు అంత ఎక్కువగా ఉంటోంది. ఈ పరిస్థితి అభివృద్ధి చెందుతున్న దేశాలను మరింత అభద్రత వైపు నెడుతోంది. ఆయా దేశాల ఆర్థికవ్యవస్థ మరింత పేదరికం వైపు దిగజారే ప్రమాదం లేకపోలేదు, ఏ రకంగా చూసినా అది అభిలషణీయమైన విష యం కాదు.
మరి వాతావరణపరమైన మార్పుల కారణంగా తమ భౌగోళిక వనరుల విషయంలో అభద్రతను ఎదుర్కొంటున్న అభివృద్ధిచెందుతున్న, వెనుకబడిన దేశాల విషయంలో అంతర్జాతీయ ఫైనాన్షియల్ మార్కెట్, బీమా కంపెనీలు సానుకూల ధోరణితో స్పందిస్తాయా? ఎప్పటిలాగే తమ సహకారాన్ని అందిస్తాయా? ‘క్లైమేట్ వైజ్’ అనే సంస్థకు అంతర్జాతీయంగా 29 ఇన్స్యూరెన్స్ పరిశ్రమలకు చెందిన వివిధ సంస్థలతో మంచి ‘నెట్‌వర్క్’ ఉంది. వాతావరణపరమైన మార్పుల కారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలోని భౌగోళిక వనరులు దెబ్బతినకుండా పటిష్టమైన చర్యలు తీసుకునేందుకు ఇన్స్యూరెన్స్ సం స్థలు ఇతోధికంగా ముందుకి రావాలని ‘క్లైమేట్ వైజ్’ సూచించింది. ప్రకృతి వనరుల రక్షణకు ఎంత పటిష్టమైన ఏర్పాట్లు ఉంటే ఇన్స్యూరెన్స్ పరిశ్రమకు అంత తక్కువ రిస్క్ ఉంటుందన్నది ‘క్లైమేట్ వైజ్’ ఆలోచన. అంతర్జాతీయ స్థాయిలో పనిచేసే ఫైనాన్షియల్ సంస్థలు, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు కూడా ఈ దిశలో ఆలోచించి దీర్ఘకాలిక ప్రణాళికలతో పటిష్టమైన చర్యలు చేపట్టాలని క్లైమేట్ వైజ్ సూచించింది. దీనివల్ల అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక స్వావలంబన సురక్షితంగా ఉండడమేకాకుండా, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా కొనసాగుతుందని క్లైమేట్ వైజ్ సూచిస్తోంది.
అయితే క్లైమేట్ వైజ్ చేసిన ఈ ప్రతిపాదన అంతర్జాతీయంగా ఇన్స్యూరెన్స్ కంపెనీలకు ఆమోదయోగ్యంగా ఉండకపోవచ్చు. ఇప్పటికే బీమా కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో ప్రకృతిపరమైన రక్షణకు, కార్బన్ డయాక్సైడ్‌ను నియంత్రించడానికి 30 ట్రిలియన్ డాలర్ల మూలధన పెట్టుబడిని పెట్టాయి. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ బీమా కంపెనీలు ఖనిజ ఇంధన (్ఫసిల్ ఫ్యూయల్) సంబంధిత వనరుల విషయంలో తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నాయి. మిగతా బీమా కంపెనీలు కూడా ఆ దిశగా నిర్ణయం తీసుకోబోతున్నాయి.
అంతర్జాతీయంగా బీమా కంపెనీలు, ఫైనాన్స్ సంస్థలు అభివృద్ధి చెందుతున్న దేశాల భౌగోళిక వనరుల రక్షణ విషయంలో సహకరించకుంటే- ఆ దేశాలు తమ మనుగడ కోసం ప్రపంచ బ్యాంకు, ఇతర ఆర్థిక పుష్ఠిగల దేశాల వద్దకు పరుగులు తీయాల్సిన పరిస్థితి వస్తుంది. అదే జరిగితే అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక స్వావలంబన, రాజకీయ సార్వభౌమత్వం ప్రమాదంలో పడ్డట్టే. బడా దేశాలు భోగలాలసతో చేస్తున్న ప్రకృతి శోషణ వల్ల సంభవిస్తున్న వాతావరణపరమైన ఉత్పాతాలు ఈ పరిణామాలలో అత్యంత స్వల్పమైన ప్రమేయం ఉన్న దేశాల అస్థిత్వానే్న దెబ్బతీస్తున్నాయి.

-డాక్టర్ దుగ్గిరాల రాజకిశోర్ 80082 64690