రాష్ట్రీయం

బాల కవుల పుస్తకావిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోర్తాడ్, సెప్టెంబర్ 9: ఏర్గట్ల మండలం తడ్‌పాకల్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు కవితా రచనలో ముందుకు దూసుకెళ్తున్నారు. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఇప్పటికే అనేక పుస్తకాలను ఆవిష్కరింపజేసుకున్న ఇక్కడి విద్యార్థులు, తాజాగా ఆదివారం మరో కవితా సంపుటిని రచించి ప్రముఖులచే మన్ననలు పొందారు. సిరిసిల్లా జిల్లా కేంద్రంలో చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ ట్రస్టు సంపాదకులు ఎం.వేదకుమార్, జాతీయ బాలసాహిత్య మండలి అధ్యక్షుడు శర్మల నేతృత్వంలో గత రెండు రోజులుగా రాష్ట్ర స్థాయి బాలసాహిత్య కార్యశాల జరుగుతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు వారు రచించిన పుస్తకాలతో వేదిక వద్ద గళాన్ని వినిపించారు. ఇందులో ఏర్గట్ల మండలం తడ్‌పాకల్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇటీవలే వారు రచించిన నూతన కవితా సంపుటి ‘నవ కవనం’ను ప్రముఖ సాహితీవేత్తల చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. దీంతో పాటు వచనా కవిత్వం, నేనూ కథ రాస్తున్నాను అనే రచనలను కూడా ఆవిష్కరింపజేశారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు వారు రచించిన కవితలను వేదికపై చదివి ఆహుతుల అభినందనలు అందుకున్నారు. ఈ సందర్భంగా సాహితీవేత్తలు మాట్లాడుతూ, నేటి సమాజంలో బాలలకు కవిత్వం, కథలు ఎలా రాయాలనే విషయమై సూచించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తడ్‌పాకల్ పాఠశాల తెలుగు భాషోపాధ్యాయుడు ప్రవీణ్‌శర్మ చేస్తున్న కృషిని నిర్వహకులు అభినందించారు. ఇప్పటివరకు ఏడు పుస్తకాలను పాఠశాల విద్యార్థుల ద్వారా వెలువరించడం జరిగిందని, రాష్ట్రంలో మరే ఇతర పాఠశాల కూడా ఇంత గొప్పగా చేయలేకపోయారని, ఇదొక రికార్డు అని అభినందించిన ట్రస్టు నిర్వహకులు, ప్రవీణ్‌శర్మను ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేశారు. భవిష్యత్తులోనూ మరిన్ని రచనలు తీసుకువచ్చేలా కృషి చేస్తానని, ఇప్పటికే తమ పాఠశాలకు చెందిన విద్యార్థులు అనేక కవితలు రాసి సంపుటి కోసం సిద్ధం చేశారని ప్రవీణ్‌శర్మ తెలిపారు. కవితలు రచించిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు బహూకరించారు. ఈ కార్యక్రమంలో నేటి నిజం పత్రికా సంపాదకులు బైస దేవిదాస్, నేషనల్ బుక్ ట్రస్టు సంపాదకులు డాక్టర్ పత్తిపాక మోహన్, రంగినేని ట్రస్టు అధ్యక్షుడు మోహన్‌రావు, పిల్లల పండగ సంస్థ కన్వీనర్ గరిపెల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులను సాహిత్యం దిశగా ప్రోత్సహిస్తున్న ప్రవీణ్‌శర్మను ఘనంగా సన్మానించారు.

చిత్రం..తడ్‌పాకల్ విద్యార్థుల కవితా సంపుటిలను ఆవిష్కరిస్తున్న కవులు