తెలంగాణ

ముందస్తు ఎన్నికలపై భిన్నస్వరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 11: తెలంగాణలో ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా సవరణ తదితర అంశాలపై రాజకీయ పార్టీల అభిప్రాయం తెలుసుకునేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ పంపించిన ఉన్నతాధికారుల బృందం మంగళవారం సచివాలయంలో అఖిలపక్షం సమావేశం నిర్వహించింది. సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయే వరకూ సాగిన ఈ సమావేశంలో ముందస్తు ఎన్నికల నిర్వహణపై అధికార, విపక్షాలు భిన్నమైన వాదనలు వినిపించాయి. తక్షణమే ఎన్నికలు నిర్వహించాల్సిందేనని అధికార టీఆర్‌ఎస్ దాని మిత్రపక్షమైన ఎంఐఎం స్పష్టం చేయగా.. ఎన్నికలకు తొందరేమిటని కాంగ్రెస్‌తో పాటు ఇతర విపక్షాలు తమ వాదన వినిపించాయి. శాసనసభ రద్దయినందు వల్ల ఆపద్ధర్మ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండకూడదని, అందువల్ల త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కోరామని టీఆర్‌ఎస్ నాయకులు వెల్లడించారు. ఓటర్ల జాబితా సవరణకు మొదట ప్రకటించిన షెడ్యూల్‌నే అమలు చేయాలని కాంగ్రెస్ తదితర పక్షాలు డిమాండ్ చేశాయి. టీఆర్‌ఎస్ ప్రతినిధులుగా వినోద్, ఎన్నం శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రతినిధులుగా మర్రిశశిధర్‌రెడ్డి, జి. నిరంజన్, జంద్యాల రమాశంకర్, టీడీపీ ప్రతినిధులుగా రావుల చంద్రశేఖరరెడ్డి, గురుమూర్తి, మల్లేష్ యాదవ్ పాల్గొన్నారు. ఎంఐఎం తరఫున అసదుద్దీన్ ఒవైసీ, సయ్యద్ అమీన్ జాఫ్రీ, సీపీఐ తరఫున చాడా వెంకటరెడ్డి, పల్లావెంకటరెడ్డి, కే. సాంబశివరావు, సీపీఎం తరఫున బీవీ నర్సింహారావు, నంద్యాల నర్సింహారెడ్డి, బిజేపి తరఫున ఇంద్రసేనారెడ్డి, మల్లారెడ్డి, వి. వెంకటర్‌రెడ్డి, బీఎస్‌పీ ప్రతినిధులుగా ఎస్. ఎల్లన్న, సంజీవ్‌కుమార్, వైసీపీ ప్రతినిధులుగా శివకుమార్, భగవంత్‌రెడ్డి, రవికుమార్ పాల్గొన్నారు. అఖిలపక్షం సమావేశం తర్వాత వివిధ పార్టీల ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. కేంద్ర ఎన్నికల కమిషన్ పంపించిన బృందంలో డిప్యూటీ కమిషనర్లు ఉమేష్ సిన్హా, సందీప్ సక్సేనా, సుదీప్ జైన్, దిలీప్ శర్మ, ధీరేంద్రఓజా, సుమీతా ముఖర్జీతో పాటు మరో నలుగురు అధికారులు ఉన్నారు. వివిధ పార్టీలు వెలిబుచ్చిన అభిప్రాయాలను కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం ఓపికగా విన్నది.
వెంటనే ఎన్నికలు: టీఆర్‌ఎస్
రాష్ట్రంలో ఆపద్దర్మ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండటం మంచిది కాదు. పూర్తిస్థాయి అధికారాలతో ఉండే ప్రభుత్వం ఏర్పాటు త్వరగా కావాలి. శాసనసభ రద్దయిన తర్వాత యుద్ధప్రాతిపదికన ఓటర్ల జాబితా సవరణ తదితర కార్యక్రమాలు పూర్తయితే ఎన్నికలు జరిపేందుకు అవకాశం ఉంటుంది. చట్టసభ రద్దయిన తర్వాత వేగంగా ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు కూడా గతంలో ప్రకటించింది. నియమ నిబంధనల మేరకే ఎన్నికల కమిషన్ పనిచేస్తోంది. ఎన్నికల కమిషన్‌పై కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేయడం సరికాదు.
