జాతీయ వార్తలు

నాక్, ఎన్‌బీఏల విస్తరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: ఉన్నత విద్యా సంస్థల పనితీరును మదింపు వేసి గుర్తింపు ఇచ్చే నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ (నాక్), నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ (ఎన్‌బీఏ) సంస్థలను విస్తరించనున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ చెప్పారు. ఐఐటీ, ఐఐఎంలు, నాక్, ఎన్‌బీఏ సంస్థలు త్వరితగతిన విద్యా సంస్థలకు గుర్తింపు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. నాక్, ఎన్‌బీఏలతో ఐఐటీ, ఐఐఎం సంస్థలు కలిసి సమష్టి భాగస్వామ్యంతో ఒక అక్రిడేషన్ ఏజన్సీని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం దేశంలో 15 శాతం ఉన్నత విద్యా సంస్థలకు మాత్రమే గుర్తింపు ఉందని ఆయన చెప్పారు. విద్యా సంస్థలకు గుర్తింపు ఇచ్చే ప్రక్రియ వేగవంతం చేసేందుకు అవసరమైన ప్రణాళికను ఖరారు చేయాలని ఐఐటీ, ఐఐఎంలను కోరినట్లు ఆయన చెప్పారు. ఇక్కడ జరిగిన 4వ అంతర్జాతీయ అక్రిడేషన్ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా సంస్థల్లో విద్యార్థులు ఉన్నత ప్రమాణాలతో అధ్యయనం చేయడం, నాణ్యమైన విద్య అనే రెండు సూచికలను ప్రామాణికంగా తీసుకుని గుర్తింపు ఇవ్వాలని యోచిస్తున్నట్లు చెప్పారు. ఈ రెండు అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ఉన్నత విద్యా సంస్థలకు గుర్తింపు ఇస్తామన్నారు. ఉన్నత విద్యా సంస్థల్లో విద్యా ప్రమాణాలకు 80 శాతం వెయిటేజి ఇస్తామన్నారు. శాటిలైట్ ప్రక్రియ ద్వారా విద్యా సంస్థల్లో ఉన్న వసతి సదుపాయాల వివరాలను తెలుసుకుంటామన్నారు. అలాగే విద్యా సంస్థలను తనిఖీ చేయడం కూడా ఇందులో భాగంగా ఉంటుందన్నారు. ప్రమాణాలను పాటించే విద్యా సంస్థలకు ఢోకా ఉండదన్నారు. నాసిరకంతో ప్రమాణాలతో నడిచే విద్యా సంస్థలకు గుర్తింపు ఇచ్చే అవకాశం ఉండదన్నారు. ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి ఆర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ప్రమాణాలు పాటించని విద్యాసంస్థలకు గుర్తింపు ఇవ్వరాదని, ప్రవేశాలకు అనుమతి ఇవ్వరాదని కోరారు. 2022-23 విజన్‌లో భాగంగా కఠినమైన నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి జవడేకర్ మాట్లాడుతూ అక్షరాస్యత మిషన్‌లో విద్యార్థులను భాగస్వాములను చేయాలన్నారు. నిరక్షరాస్యతను పారద్రోలాలన్నారు. వచ్చే ఐదేళ్లలో దేశంలో సంపూర్ణ అక్షరాస్యతను సాధించాలన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడచినా నిరక్షరాస్యత ఉండడం మంచి పరిణామం కాదన్నారు.