జాతీయ వార్తలు

బీజేపీని దించేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: ప్రధాని మోదీ పాలనలో దేశం విభజనకు గురవుతోందని, ప్రతిపక్షాలన్నీ ఐకమత్యంగా ఉండి వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు. పెట్రోధరల పెంపునకు నిరసనగా చేపట్టిన భారత్ బంద్ కార్యక్రమంలో రామలీలా మైదానంలో సోమవారం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. కైలాస్ మానససరోవర్ యాత్ర నుంచి తిరిగి వచ్చిన అనంతరం ఆయన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆకాశాన్ని అంటుతున్న పెట్రోలు ధరలు, వేల కోట్ల అవకతవకలు జరిగిన రాఫెల్ ఒప్పందం, రైతుల ఆత్మహత్యలు, మహిళలపై అఘాయిత్యాలు, నిరుద్యోగం వంటి సమస్యలపై మోదీ ఎందుకు నోరు విప్పడం లేదని ధ్వజమెత్తారు. 2014 ఎన్నికల సందర్భంగా దేశంలోని యువత, రైతులు, మహిళలకు పలు వాగ్దానాలు కుమ్మరించారని, ప్రజలు వాటిని నమ్మి అతడికి అధికారం ఇచ్చారని అన్నారు. అయితే అధికారం చేపట్టిన నాలుగున్నరేళ్లలో మోదీ తమకు ఏం చేశారో గ్రహించారన్నారు. 70 ఏళ్లలో గత ప్రభుత్వాలు చేయనిది తాము నాలుగేళ్లలో చేశామని నరేంద్ర మోదీ తరచూ అంటుంటారని, ఆయన ఈ నాలుగేళ్లలో చేసింది 70 ఏళ్లలో తాము చేయని మాట వాస్తవమేనని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు
దేశంలో ఎక్కడ చూసినా వారు (ఎన్డీఏ ప్రభుత్వం) ప్రజలను విభజించడమే కన్పిస్తోందని, ఒక మతానికి, మరో మతానికి, ఒక మనిషికి మరో మనిషికి, ఒక ప్రాంతానికి, మరో ప్రాంతానికి మధ్య చిచ్చుపెడుతూ విభజన రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పెట్రోధరల పెంపుకు వ్యతిరేకంగా బంద్‌లో పాల్గొనడం విపక్షాల ఐక్యతకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే ఐకమత్యంతో రానున్న ఎన్నికల్లో తాము ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయమని అన్నారు. తమకు వచ్చిన కష్టాలు, బాధలను ప్రజలు ప్రధాని నరేంద్రమోదీకి విన్నవించడానికి బదులుగా, విపక్షాలైన తమ వద్దకు వచ్చి చెప్పుకోవడం బాధాకరమేనని ఆయన అన్నారు. ఇదే నరేంద్ర మోదీ ప్రభుత్వానికి, తమకు మధ్య ఉన్న తేడా అని వ్యాఖ్యానించారు. ప్రధాన సమస్యలపై సైతం ప్రధాని నోరుమెదపరని, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకపోయినా, మహిళలపై బీజేపీ ఎమ్మెల్యేలు అత్యాచారాలకు పాల్పడుతున్నా ఆయనకు పట్టదని విమర్శించారు. గంటలు తరబడి ప్రసంగాలు మాత్రం చేస్తుంటారని, ప్రజలు ఆయనను చూసి విసుగుచెందారని అన్నారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడానికి మార్గం చూపకపోయినా, తన మిత్రులైన 20 మంది పారిశ్రామిక దిగ్గజాలకు మాత్రం ఆయన అడుగడుగునా మార్గదర్శకుడిగా నిలుస్తారని విమర్శించారు. రాఫెల్ ఒప్పందం పేరుతో 45 వేల కోట్ల రూపాయలను తన మిత్రుడైన ఒక పారిశ్రామికవేత్తకు బహుమతిగా ఇచ్చారని అన్నారు. నోట్ల రద్దుతో దేశంలోని వాణిజ్యాన్ని కుదేలు చేశారని, గబ్బర్ సింగ్ టాక్స్‌గా పిలిచే జీఎస్టీతో దేశప్రజలపై తీవ్ర భారం మోపారని విమర్శించారు. అసలు నోట్ల రద్దును ఎందుకు చేశారన్నది ఇప్పటికీ అయోమయమేనని రాహుల్‌గాంధీ విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, విపక్షాలకు చెందిన ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, లోక్‌తాంత్రిక్ జనతాదళ్ నేత శరద్ యాదవ్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..పెట్రో ధరల పెంపునకు నిరసనగా సోమవారం ఢిల్లీలో రామ్‌లీలా మైదానం జరిగిన సభలో వేదికపై సంఘీభావం తెలుపుతున్న కాంగ్రెస్ నేతలు మన్మోహన్ సింగ్, రాహుల్, ఆజాద్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తదితరులు