మెయన్ ఫీచర్

‘ప్రత్యేకాధికారాల’కు మూల్యం ఎంత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సైనిక దళాలకు ప్రత్యేకాధికారాల చట్టం’ సెగ సుప్రీం కోర్టును తాకింది. ‘ప్రత్యేకాధికారాలు’ వినియోగించుకుంటున్న సైన్యంపై కేసులు నమోదు కావడంతో ఈ వ్యవహారం కాస్తా సర్వోన్నత న్యాయస్థానం పరిశీలనకు వచ్చింది. శాంతిభద్రతల పరిరక్షణకు తాము తీసుకుంటున్న చర్యలను వ్యతిరేకిస్తూ కేసులు నమోదు చేయడాన్ని , తమను ప్రాసిక్యూట్ చేయడాన్ని నిరసిస్తూ పెద్ద సంఖ్యలో సైన్యం సుప్రీంలో కేసులు నమోదు చేస్తోంది.
‘సైనిక దళాలకు ప్రత్యేక అధికారాల చట్టం’ నిన్న మొన్నటిది కాదు. దేశ అవసరాల కోసం మనం రూపొందించుకున్న చట్టం కూడా కాదు. ఒక విధంగా చెప్పాలంటే
భారతీయులకు వ్యతిరేకంగా బ్రిటిష్ వారు రూపొందించిన చట్టం ఇది.
క్విట్ ఇండియా ఉద్యమం వేళ బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా భారతీయులు సమర శంఖారావాన్ని పూరించినపుడు ‘సాయుధ దళాలకు ప్రత్యేక అధికారాల ఆర్డినెన్స్’ను 1942 ఆగస్టు 15న బ్రిటిష్ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. వివిధ ప్రాంతాల్లో అల్లర్లు పెచ్చుమీరడంతో దేశవ్యాప్తంగా దీనిని అమలు చేసింది. 1947లో స్వాతంత్య్రం సిద్ధించినపుడు బెంగాల్ సహా పలు ప్రాంతాల్లో అల్లరి మూకలను నిరోధించేందుకు- అంతకుముందు క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా తెల్లదొరలు తెచ్చిన చట్టానికి అనుగుణంగానే కేంద్రం అత్యవసరంగా బెంగాల్ ఆటంకాల ప్రాంతాలు (సైన్యానికి ప్రత్యేక అధికారాలు) పేరుతో ఒక ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. తూర్పు బెంగాల్‌కు ఒక ఆర్డినెన్స్, ఉమ్మడి రాష్ట్రాల ఆర్డినెన్స్, బెంగాల్ ఆర్డినెన్స్ పేరుతో నాలుగు ఆర్డినెన్స్‌లను 1947లో తీసుకువచ్చింది. తర్వాత సైనిక దళాలకు ప్రత్యేకాధికారాల చట్టాన్ని 1958 సెప్టెంబర్ 11న తీసుకువచ్చింది. మణిపూర్, అస్సాంలోని కల్లోలిత ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ఈ చట్టాన్ని వినియోగించుకున్నారు. నాగాలాండ్‌లోనూ దీన్ని వినియోగించుకోవల్సి వచ్చింది.
ఏ రాష్ట్రంలోనైనా ఈ చట్టాన్ని వినియోగించాలంటే అందుకు కారణమైన పరిస్థితులను తేల్చాల్సి ఉంది. ఆటంకాలు కలిగించే ప్రాంతాల గుర్తింపునకు కేంద్రం ‘డిస్ట్రబ్డ్ ఏరియాస్ స్పెషల్ కోర్టుల చట్టం -1976’ను తీసుకువచ్చింది. ఈ కోర్టులు అల్లర్లు జరిగే ప్రాంతాలను నిర్ధారిస్తే ఆ ప్రాంతాల్లో సైన్యాన్ని రంగంలోకి దించి అదుపు చేయాలనేది కేంద్రం యోచన. తొలుత అస్సాం, నాగాలాండ్, ఇంఫాల్ మినహా మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్‌లో దీనిని అమలుచేశారు. తర్వాత దీన్ని దాదాపు అన్ని ఈశాన్య రాష్ట్రాల్లోనూ అమలుచేశారు.
‘అస్సాం మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్’ (అటానమస్ డిస్ట్రిక్ట్) చట్టాన్ని రూపొందించి 1953లో దానిని అమలులోకి తీసుకురావడం వెనుక పెద్ద కథే ఉంది. 1952లో తొలి సాధారణ ఎన్నికలను నాగా నేషనల్ కౌన్సిల్ పెద్దలు బహిష్కరించడంతో పాటు సాధారణ ఎన్నికలకు వ్యతిరేకంగా ఉద్యమించడంతో వారిని అణిచివేసేందుకు ఈ చట్టం తెచ్చారు. 1983లో ఇదే చట్టాన్ని పంజాబ్, చండీగఢ్‌ల్లో అమలు చేసినా తర్వాత 1997లో దానిని మినహాయించారు. 1990లో జమ్మూ కశ్మీర్‌కు మరో చట్ట సవరణ తీసుకువచ్చి వర్తింపచేశారు. ప్రస్తుతం ఈ చట్టం జమ్మూ కశ్మీర్‌లో అమలులో ఉంది.
గత 28 ఏళ్లుగా సైన్యం ఆగడాలపై అనేక ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. పార్లమెంటు సభ్యులు ఈ చట్టానికి అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ చీలిపోయారు. కాంగ్రెస్ నేత, మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం వంటి వారు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తుండగా, అమరీందర్ సింగ్ వంటి వారు సమర్ధిస్తున్నారు. ఎవరు ఎన్ని చెప్పినా శాంతి భద్రతలను కాపాడటం , అంతర్గత కలహాలను నియంత్రించడం ప్రభుత్వం బాధ్యత. రాజ్యాంగంలోని అధికరణం 355 ప్రకారం రాష్ట్రాల సంరక్షణ కేంద్రం బాధ్యత. విదేశీ దురాక్రమణ నుండి, అంతరంగిక కల్లోలం నుండి రాష్ట్రాలకు రక్షణ కల్పించి ఆయా ప్రభుత్వాలు రాజ్యాంగ బద్ధంగా కొనసాగేట్టు చేయడం కేంద్రం విధి. అయితే, ఆ సాకుతో సామాన్య ప్రజల హక్కులను కాలరాస్తామంటే ఎవరూ ఊరుకోరు. ఈశాన్య రాష్ట్రాల్లోనూ, జమ్మూ కశ్మీర్‌లోనూ నానాటికీ మితిమీరిపోతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్‌ఎస్‌పీఏ) అమలులో భాగంగా మానవ హక్కుల ఉల్లంఘనలు యథేచ్ఛగా జరుగుతున్నాయని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. మానవ హక్కుల పరిరక్షణ పేరిట తమపై కేసులు నమోదు చేయడంపై నైతిక సహనాన్ని కోల్పోతున్న సైన్యం సుప్రీంలో పిటిషన్లను దాఖలు చేస్తోంది. ఈ పిటిషన్ల సంఖ్య ఇటీవల భారీగా పెరుగుతోంది.
సామాన్యుల స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కబళిస్తున్న ఈ క్రూరమైన చట్టాన్ని ఉపసంహరించాలని లేదా భద్రతా దళాల అధికారాలను తగ్గించాలని చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ప్రత్యేక అధికారాల చట్టంలోని 4, 5 నిబంధనలు సైన్యానికి ప్రత్యేక అధికారాలను కట్టబెట్టాయి. ఐదుగురు ఒక చోట గుమిగూడితే- వారిని తీవ్రవాదులుగా లేదా ఉగ్రవాదులుగా అనుమానించి కాల్చివేసే హక్కు సైన్యానికి ఉంది. మారణాయుధాలు ఉన్నాయనే అనుమానం వస్తే ఏ కట్టడానినైనా కూలగొట్టవచ్చు. ఎటువంటి వారెంటు లేకుండానే ఏ వాహనాన్నైనా, వస్తువులనైనా సోదా చేయవచ్చు, ప్రత్యేకాధికారాల మాటున అత్యాచారాలు, చిత్రహింసలు , పౌరులను కాల్చివేయడం వంటి దుశ్చర్యలకు సైనికులు పాల్పడినా ప్రాసిక్యూట్ చేసే అవకాశం లేదు. ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం హత్య చేసిన వారికి మరణ దండన వంటి తీవ్రమైన శిక్షలు ఉన్నా, అవి ప్రత్యేకాధికారాల చట్టం కింద సైనికులకు వర్తించవు. ‘మణిపూర్ ఉక్కు మహిళ’గా పేరొందిన ఇరోం చాను షర్మిల ప్రత్యేక అధికారాల చట్టంలో సవరణలు తీసుకురావాలని ఎవరూ చేయని రీతిలో పోరాటం చేసింది. దాదాపు 16 ఏళ్ల పాటు ఆమె నిరశన దీక్ష కొనసాగించింది. 2000 నవంబర్ 5 నుండి 2016 జూలై 26 వరకూ ఆమె దీక్ష చేసింది. మధ్యలో విడుదల కావడం, అరెస్టు కావడం చాలాసార్లు జరిగింది. చివరికి ప్రజాపునరుత్థానం న్యాయకూటమి (పిఆర్‌జేఎ) పేరిట ఒక పార్టీని ప్రారంభించింది. ఆమె పోరాటం వెనుక ఎంతో మంది ఆవేదన, ఆగ్రహం ఉన్నాయి.
మణిపూర్‌లోని మలోం గ్రామంలో 2000 నవంబర్ 2న బస్టాప్ వద్ద నిలబడిన 11 మంది అమాయకులను భద్రతాదళాలు కాల్చి చంపాయి. అందులో 62 ఏళ్ల వృద్ధురాలు, జాతీయ సాహస బాలల అవార్డు అందుకున్న 18 ఏళ్లబాలుడు కూడా ఉన్నారు. అప్పటికే షర్మిల మానవ హక్కుల ఉద్యమాన్ని ప్రారంభించింది. 11 మంది మరణించిన ఘటన అనంతరం ఆమె సైనిక దళాలకు ప్రత్యేక అధికారాలను కట్టబెట్టిన బ్రిటిష్ కాలం నాటి చట్టాన్ని రద్దు చేయాలని నిరాహారదీక్ష మొదలుపెట్టింది. ఆ తర్వాత దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు మొదలయ్యాయి. వ్యక్తులు, సంస్థలే కాకుండా ప్రభుత్వాలు నియమించిన పలు కమిటీలు కూడా ఈ చట్టాన్ని రద్దు చేయాలని సిఫార్సు చేస్తున్నాయి. 2004లో యూపీఏ ప్రభుత్వం జస్టిస్ జీవన్‌రెడ్డి నేతృత్వాన నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీ ఈ చట్టాన్ని రద్దు చేయాలని నివేదిక సమర్పించింది. 2011లో ఏర్పాటైన ముగ్గురు మధ్యవర్తుల కమిటీ సైతం ఈ చట్టంపై విముఖత వ్యక్తం చేయగా, రెండో పరిపాలనా సంస్కరణల సంఘం కూడా ఇదే విషయాన్ని సూచించింది.
ఎవరు హత్యలు చేసినా నేరంగానే చూడాలని ప్రజలు, మానవ హక్కుల సంఘాలు కోరుతుండగా, సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టం అందుకు ఆటంకంగా తయారైంది. మణిపూర్‌లో 20 ఏళ్ల వ్యవధిలో 1500 నకిలీ ఎన్‌కౌంటర్లు నమోదయ్యాయి. న్యాయం కోరుతూ ఎన్‌కౌంటర్ బాధిత కుటుంబాలు, ఇంఫాల్‌కు చెందిన మానవ హక్కుల సంస్థతో కలిసి సుప్రీం కోర్టు తలుపులు తట్టాయి. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతూ సైన్యం ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తోందని పలు స్వచ్ఛంద సంస్థలు వాదించాయి. ఈ ఫిర్యాదులపై స్వతంత్ర సంస్థ నేతృత్వంలో విచారణ జరిపించాలని సర్వోన్నత న్యాయస్థానం రెండేళ్ల క్రితం ఆదేశించింది. రాజ్యాంగంలో అధికరణం 19 కింద ఉన్న భావప్రకటనా స్వేచ్ఛ, అధికరణం 21లోని వ్యక్తి స్వేచ్ఛ, జీవించే హక్కుతో పాటు అధికరణం 22 కింద నిర్బంధం-వాటి పరిమితులను సైన్యం ఉల్లంఘిస్తోంది. జీవించే హక్కును గానీ, స్వేచ్ఛను గానీ హరించరాదని రాజ్యాంగం పేర్కొన్నా ఆ హక్కులను మాత్రం కొంత మంది వినియోగించుకోలేకపోతున్నారు. తమను ఎందుకు అరెస్టు చేశారో తెలుసుకుని న్యాయం అడిగే హక్కు కూడా పౌరులకు ఉండటం లేదు. మామూలుగా అయితే రాజ్యాంగంలోని అధికరణం 32 ప్రకారం పౌరులు తమ హక్కులకు భంగం వాటిల్లినపుడు కోర్టులను ఆశ్రయించవచ్చు. ప్రత్యేకాధికారాల చట్టం కింద ఆయా రాష్ట్రాల్లో అధికరణం 32 కూడా వర్తించడం లేదు.
తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఆత్మరక్షణ పేరిట భారీ ఎత్తున ప్రాణాలు తీయడం ఆమోదయోగ్యం కాదని సుప్రీం కోర్టు చారిత్రాత్మకమైన తీర్పు చెప్పింది. శత్రువు అనే అనుమానంతోనే దేశ ప్రజలను హతమార్చడానికి సైనిక దళాలను రంగంలోకి దించితే అది చట్టబద్ధ పాలన ఎలా అవుతుంది? ప్రజాస్వామ్యానికి ప్రమాదం కాదా? అని సుప్రీం ప్రశ్నించింది. ప్రత్యేక అధికారాలు లేకపోతే సాయుధ దళాలు నైతిక స్థైర్యం కోల్పోతుందని చెప్పడం- సమస్యను ఒక వైపు నుండి చూడటం అవుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరుడి దృష్టితో చూస్తే చట్టంతో సంబంధం లేకుండా తుపాకీ నీడన బతకడమే అవుతుంది. ఇది ఎంత మాత్రం సమంజసం కాదని సుప్రీం పేర్కొంది. శత్రువుతో వ్యవహరించినపుడు కూడా చట్టబద్ధ విధానాలు ఉంటాయని, విద్యుక్త ధర్మాన్ని విస్మరించి బలప్రయోగం చేయడం సరికాదని పేర్కొంది. సరిహద్దుల్లో యుద్ధ పరిణామాలు ఉన్నాయని చెప్పి తప్పించుకోవద్దని కూడా సైన్యానికి సుప్రీం సూచించింది. ప్రభుత్వాలు ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని మానవీయ దృక్పథంతో సామరస్య పరిష్కారం సాధించాలే తప్ప సమస్యలను ముదరనీయకూడదని కూడా కోర్టు పేర్కొంది. ఇదంతా ఒక ఎత్తయితే, వందలాది సైనిక సిబ్బంది సుప్రీం తలుపులు తడుతున్నారు. ప్రత్యేకాధికారాల చట్టం అమలు అవుతున్న ప్రాంతాల్లో సైనిక కార్యకలాపాలకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కావడాన్ని వీరంతా సవాలు చేస్తున్నారు.
దేశ సరిహద్దులోని రాష్ట్రాల్లోని ప్రజలకు ప్రధాన భూభాగంతో సంబంధం తక్కువగా ఉండటం, సాంస్కృతిక భిన్నత్వం కలిగి ఉండటం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వ్యవహరించాల్సి ఉంటుంది. కేంద్రం పాలనాదక్షతను ప్రదర్శించడం ద్వారా మాత్రమే శాంతిని నెలకొల్పాలే తప్ప ప్రజలపై అదే పనిగా సైన్యాన్ని ఉసిగొల్పడం సమంజసం కానే కాదు, ఒకపుడు భారతీయులను అణచివేయడానికి వినియోగించున్న చట్టాలను ఇపుడు ప్రభుత్వం దేశీయులపైనే వినియోగించాలని చూడటం హద్దు మీరడమే అవుతుంది. అత్యంత తీవ్ర నేరాలను చేసిన వారిని సైతం ఉరితీసే బదులు సంస్కరించాలనే మానవీయ కోణంలో పయనిస్తూనే మరోవైపు అనూహ్యమైన దుందుడుకు వ్యవహారం దేశ శ్రేయస్సుకు ఏ విధంగానూ మంచిది కాదు.

-బీవీ ప్రసాద్ 98499 98090