మెయిన్ ఫీచర్

సంకట హరుడు వినాయకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రిగుణాత్మక స్వరూపుడు, త్రైమూర్త్య భావనతో విరాజిల్లుతున్న వినాయకుడు వైదిక కాలం నుండి భారతావనిలో ఆది దైవ స్వరూపంగా ఉపాసించ బడుతున్నాడు. ప్రకృతిలో రజస్తమో గుణాది స్వరూపుడైన విఘ్నేశ్వరుని ‘గుణేశుడు’ అని అభివర్ణించగా, కాలక్రమేణ ‘గణేశుడు’ అయినాడు. గాణాపత్య సంప్రదాయానుసారం గణము అనగా సత్య రజస్తమో గుణ సమ్మేళనం. ఈ త్రిగుణాధిపతి విఘ్నేశ్వరుడు పురాణేతిహాసాలను బట్టి సకల దేవతా గణాలకు అధిపతి కనుక గణపతి సార్థక నామం. లింగ పురాణం ప్రకారం బలగర్వితులైన రక్కసులు, సర్గలోకాన్ని ఆక్రమించి, దేవతలను అష్టాకష్టాలకు గురి చేయగా, వారు పరమ శివుని ప్రార్థించగా, ఆయన రాక్షస సంహారానికై గణపతిని సృష్టించి, రాక్షసులను సంహరించమనగా, అందులో తన ప్రమేయం లేదని, ఆగ్రహించిన పార్వతి, పరమేశ్వరునిపై కోపాన్ని గణపతిపై ప్రదర్శించి, ఏనుగు తలతో, బాన కడుపుతో, వికార రూపుడై ఉండునట్లు శపించగా, చింతాక్రాంతుడున గణేశుని శివుడూరడించి, సకల దేవతా గణాధిపతిగా, సకల విఘ్న నివారక దైవంగా అనుగ్రహించాడు. మరో కథనం ప్రకారం గజాసురుని సంహరించి, పరమేశ్వరుని అనుగ్రహంతో పార్వతి చేత పిండి బొమ్మగా చేయబడి, ప్రాణాలు కోల్పోయిన గణపతి గజాసురుని తలతో పునర్జీవితుడైనట్లు ప్రచారంలో ఉంది. పార్వతీ పరమేశ్వరులు విహరిస్తూ కొలనులో ఉండగా ఉన్న గజదంపతుల శృంగారాన్ని చూచి మైమరచి, తామూ అదే రూపాలతో క్రీడించగా గజముఖుడైన గణపతి ఆవిర్భవించినట్లు ఐతిహ్యం. గణపతి పరమేశ్వరుని తనయుడే కాకుండా విష్ణురూపుడు కూడా. ‘శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం’ అన్న ప్రస్తుతి నిరంతరం పఠితమే. పృధ్వీతత్వం ప్రధానంగా కలవారు పరమేశ్వరుని, జలతత్వం కలవారు గణపతిని, తేజస్తత్వం కలవారు దుర్గామాతను, వాయుతత్వం కలవారు సూర్యుని, ఆకాశతత్వం కలవారు విష్ణువును ప్రార్థిస్తుండగా, కేవలం ఒక దేవతా మూర్తికి ఏ శుభకార్యంలోనైనా తొలి పూజ గావించడం పాంచభౌతిక శరీరధారులైన మానవులు ఆచరించే సంప్రదాయం, ప్రత్యేకం. సకల దేవతామూర్తియైన గణేశుని శుభకార్యాలలో తొలిపూజార్హుని చేయడం సనాతన ఆచారం. భాద్రపద శుక్లపక్ష చవితి నాడు గజాసుర సంహారం చేసినందున ఆనాటి నుండే గజానన పూజ ప్రారంభమైనట్లు కథనం.
భాద్రపద శుద్ధ చవితినాడు గణాధిపతియైన విఘ్నేశ్వరునికి యథావిదిగా ఏకవింశతి పత్రాలతో అర్చించి, తరించడం భారతావనిలో తరతరాలుగా కొనసాగుతున్న సంస్కృతికి ప్రతీక. వినాయక చవితిని జాతీయ సమైక్య పర్వదినంగా లోకమాన్య తిలక్ లాంటి నాయకులు నిర్వహించారు. భారత దేశంలోనే కాక, విదేశాలలోనూ వినాయకుని ఆరాధన ఉంది. 13వ శతాబ్దినాటి గణపతి విగ్రహం కిరీటాలంకృతునిగా జావాలో లభించింది. సయామ్‌లో లభించిన విఘ్నేశ్వరుడు కూర్మవాహనుడు. ఒక చేతిలో చింతామణిని ధరించి ఉండడం ఈ విగ్రహ ప్రత్యేకత. ఈ బొమ్మ ఉన్న వ్రాతప్రతి హనోయ్‌లో లభించింది. జపాన్‌లో సుమో యోధుల కుస్తీ ఫోజులో ఉన్న గణపతి ద్వయ విగ్రహం లభించింది. క్రీ.శ.14వ శతాబ్దికి చెందిన గణపతి విగ్రహం కంబోడియాలో లభించగా, విద్యా ప్రదాతగా కొలిచే ఈ గణపతి చేతులలో పుస్తకం, గంటంగా ఉపయోగించే దంతం ఉన్నాయి. చైనా, జపాన్‌లలో లభించిన గణేశ విగ్రహాలకు ఒక చేతిలో గొడ్డలి, మరో చేతిలో కేరెట్ పట్టుకుని ఉండగా, వీటిని గర్భధాతు గణపతులంటారు. శక్తితో కూడిన హేరంబ గణపతి విగ్రహం టిబెట్‌లో లభ్యమైంది.
హేరంబ గణపతి పంచభూతాల తత్వాన్ని సూచించే రూపంలో సింహాసనాసీనుడై, నృసింహ గణపతి తత్వాల మేళవింపుగా అనాది కాలం నుండి పూజార్హమై ఉంది. ధన్వంతరిగా లంబోదరుడు ఉదర సంబంధ వ్యాధులను నయం చేసే దేవతగా కొలువబడుతున్నాడు. అష్ట వినాయకులుగా ప్రసిద్ధి పొందిన దేవతా రూపాలు మహారాష్టల్రో నెలకొని ఉన్నాయి. వికటరాజ రూపంలో మోరేగావ్‌లో మయూరేశ్వరునిగా, పాలిగణపతి రూపంలో భల్లాలేశ్వర్‌లో లంబోదరునిగా, మాధ్‌లో వరద వినాయకునిగా, మహోదర రూపంలో ఓజార్‌లో, విఘ్నేశ్వరునిగా విఘ్నరాజ రూపంలో లేన్యాద్రిలో, గిరిజాత్మజ రూపంలో ధూమ్రవర్ణునిగా, తేవూర్‌లో చింతామణి రూపంలో వక్రదంతునిగా, సిద్ధిటేక్‌లో సిద్ధి వినాయక రూపంలో సిద్ధేశ్వరునిగా, రంజన్‌గావ్‌లో మహాగణపతి రూపంలో గజాననునిగా మహారాష్ట్ర గణపతుల ఆరాధనా భూమిగా నిలచి ఉంది.

-సంగనభట్ల రామకిష్టయ్య 9440595494