కేసీఆర్ చెప్పినట్టే సీఈసీ పనిచేస్తుందా: కాంగ్రెస్
కేసీఆర్ చెప్పినట్టే కేంద్ర ఎన్నికల కమిషన్ పనిచేస్తుందా? వాస్తవ పరిస్థితి పరిశీలిస్తే అలానే అనిపిస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల కమిషన్ స్వేచ్చగా, స్వతంత్య్రంగా పనిచేయాలి. కేసీఆర్ చెప్పినట్టే సీఈసీ నిర్ణయాలు ఉండటం పట్ల తీవ్రమైన ఆక్షేపణ తెలియచేస్తున్నాం. శాసనసనభ రద్దు తర్వాత ఆరునెలల్లోగా ఎన్నికలు జరపాలే తప్ప హడావుడిపడాల్సిన అవసరం లేదు. ఓటర్ల జాబితా సవరణకు మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే సవరణ జరగాలి. ఫకడ్బందీగా ఓటర్ల జాబితా రూపొందించాలి. ఖమ్మం జిల్లాలోనే ఏడు మండలాలు తెలంగాణలోనే ఉంచుతూ ఎన్నిలు జరపాలి.
2019 జనవరి 1 ప్రాతిపదిక: టీడీపీ
ఓటర్ల జాబితా సవరకు 2019 జనవరి 1 ని ప్రాతిపదికగా తీసుకోవాలి. ఆ తేదీ వరకు 18 సంవత్సరాలు నిండినవారంతా ఓటర్లుగా నమోదుకావాలి. ప్రజలకు సమాచారం ఇచ్చేందుకు మొబైల్ ఫోన్ల ద్వారా ఎస్‌ఎంఎస్‌లు తదిరత ఆధునిక విధానాలు వాడాలి. కేసీఆర్ ఆపద్దర్మ సీఎంగా ఉంటూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది సరైన విధానం కాదు. ఎల్‌బీ నగర్ నియోజకవర్గంలో 1.60,000 మంది ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయి. 2014 లో 2.81 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ఇప్పుడు 2.61 కోట్ల మంది ఓటర్లుగా ఉన్నట్టు ముసాయిదా జాబితా వల్ల తెలుస్తోంది. ఇదెలా సాధ్యం?
తప్పుల తడకల ఓటర్ల జాబితా: బీజేపి
ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉంది. అధికార పార్టీ ఎన్నికల కమిషన్‌ను తప్పుదోవ పట్టిస్తోంది. ఓటరు తాను ఏ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్నాడో తెలియని విచిత్ర పరిస్థితి ఏర్పడి ఉంది. జాబితాను తప్పుగా రూపొందించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఓటర్ల జాబితా సమర్థతగా రూపొందించాలి. ఇందుకు అవసరమైన సమయం కావాలి. వినాయక చవితి, మొహర్రం తదితర పండగలున్నాయి.
బ్యాలెట్ పేపర్లే వాడాలి: బీఎస్‌పీ
ఎన్నికలకు బ్యాలెట్ పేపర్లే వాడాలి. ఈవీఎంలపై నమ్మకం లేదు. ఓటర్ల జాబితా పారదర్శకంగా రూపొందించాలి.
దుర్వినియోగం: సీపీఐ
రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు అన్ని వ్యవస్థలను టీఆర్‌ఎస్ దుర్వినియోగం చేస్తోంది. హడావుడిగా ఓటర్ల జాబితా సవరణ చేయకుండా, మొదట ప్రకటించిన విధంగానే జరగాలి.
33 లక్షల ఓటర్ల పేర్లు గలంతా: సీపీఎం
33 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలిగించారు. అధికార పార్టీ కనుసన్నల్లోనే ఇది జరిగింది. జాబితా రూపొందించడంపై బాగా ప్రచారం చేయాలి.
త్వరగా ఎన్నికలు: ఎంఐఎం
రాష్ట్రంలో త్వరగా ఎన్నికలు జరపాలి. ఓటర్ల జాబితా సవరణకు పండగలు అడ్డుకాదు.
పాత షెడ్యూల్ అనుసరించాలి: వైసీపీ
ఓటర్ల జాబితా సవరణకు మొదట ప్రకటించిన షెడ్యూల్‌నే అనుసరించాలి. 2019 జనవరి 1 వరకు 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించాలి.