రుచి

ఆరగింపు అందుకోవయ్యా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా!

అంటూ మొదలుపెట్టే ప్రతిపనిలో తోడుగా నిలిచి, ఎలాంటి విఘ్నాలు ఎదురుకాకుండా చూడు తండ్రీ అంటూ నైవేద్యం సమర్పించి గణపతిని ప్రార్థించిన తర్వాతే ఏ పనైనా మొదలుపెట్టడం మన సంప్రదాయం. అలా భాద్రపద శుద్ధ చవితిరోజు వినాయకుడికి సమర్పిందే నైవేద్యం కోసం కొన్ని వంటలు..

పూర్ణం ఉండ్రాళ్లు
కావలసిన పదార్థాలు
బియ్యప్పిండి: రెండు కప్పులు
నూనె: ఒక చెంచా
పచ్చిసెనగపప్పు: కప్పు
ఎండుకొబ్బరిపొడి: రెండు చెంచాలు
బెల్లం తురుము: కప్పు
యాలకుల పొడి: కొద్దిగా
ఉప్పు: చిటికెడు
డ్రైఫ్రూట్స్: నచ్చినవి

తయారుచేసే విధానం

ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గినె్న పెట్టి మూడు కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. అందులో కాస్త ఉప్పు, ఒక చెంచా నూనె వేయాలి. తరువాత ఇందులో బియ్యప్పిండిని వేస్తూ ఉండ కట్టకుండా కలపాలి. పిండి ముద్దలా అయ్యాక స్టవ్‌పై నుంచి దించి పక్కన పెట్టుకోవాలి. తరువాత కుక్కర్‌లో పచ్చి సెనగపప్పు వేసి మెత్తగా ఉడికించాలి. తరువాత దీనిలో బెల్లం కలిపి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. ఇందులోనే యాలకులపొడి, ఎండు కొబ్బరిపొడి, నచ్చినవారు డ్రైఫ్రూట్స్ కూడా వేసి కలపాలి. తరువాత ఉడికించిన బియ్యప్పిండి మిశ్రమాన్ని కొంచెంకొంచెంగా తీసుకుని చిన్న చిన్న పూరీల్లా చేసి మధ్యలో రుబ్బి ఉంచుకున్న పూర్ణం మిశ్రమాన్ని పెట్టి చుట్టూ బియ్యప్పిండితో మూసేయాలి. ఇప్పుడు వీటిని ఇడ్లీ కుక్కర్‌లో ఆవిరిపై అయిదు నిముషాలు ఉడికించాలి. అంతే గణపతికి ఎంతో ఇష్టమైన పూర్ణం ఉండ్రాళ్లు రెడీ..

ఉండ్రాళ్ల పాయసం

కావలసిన పదార్థాలు
బియ్యప్పిండి: కప్పు
పంచదార: ఒకటిన్నర కప్పులు
పాలు: కప్పు
యాలకుల పొడి: కొద్దిగా
ఉప్పు: చిటికెడు
డ్రైఫ్రూట్స్: తగినన్ని

తయారుచేసే విధానం

ముందుగా స్టవ్‌పై మందపాటి గినె్నను ఉంచి అందులో నీళ్లు పోసి మరిగించుకోవాలి. అందులోనే ఉప్పు, బియ్యప్పిండి వేసి ఉండల్లేకుండా బాగా కలిపి దించి పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమం చల్లారాక చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. మరో గినె్నలో పంచదారను, కొద్దిగా నీళ్లను పోసి మరిగించాలి. ఇందులోనే యాలకులపొడి, ఇష్టమున్నవారు కొబ్బరి తురుము, డ్రైఫ్రూట్స్‌ను వేసుకుని మరిగించాలి. తరువాత ముందుగా తయారుచేసి పెట్టుకున్న ఉండ్రాళ్లను ఇందులో వేయాలి. తరువాత ఇందులో పాలను కలపాలి. మరింత చిక్కదనం కావాలనుకునేవారు పాలతో పాటు ఒక స్పూను బియ్యప్పిండిని కూడా కలపితే సరి. అంతే ఉండ్రాళ్ల పాయసాన్ని స్వామివారికి నివేదించవచ్చు.

జిల్లేడు కాయలు

కావలసిన పదార్థాలు
బియ్యప్పిండి: కప్పు
ఉప్పు: తగినంత
నెయ్యి: నాలుగు చెంచాలు
ఉడికించిన ఆలూ ముక్కలు: పావు కప్పు
బీన్స్, క్యారెట్ ముక్కలు: పావు కప్పు
గరంమసాలా: కొద్దిగా
పచ్చిమిర్చి: రెండు
జీలకర్ర: కొద్దిగా
అల్లం తరుగు: కొద్దిగా

తయారుచేసే విధానం

ఒక గినె్నలో నీళ్లూ, చిటికెడు ఉప్పు, చెంచా నెయ్యి వేసి స్టవ్‌మీద ఉంచాలి. ఈ నీళ్లు మరుగుతున్నప్పుడు బియ్యప్పిండి వేయాలి. అది ఉడికి దగ్గరకు వచ్చాక బాగా కలిపి దించేయాలి. తరువాత ఒక బాణలిలో రెండు చెంచాల నెయ్యి కరిగించి అందులో జీలకర్ర వేసి వేయించాలి. వేగాక ఉడికించి పెట్టుకున్న ఆలు, బీన్స్, కారెట్ ముక్కలు వేయాలి. రెండు నిముషాలు అయ్యాక అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, గరం మసాలా వేసి బాగా వేయించాలి. తరువాత మంట తగ్గించి మూత పెట్టేయాలి. కాసేపటికి కూరగాయల ముక్కలు వేగుతాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని దింపేయాలి. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని బియ్యప్పిండి ముద్దను కొద్దిగా తీసుకుని పూరీలా వత్తుకోవాలి. ఇందులో కూర మిశ్రమాన్ని ఉంచి బియ్యప్పిండితో మూసేయాలి. ఇలా మిగిలిన పిండినీ జిల్లేడుకాయల్లా చేసుకోవాలి. నెయ్యి రాసుకోవడం వల్ల జిల్లేడుకాయలు విరిగిపోకుండా వస్తాయి. ఇలా చేసుకున్న వాటిని ఇడ్లీపాత్రలో ఆవిరిపైన ఐదు నిముషాలు ఉడికించి, తీసి, గణపతికి నివేదించాలి.

కోవా మోదకాలు

కావలసిన పదార్థాలు
చిదిమిన కోవా: రెండు కప్పులు
పంచదార: అరకప్పు
సన్నగా తరిగిన పిస్తా: రెండు చెంచాలు
యాలకులపొడి: కొద్దిగా
కుంకుమపువ్వు: కొద్దిగా
పాలు: రెండు చెంచాలు

తయారుచేసే విధానం

నాన్‌స్టిక్ పాన్‌లో పొడిపొడిగా చిదిమిన కోవా, పంచదారను కలిపి స్టవ్‌పై ఉంచాలి. ఒక నిముషం పాటు తిప్పాలి. తరువాత స్టవ్‌ను సిమ్‌లో ఉంచి ఐదు నిముషాల పాటు కలియబెడుతూ ఉంచి, అది దగ్గర పడ్డాక దించి చల్లారనివ్వాలి. ఇంతలో ఒక గినె్నలో పాలుపోసి కొద్దిగా వేడిచేసుకోవాలి. ఇందులో కుంకుమపువ్వును కరిగించి కోవా విశ్రమంలో కలపాలి. ఇప్పడు సన్నగా తరిగిన పిస్తాపలుకులు (నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు), యాలకులపొడి కోవా మిశ్రమంలో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లా చేసి మోదక్ వౌల్డ్‌తో కానీ చేత్తో కానీ మోదకం ఆకారంలో వత్తితే కోవా మోదకాలు తయారు.

సెనగపప్పు మోదకాలు

కావలసిన పదార్థాలు
బియ్యప్పిండి: కప్పు
కొబ్బరి తురుము: అరకప్పు
ఉడికించిన శనగపప్పు: కప్పు
ఆవాలు, జీలకర్ర: ఒక స్పూన్
ఉప్పు: తగినంత
నెయ్యి: నాలుగు చెంచాలు

తయారుచేసే విధానం

ఒక గినె్నలో నీళ్లు, చెంచా నెయ్యి, ఉప్పు తీసుకుని స్టవ్‌పై పెట్టాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో బియ్యప్పిండి వేయాలి. బియ్యప్పిండి ఉడికి దగ్గరగా అయ్యాక దించేయాలి. బాణలిలో మిగిలిన నెయ్యిని వేసి కరిగించి, అందులో ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. అవి వేగాక ఉడికించి పెట్టుకున్న సెనగపప్పు, తగినంత ఉప్పు, కొబ్బరి తురుము వేసి వేయించుకుని స్టవ్ కట్టేయాలి. ఇప్పడు మోదక్‌ల అచ్చులో నెయ్యిరాసి బియ్యప్పిండి మిశ్రమాన్ని పూరీలా చేసి అందులో ఉంచాలి. తరువాత దానిపై తగినంత సెనగపప్పు మిశ్రమాన్ని ఉంచి మోదక్‌లా వత్తుకోవాలి. ఇలాగే మిగిలిన వాటిని చేసుకుని, వీటిని ఇడ్లీపాత్రలో ఉంచి ఐదు నిముషాలపాటు ఆవిరిపై ఉడికించుకుని స్వామివారికి నివేదించవచ్చు.