రాష్ట్రీయం

విశాఖ భూములు కబ్జా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 9: గడచిన నాలుగున్నరేళ్ళలో టీడీపీ నాయకులు విశాఖలోని వేలాది ఎకరాల భూములను కబ్జా చేశారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. పాదయాత్రలో భాగంగా విశాఖ నగరంలోని కంచరపాలెంలో ఆదివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. విశాఖలో కనిపించిన భూములన్నింటినీ టీడీపీ నేతలు కబ్జా చేశారని అన్నారు. విశాఖలో పేదల భూములను లాక్కుని, తమ వారికి, తమ బినామీలకు కట్టబెట్టారని విమర్శించారు. రాజశేఖరరెడ్డి హయాంలో రాజీవ్ స్వగృహ కోసం భూమిని కేటాయించారని, అదే భూమిని ముఖ్యమంత్రి చంద్రబాబు తన అనుయాయులకు కట్టబెట్టారని జగన్ అన్నారు. నగరంలో ఫైవ్‌స్టార్ హోటల్ నిర్మించడానికి ఎంతో విలువైన భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా ఇచ్చేశాని ఆయన ఆరోపించారు. ఇంకా చాలదన్నట్టు ఓ ప్రైవేటు వ్యక్తి భూమిని కూడా సదరు ప్రైవేటు సంస్థకు కట్టబెట్టి, ఆ వ్యక్తికి 1200 కోట్ల రూపాయల విలువైన భూమిని ధారాదత్తం చేశారని అన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు భూ సేకరణ సమయంలో అయ్యన్నపాత్రుడు, మరొక ఎంపీ భూమిని ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. ఈ భూ కుంభకోణాలపై నియమించిన సిట్ ఇచ్చిన నివేదికను ఎందుకు బహిర్గతం చేయలేదని జగన్ ప్రశ్నించారు.
విశాఖలో వరుసగా మూడేళ్ళు భాగస్వామ్య సదస్సులు నిర్వహించి, 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు చంద్రబాబు చెప్పారని, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ పాలసీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఏపీ మొత్తం మీద ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా రాలేదని జగన్ అన్నారు. అలాగే ఏపీ మొత్తం మీద 40 లక్షల ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు ప్రకటించారు. ఈ నాలుగేళ్లలో కనీసం లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయారని జగన్ విమర్శించారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ ఐటీ రంగంలో 18 వేల మంది పనిచేసేవారని, రెండు వేల కోట్ల ఐటీ ఎగుమతులు ఉండేవని అన్నారు. ఇప్పుడు ఐటీ ఉద్యోగాలు గణనీయంగా పడిపోయాయని, కేవలం 1165 కోట్ల రూపాయల ఎగుమతులు మాత్రమే జరుగుతున్నాయని అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ నష్టాల్లో కూరుకుపోతే, రాజశేఖరరెడ్డి కేంద్ర పెద్దలతో మాట్లాడి, ఆ కర్మాగారాన్ని తిరిగి లాభాల బాటకెక్కించారని గుర్తుచేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత వరుసగా మూడేళ్ళు స్టీల్ ప్లాంట్ నష్టాల్లోనే నడుస్తోందని జగన్
అన్నారు. విశాఖ పోర్టులో 24 బెర్తుల్లో 12 బెర్త్‌లను ప్రైవేటుపరం చేశారని అన్నారు. గతంలో పోర్టులో 24 వేల మంది కార్మికులు పనిచేస్తుంటే, ఇప్పుడు 400 మంది మాత్రమే ఉన్నారని అన్నారు. ఉత్తరాంధ్రలోని నిరుపేదలకు ఖరీదైన వైద్యం అందించేందుకు 250 కోట్లతో రాజశేఖరరెడ్డి విమ్స్‌ను నిర్మిస్తే, దాన్ని కూడా ప్రైవేటుపరం చేసేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని అన్నారు. కేజీహెచ్‌లో డాక్టర్లు, నర్స్‌ల పోస్ట్‌ల భర్తీకి కూడా సీఎం ఎందుకు వెనకాడుతున్నారని జగన్ ప్రశ్నించారు. విశాఖ ప్రజలు జ్వరాలతో విలవిలలాడుతుంటే, వారికి ఉచిత వైద్యం అందడం లేదని, వారంతా లక్షల రూపాయలు వెచ్చించి, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని దీనికి కారణం చంద్రబాబేనని జగన్ ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వంలో చదువు పేదలకు భారంగా మారిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విద్యనభ్యసించేలా చేస్తానని, పేద పిల్లల్ని బడికి పంపిస్తే, వారి తల్లిదండ్రులకు 15 వేల రూపాయలు నజరానాగా ఇస్తానని జగన్ ప్రకటించారు. అలాగే ఉన్నత విద్య చదువుకునే పిల్లల హాస్టల్ ఖర్చులను కూడా తామే భరిస్తామని అన్నారు. పేదలను ఆదుకోవడానికి రాజశేఖరరెడ్డి ఒక అడుగు ముందుకు వేస్తే, తాను రెండు అడుగులు ముందుకు వేస్తానని జగన్ ప్రకటించారు.
ఇదిలా ఉండగా దేశంలో పెట్రోలు ధరలు మిన్నంటుతున్నాయని, సామాన్యులు వాహనాలను బయటకు తీసే పరిస్థితి లేదని జగన్ అన్నారు. దీనికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ బంద్‌కు పిలుపిస్తే, దానికి టీడీపీ మద్దతు ఇవ్వడం విడ్డూరంగా ఉందని అన్నారు. పెట్రోలు ధరల పెంపులో చంద్రబాబు పాత్ర కూడా ఉందని జగన్ విమర్శించారు. పక్క రాష్ట్రాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు మనకన్నా తక్కువగానే ఉన్నాయని, మన రాష్ట్రంలో ఎందుకు ధరలు తగ్గలేదని జగన్ ప్రశ్నించారు.
చిత్రం..విశాఖలో జరిగిన జగన్ బహిరంగ సభకు తరలివచ్చిన జనం.. అభివాదం చేస్తున్న వైకాపా అధినేత