రాష్ట్రీయం

పొత్తులు..ఎత్తులు..మీ ఇష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 8: ‘తెలంగాణలో పార్టీని అధికారం దిశగా నడిపించేందుకు అవసరమైన ఎత్తులు, పొత్తులు మీ ఇష్టం..’ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఎపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ పార్టీ నాయకులకు సూచించారు. ముందస్తు ఎన్నికల హడావుడి నేపథ్యంలో చంద్రబాబు శనివారం అమరావతి నుంచి హైదరాబాద్‌కు చేరుకుని పార్టీ కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ కార్యవర్గంతో సమావేశమై చర్చించారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే విషయంలో జోరుగా సాగుతున్న ప్రచారం గురించి తెలంగాణ పార్టీ నాయకులు ప్రస్తావించగా, ‘బ్రదర్ మీకు ఏదీ మంచిదనిపిస్తే, ఆ నిర్ణయం తీసుకోండి, ఇందులో నా ప్రమేయం ఏమీ ఉండదు, వత్తిడి అసలే ఉండదు, పార్టీని అధికారం వైపు నడిపించండి, పార్టీ శ్రేణులను కాపాడుకోండి, ఇందుకు అవసరమయ్యే సహాయ, సహకారాలు పూర్తిగా అందిస్తాను..’ అని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం.
చెప్పకనే చెప్పిన చంద్రబాబు..
దీంతో కాంగ్రెస్‌తో చెలిమి చేసే విషయంలో చంద్రబాబు చెప్పకనే చెప్పినట్లుగా పార్టీ తెలంగాణ నాయకులు సంతోషించారు. తన నోటి నుంచి ఎందుకు చెప్పాలని చంద్రబాబు భావించి ఉంటారు. అందుకే వ్యూహాత్మకంగా పార్టీ నాయకులనే నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇప్పటికే మీడియాలో కాంగ్రెస్-టీడీపీ కలిసి పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అంతేకాదు ఇది అపవిత్ర పొత్తు అంటూ బీజేపీ, మజ్లీస్ నేతలు దండెత్తడంతో, పొత్తుల సంగతిని ప్రచారం చేయడాన్ని ఆ పార్టీలే భుజానికి ఎత్తుకున్నాయని, ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదని తెలంగాణ టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఏదైనప్పటికీ చంద్రబాబు తమకు స్వేచ్ఛ ఇవ్వడం వల్ల కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని నేతలు భావిస్తున్నారు.
ఒకవేళ చంద్రబాబు నాయుడే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని శనివారం జరిగిన సమావేశంలో సూచించి ఉంటే మిగతా పార్టీలూ ఇంకా గోల చేస్తాయన్న అనుమానాలు టీడీపీ నేతలకు లేకపోలేదు. ఎందుకంటే దివంగత ఎన్టీఆర్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగానే 1982 సంవత్సరంలో తెలుగు దేశం పార్టీని స్థాపిస్తే, ఇప్పుడు ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటారా? అని మిగతా పార్టీలు ధ్వజమెత్తుతాయి. ఇప్పుడు మాత్రం ఆ విధంగా చేయవా? అనే ప్రశ్న ఉత్పన్నం కాకుండా ఉండదు. అయితే తమది జాతీయ పార్టీ కాబట్టి, తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను బట్టి, అక్కడి స్థానిక నాయకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తనకు చెప్పుకునే అవకాశం ఉంటుందని చంద్రబాబు ఎత్తుగడ అయి ఉంటుందని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను దెబ్బ తీయాలంటే ఇంత కంటే మంచి అవకాశం రాదని చంద్రబాబు భావించి ఉంటారన్న విశే్లషణ కూడా జరుగుతున్నది.

చిత్రం..ఎన్టీఆర్ భవన్‌లో శనివారం నిర్వహించిన తెలంగాణ టీడీపీ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు