ఆంధ్రప్రదేశ్‌

కేంద్రానికి పంపించిన కాపుల బిల్లు వాపసు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, సెప్టెంబర్ 11: కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిన కాపుల రిజర్వేషన్ల బిల్లును వాపసు తీసుకోవాలని కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తిచేశారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల కోసం బీసీ రిజర్వేషన్ బిల్లును కొన్ని సవరణలతో కొత్తగా తయారుచేసి ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని కోరారు. రాష్ట్ర గవర్నర్ ఆమోదంతో కాపులకు బీసీ రిజర్వేషన్లు అమలయ్యేలా చట్టం చేయాలని విజ్ఞప్తిచేశారు. ఈమేరకు మంగళవారం ముఖ్యమంత్రికి రాసిన బహిరంగ లేఖ ప్రతులను ముద్రగడ తూర్పు గోదావరి జిల్లాలో పత్రికలకు విడుదల చేశారు. బిల్లును చట్టరూపంలోకి తెచ్చిన వెంటనే జీవో ఇచ్చి తహశీల్దారు కార్యాలయాల్లో కాపులకు బీసీ-ఎఫ్ సర్ట్ఫికెట్లు మంజూరుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కాపుల రిజర్వేషన్ బిల్లు 33/2017లో కొన్ని సవరణలు చేయాల్సి ఉందని న్యాయవాదులు చెబుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి అభ్యంతరం లేని పక్షంలో తనకు న్యాయ సలహాలిచ్చిన న్యాయవాదులచే బిల్లు తయారుచేయిస్తామని, అనంతరం ప్రభుత్వం అనుకూలమైన మార్పులు, చేర్పులు చేసుకోవచ్చని సూచించారు. కాపులకు బీసీ రిజర్వేషన్లు ఇప్పటికైనా అమలుచేసి ఈ సమస్యకు శుభం కార్డు వేయాలని కోరారు. కాపులకు బీసీ రిజర్వేషన్లను ముందుగా రాష్ట్రంలో అమలుచేసి, తర్వాత కేంద్ర సర్వీసుల గురించి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. కాపులకు బీసీ రిజర్వేషన్ల విషయంలో పెడర్ధాలు తీయకుండా తక్షణం అసెంబ్లీలో సవరించిన బిల్లు ప్రవేశపెట్టి అమలుచేసేందుకు కృషి చేయాలని ముద్రగడ కోరారు.
ముద్రగడ బెదిరింపులు, ప్రలోభాలతో రిజర్వేషన్లు రావు
గుంటూరు: బెదిరింపులు, ప్రలోభాలతో రిజర్వేషన్లు సాధించలేరన్న విషయాన్ని కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం తెలుసుకోవాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు హితవుపలికారు. మంగళవారం గుంటూరులోని బీసీ సంక్షేమ సంఘ కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ఆమోదానికి పంపిన కాపు రిజర్వేషన్ బిల్లును వెనక్కు తెప్పించి రిజర్వేషన్లను 5 నుండి 10 శాతానికి పెంచి బీసీ-ఎఫ్‌గా చేర్చి, బీసీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీచేసి త్వరలో నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే ఉద్యోగాల్లో కాపులకు ఉద్యోగాలు కల్పించాలని ముద్రగడ తాజాగా సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారన్నారు. అలా చేయకపోతే రాజకీయ గుణపాఠం చెబుతామని హెచ్చరించారని, తాను చెప్పిన విధంగా చేస్తే లక్ష మందితో ఊరేగింపు జరిపి సన్మానం కూడా చేస్తామని చెప్పారన్నారు. అయితే మొదటిది బెదిరింపు, రెండోది ప్రలోభం అవుతుందే తప్ప మరొకటి కాదన్నారు. రాష్ట్రప్రభుత్వం, కాపు నాయకులు కలిసి అసెంబ్లీలో తీర్మానం చేసి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని పంపించిన అభ్యర్థనను కేంద్రం ఎందుకు ఆమోదించలేదో ఇప్పుడు వారే చెప్పాలన్నారు.
కాపు రిజర్వేషన్లను కాపాడతామన్న జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ అయినా చెప్పవచ్చన్నారు. సాంఘిక వెనుకబాటుతనం అర్హతలేని కాపులకు బీసీ రిజర్వేషన్ కల్పిస్తామని గతంలో చంద్రబాబు చెప్పడం, ఇప్పుడు ముద్రగడ దాని కోసం డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
సుప్రీంకోర్టు విధించిన 50 శాతం సీలింగ్‌ను మించి రిజర్వేషన్లు కల్పించే అధికారం చంద్రబాబు ప్రభుత్వానికి లేదన్నారు. ఓ పక్క చంద్రబాబు, మరో పక్క ముద్రగడ కాపులను మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నారని, కాపులు వీరి మాయలో పడవద్దని శంకరరావు సూచించారు.