సంపాదకీయం

కాంగ్రెస్ ‘ఒడి’లో ‘దేశం’..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంగ్రెస్ అధ్యక్షుడుగా చెలామణి అవుతున్న రాహుల్‌గాంధీకి తెలుగుదేశం- జాతీయ- అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం చెప్పనున్న దృశ్యం త్వరలో ఆవిష్కృతం కాగలదన్న ఉత్కంఠ రాజకీయ కుతూహలగ్రస్తులను ఆవేశించి ఉంది. తెలంగాణ శాసనసభకు జరుగనున్న ఎన్నికలలో కలసికట్టుగా పోటీచేయాలని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నిర్ణయించడం ఈ సరికొత్త ఉత్కంఠకు ప్రాతిపదిక! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొనసాగిన సమయంలో 1982 నుంచి 2014వరకు తెలుగు నేలపై కాంగ్రెస్, ‘తెదేపా’లు పరస్పరం ప్రధాన రాజకీయ ప్రత్యర్థులు, సైద్ధాంతిక విరోధులు. ఎవరి సిద్ధాంతం ఏమిటన్నది బహుశా ఎవ్వరూ అడగని ప్రశ్న... ‘సిద్ధాంతం’అని అంటే ఏమిటి? అని ప్రశ్నిస్తున్నవారు ప్రజాప్రతినిధులు.... ప్రముఖులు.... రాజనీతి కోవిదులు.... ప్రభుత్వాల నిర్వాహకులు! అందువల్ల రాజకీయ సమాజం ‘ద్విధా’ విభక్తమై ఉంది. ‘ప్రగతి’ ‘సంక్షేమం’ అన్న పదాలను ప్రయోగించడం మాత్రమే అధికార రాజకీయ వేత్తలకు తెలుసు. ‘అవినీతి’ ‘అవకాశవాదం’ అన్న ఆరోపణలను ప్రభుత్వ నిర్వాహకులకు వ్యతిరేకంగా గుప్పించడం ప్రతిపక్ష రాజనీతిజ్ఞులకు తెలుసు! అందువల్ల సిద్ధాంత ధ్యాస, సైద్ధాంతిక నిష్ఠ వంటి వాటికి వర్తమాన రాజకీయ క్రీడాప్రాంగణంలో స్థానం లేదు, అన్వయం లేదు, అస్తిత్వం లేదు!! అధికారం పొందడానికి, పొందిన అధికార పీఠాలను వదలకుండా పట్టుకొని వేళ్లాడడానికి వీలుగా చిత్ర విచిత్ర ప్రాంతీయ కూటములు ఏర్పడిపోతున్నాయి. అధికార పక్షాన్ని గద్దె దింపడంకోసం కృషిచేస్తున్నవారు కూడ ఈ ‘‘సిద్ధాంత రహిత’’ తతంగాన్ని మొత్తం పునరావృత్తం చేస్తున్నారు. తెలంగాణలో మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమేకాదు, దేశవ్యాప్తంగా దశాబ్దుల తరబడి ఇదే తీరు, ఇదే హోరు... సిద్ధాంతంతో నిమిత్తం లేని పోరు నడుస్తున్నాయి. అవినీతికి పాల్పడడం తప్పన్నది రాజకీయాలకు ప్రాతిపదిక కావడం లేదు. ‘‘పాల్పడే అవకాశం మా ప్రత్యర్థులకు మాత్రం దక్కరాదు, ఆ అవకాశం మాకు మాత్రమే దక్కాలి....’’