Others

అవసానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరైనా
మరణం కేసి అడుగులేస్తుంటారు

కోరికల సాధన కోసం
అలుపు లేకుండా శ్రమిస్తుంటారు

ఎనె్నన్ని అవస్థలు పడినా
తీరిక లేకుండా గెలుపు కోసం
కత్తి అంచు మీదనో
నిప్పుల మీదనో నడుస్తుంటారు

పచ్చని ఆకు పండు బారినట్టు
అమ్మ ముఖ కళ
రోజుకింత మారిపోతుంది

ఒక్కచోట
కుదురుగా వుంటలేదు
అప్పుడే కూర్చోపెట్టమంటుంది
మరుక్షణమే పడుకోపెట్టమంటుంది
మాట పెగలడం లేదు
తాయ మాయ తండ్లాడుతుంది

ఎప్పుడూ ఏదో
సోదిచ్చుకొని పనిచేసేది
అన్నిటికీ పట్టుకపోవుడే
అందరినీ పులుకు పులుకున
లోతుకుపోయన కండ్లతో చూస్తుంది

పుల్లలు చీరి విస్తార్లు కుట్టిన
నారు పీకి నాట్లేసిన
ఒడుపుగా కలుపు కలిసిన
కొడవలితో పంట కోసిన
చేతులు అచేతనమయ్యాయ

అందరికీ గోరుముద్దలు తినిపించిన
అమ్మకు ఇప్పుడు తినిపిస్తుంటే
నిశ్శబ్దంగా కండ్లలో నీళ్లు తిరుగుతునా నయ

మందిల తిరిగే ప్రాణం
నెల రోజులుగా
ఇప్పుడు మందుల మీదే నిలబడుతుంది
అపరాత్రి నన్ను పిలిచి
మా ఇల్లు అమ్మినమనే విషయం మరిచి
‘మన ఇంట్ల పడుకోపెట్టు అంటుంది
ఇది మన ఇల్లే అంటే
కాదు తంగళ్లపల్లిలో ఉంది’
దేని కోసమో ఎవరి కోసమో
గాయపడిన లేడిపిల్లలా
బెదిరి బెదిరి చూస్తూ అంటుంది

మా బాపు
నలుబై ఏండ్ల క్రితం పోయనప్పుడు
ఉగ్గ పట్టుకొని
కోడి తన పిల్లలను రెక్కలకింద దాచుకున్నట్టు
దగ్గరకు తీసుకొని
మాకు దీముగా నిలిచిన అమ్మ
ఇప్పుడు గుండె ధైర్యం చెడుతుంది

అమ్మ చుట్టూ అల్లుకున్న
తీపి జ్ఞాపకాలు నన్ను పిల్లగాన్ని చేసి
వెక్కి వెక్కి దుఃఖించేలా చేస్తున్నవి

భూమి వాన కోసం
ప్రయాణికుడు బస్సు కోసం
చేను నీళ్ల కోసం
ఆకలి అన్నం కోసం తపించినట్టు
బల్లమీద పడుకొని
అమ్మ దేని కొరకో ఎదురుచూస్తుంది

పుట్టుక ఎంత సంతోషమో
అవసానం అంతకంత యాతన

ఎనభై ఐదు సంవత్సరాలుగా
నిరంతరం మా కొరకు కొట్టుకున్న గుండె
క్రమంగా మెల్లగవుతుంది కానీ
మా అమ్మ మనసు మాత్రం రెట్టింపు వేగంతో
అనేక విధాలుగా పాతులాడుతుంది

- జూకంటి జగన్నాథం