అన్నది వర్తమాన రాజకీయాలకు ప్రేరక మంత్రం, చోదక తంత్రం.... ఈ ‘అవకాశం’ పొందడానికి ఒంటరి కృషి, ఒంటరి ప్రయత్నం దోహదం చేయలేనప్పుడు ‘‘ఇతరులను కలుపుకొని’’ ఉమ్మడి యత్నం ద్వారా సాధించాలి ప్రాంతీయ స్థాయిలో దేశమంతటా ఇదే మూల మంత్రం... జాతీయ స్థాయిలో కూడ ఇప్పుడు ఇదే తంత్రం! కేంద్రంలో భారతీయ జనతాపార్టీని అధికారంనుంచి తప్పించడంకోసం ‘సిద్ధాంత సామ్యం’ ‘కార్యక్రమ సమన్వయం’, ‘లక్ష్యసాధన సారూప్యం’, ‘ఆచరణాత్మక ఆదర్శం’ వంటి వాటి ప్రసక్తిలేని కూటమిని ఏర్పాటుచేయడానికి కృషి జరుగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్, తెలుగుదేశం జట్టుకట్టడం ఈ విస్తృత జాతీయ వ్యూహంలో భాగం! తెలంగాణలో చిరునామా లేని ‘తెదేపా’, ఆంధ్రప్రదేశ్‌లో ‘అస్తిత్వం’లేని కాంగ్రెస్ ఇలా జట్టుకట్టడం పరస్పర ప్రయోజనకరం! తెలంగాణలో ‘తెలుగుదేశం’ ఉందన్న ధ్యాస, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ కదలుతోందన్న స్పృహ మళ్లీ చిగురులెత్తాయి. ఈ ఉభయ పక్షాల తక్షణం సిద్ధించిన ప్రయోజనం ఇది....
భారతీయ జనతాపార్టీకి వ్యతిరేకంగాను, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగాను జాతీయ స్థాయిలో ‘కూటమి’ని ఏర్పాటుచేయడానికి మొదట నడుమును బిగించినవాడు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. గత మార్చి మూడవ తేదీన ఆయన ఆవిష్కరించిన ‘ప్రజాకూటమి’వౌలిక స్వభావం ‘్భజపా’ పట్ల విరోధం, కాంగ్రెస్ పట్ల వ్యతిరేకం! ఈ ‘ప్రజాకూటమి’ సమాఖ్య కూటమి- ఫెడరల్ ఫ్రంట్-గాను మూడవ కూటమి గాను ప్రచారం పొందింది. కానీ ఈ ‘కార్యక్రమాన్ని’ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి ‘ప్రత్యక్షం’గా అపహరించింది. చంద్రశేఖరరావుతో చర్చలు జరిపిన ఈ మమతాబెనర్జీ సమాంతరంగా కాంగ్రెస్ నాయకులతో సైతం చర్చలు నడిపింది. బహుశా ఇది నచ్చని కల్వకుంట్లవారు ఆ తరువాత ఈ ‘కూటమి’ సంగతి మరచిపోయాడు. ఇలా ‘జాతీయ ప్రతిపక్ష’ కూటమిని మమతాబెనర్జీ ప్రత్యక్షంగా ‘అపహరించ’గా అతి తెలివిగా పరోక్షంగా అపహరించినవాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి! ఆయన వ్యూహరచనా చాతుర్యం ఇలా మరోసారి ప్రస్ఫుటించింది. ఈ ప్రస్ఫుటికి సరికొత్త ఉదాహరణ ‘తెదేపా’ తెలంగాణలో కాంగ్రెస్‌తో జట్టుకట్టడం... నిర్లజ్జగా నిర్భయంగా!!
ఇలా సుదీర్ఘకాల విరోధులైన కాంగ్రెస్‌వారు, తెలుగుదేశంవారు తెలంగాణలో ఇప్పుడు చెట్టపట్టాల్ పట్టుకొని ‘‘చెలిమి బాట పట్టడం’’ జాతీయస్థాయిలో ‘్భజపా’ వ్యతిరేక మహాకూటమిని ఏర్పాటుచేయడానికి చంద్రబాబునాయుడు చేస్తున్న యత్నంలో భాగం కావచ్చు. అందువల్ల ‘తెలంగాణ’ చెలిమి లోక్‌సభ ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్‌కు విస్తరించడం ఖాయం. 2014నాటి లోక్‌సభ, శాసనసభ ఎన్నికల తరువాత ఆంధ్రప్రదేశ్‌లో ఆనవాలు మిగలని కాంగ్రెస్ ఇటీవలి కాలంలో మళ్లీ ఆవలిస్తోంది, అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ వోట్ల శాతం కూడ గణనీయంగా పెరిగిందని అధ్యయన సంస్థలవారు అంచనా వేస్తున్నారు కూడ. అందువల్ల పెరుగుతున్న కాంగ్రెస్ ‘ఓట్లు’ తమ పార్టీనుండి బదిలీ అవుతున్నవేమోనన్న భయం చంద్రబాబునాయుడిని ఆవహించి ఉండవచ్చు! అందువల్ల ‘ ఓట్లు’ పెరిగిన కాంగ్రెస్‌తో జట్టుకట్టడం ద్వారా రానున్న లోక్‌సభ, శాసనసభ ఎన్నికలలో తమ పార్టీ ‘సీట్లు’తగ్గకుండా చూసుకోవాలని ‘తెదేపా’ అధినేత భావిస్తూ ఉండవచ్చు! చంద్రబాబునాయుడికి తెలంగాణలో తమ పార్టీ ‘అభ్యుదయం’కంటె ఆంధ్రప్రదేశ్ తమ ‘అధికారం’ నిలబెట్టుకొనడం ప్రధానం.... ఓట్లు పెరిగినప్పటికీ ఈ పెరిగిన ఓట్లతో తమకు ‘సీట్లు’రావన్నది ఆంధ్రప్రదేశ్ నాయకులకు తెలిసిన కఠోర వాస్తవం. అందువల్ల తెలంగాణలో తమ పార్టీవారు ‘తెదేపా’ వారిని భుజాలకెత్తుకొనడం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు కూడ ఆనందకరంగా ఉండవచ్చు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నాటికి తాము ‘తెదేపా’ చంకనెక్కి కూర్చోవచ్చు! ఆంధ్రప్రదేశ్‌లో ‘తెదేపా’ అండతో తాము కొన్ని ‘సీట్లై’నా గెలుచుకోవచ్చన్న ఆశలు కాంగ్రెస్ వారిలో చిగురించడం అసహజం కాదు! మహాత్మాగాంధీ నాయకత్వం వహించిన మహాసంస్థ రాహుల్‌గాంధీ వంటి రాజకీయ విదూషకుని నాయకత్వం పాలుకావడం కాలమహిమ! కాలకర్మగతిలో ‘ఇది’ సంభవం కాగలిగినప్పుడు ఏదైనా సంభవించగలదు! తెలుగుదేశం కాంగ్రెస్‌ల పొత్తు అలాంటిది!!
ఇలా తమ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోగలదని తెలిసి ఉంటే రేవంత్‌రెడ్డి వంటి ప్రచార ప్రసిద్ధులు బహుశా ‘తెదేపా’నుంచి బయటికి వెళ్లేవారు కాదేమో?? లేక చంద్రబాబునాయుడు తన సుదూర వ్యూహ రచనలో భాగంగా రేవంత్‌రెడ్డివారిని ‘‘్భజం తట్టి’’ ప్రోత్సహించి పంపాడా?? ఏమయినప్పటికీ కాంగ్రెస్ పట్ల మమకారం చంద్రబాబునాయుడికి కొత్తకాదు. 1996లో కేంద్రంలో హెచ్‌డి దేవేగౌడ నాయకత్వంలోను 1997లో ఇంద్రకుమార్ గుజరాల్ ప్రధానమంత్రిత్వంలో ఏర్పడిన ప్రభుత్వాలకు కాంగ్రెస్‌తోపాటు తెలుగుదేశం కూడ- బయటినుంచి- మద్దతు ఇవ్వడం చరిత్ర. ఈ సమాన భావజాల పరిణామక్రమానికి పరాకాష్ఠ తెలంగాణలో ఉభయుల మధ్య పొత్తు! ఈ సమాన భావజాలం 1980వ దశకం నాటిది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చంద్రబాబునాయుడు రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టిన నాటిది,.....!! కాలపరిణామ క్రమం పునరావృత్తం ఔతోంది.