రాష్ట్రీయం

సీఈసీకి తక్షణమే నివేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 12: తెలంగాణ శాసనసభ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ)కు తక్షణమే సమగ్ర నివేదిక సమర్పిస్తామని కేంద్ర ఎన్నికల అధికారుల బృందం ప్రకటించింది. సీఈసీ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ డిప్యూటీ కమిషనర్ ఉమేష్ సిన్హా నేతృత్వంలో 10 మందితో కూడిన బృందం మంగళవారం హైదరాబాద్ వచ్చింది. ఈ బృందం సభ్యులు మంగళ, బుధవారాల్లో తీరికలేకుండా సమావేశాల్లో పాల్గొన్నారు. బుధవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లే ముందు రాష్ట్ర సచివాలయంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్నారు. సీఈఓ రజత్ కుమార్‌తో కలిసి సిన్హా మాట్లాడుతూ, ఈ నెల 6న శాసన సభను రద్దుచేస్తూ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేయడం, గవర్నర్ ఈ తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగడాన్ని ప్రస్తావించారు. పూర్తిస్థాయి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఎన్నికలు జరగాల్సి ఉందని, ఇందుకోసం కేంద్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి నెలకొన్న పరిస్థితులు, సిబ్బంది, శాంతి, భద్రతలు, వౌలిక వసతులు తదితర అంశాలను పరిశీలించామన్నారు.
రాజకీయ పార్టీలతో మంగళవారం సాయంత్రం సమావేశమయ్యామని సిన్హా తదితరులు తెలిపారు. వివిధ పార్టీల ప్రతినిధులు తెలియచేసిన అంశాలను నమోదు చేసుకున్నామని అన్నారు. పార్టీల ప్రతినిధులు వెలిబుచ్చిన ప్రధాన అంశాల్లో చాలా మంది ఓటర్ల పేర్లను జాబితానుండి తొలిగించారన్నది ప్రధానమైందన్నారు. ఈ అంశంపై చీఫ్ ఎలక్టోరల్ అధికారి (సీఈఓ)కు సూచనలు చేశామన్నారు. తొలిగిన వారి పేర్లను తిరిగి జాబితాలో చేరుస్తామని, ఇందుకోసం ఇంటింటికీ సిబ్బంది తిరిగి వివరాలు సేకరిస్తారనీ తెలిపారు. పొరపాటుగా తొలిగిన వారి పేర్లను జాబితాలో తిరిగి చేరుస్తామని, అర్హులైన అందరి ఓటర్ల పేర్లు జాబితాలో ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఇందుకోసం సీఈఓ విస్తృతమైన ప్రచారం చేస్తారని, ఎలక్ట్రానిక్ మీడియా,ప్రింట్ మీడియా, సోషల్ మీడియాను వాడుకుంటామన్నారు. మొబైల్ ఫోన్లకు ఎస్‌ఎంఎస్‌లు పంపించి ఓటర్లను చైతన్యం చేస్తామన్నారు. గ్రామాల్లో డప్పు ద్వారా ప్రచారం చేస్తామన్నారు. ప్రతిరోజూ సంబంధిత అధికారులు ఈ వివరాలన్నింటినీ సవరణ పూర్తయ్యేవరకు పరిశీలిస్తారన్నారు. పోలింగ్ స్టేషన్/బూత్ స్థాయి అధికారులు తప్పనిసరిగా ఈ నెల 25 వరకు తమ తమ పోలింగ్ స్టేషన్లలో నిర్ణీత సమయాల్లో ఓటర్లకు అందుబాటులో ఉండాలన్నారు. సీనియర్ అధికారులు హఠాత్తుగా పరిశీలనకు వెళతారని వివరించారు. బూత్‌స్థాయి అధికారులు ఓటర్లకు అందుబాటులో లేకపోతే లేదా పనిచేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాస్థాయిలో హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను 24 గంటల్లో పరిష్కరిస్తామని వెల్లడించారు. ఓటర్ల జాబితా సవరణపై రాజకీయ పార్టీలు వెలిబుచ్చిన అభిప్రాయాలను, ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు.
శాంతి, భద్రతల పరిస్థితిపై పోలీసు ఉన్నతాధికారులతో చర్చించామని సిన్హా తదితరులు తెలిపారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ల అవసరాల గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఈఓ తదితర అధికారులతో చర్చించామన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన నిధుల గురించి కూడా చర్చించామన్నారు. వివిధ శాఖల అధికారులతో చర్చలు జరిపామని కేంద్ర బృందం ప్రతినిధులు వివరించారు.
ఖమ్మం జిల్లాలోని ఏడుమండలాలు ఆంధ్రప్రదేశ్‌లో కలవడం వల్ల ఏర్పడ్డ పరిస్థితిపై తమకు అందిన ఫిర్యాదులను కేంద్ర ఎన్నికల కమిషన్‌కు తమ నివేదిక ద్వారా తెలియచేస్తామని విలేఖరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారన్నది కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తుందని, తాము కేవలం ఇక్కడ నెలకొని ఉన్న పరిస్థితిని పరిశీలించేందుకే వచ్చామన్నారు. తాము పరిశీలించిన అంశాలన్నింటినీ సమగ్ర నివేదికగా రూపొందించి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సమర్పిస్తామన్నారు. ఢిల్లీ వెళ్లగానే తక్షణమే నివేదిక రూపొందిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

రోజంతా సమావేశాలే
తెలంగాణ శాసనసభకు ఎన్నికలు నిర్వహించేందుకు పరిస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర ఎన్నికల కమిషన్ సీనియర్ డిప్యూటీ కమిషన్ ఉమేష్ సిన్హా నేతృత్వంలో సందీప్ సక్సేనా, సుదీప్ జైన్, దిలీప్‌శర్మ, ధీరేంద్రఓజా, సుమితా ముఖర్జీసహా మొత్తం పది మందితో కూడిన అధికారుల బృందం హైదరాబాద్‌లో విస్తృతంగా చర్చలు జరిపింది. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న ఈ బృందం సచివాలయంలో రాజకీయ పార్టీలతో భేటీ అయింది. బుధవారం జిల్లా కలెక్టర్లు, ఎస్‌పిల, డీఐజీలు, ఐజీలతో ప్రత్యేకంగా సమావేశమైంది. దాదాపు మూడు గంటలపాటు జిల్లా యంత్రాంగాలతో ఈ బృందం చర్చించింది. ఆ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీఈఓ రజత్ కుమార్‌లతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈవీఎంల అవసరం, వీవీప్యాట్ల అవసరం, నిధుల అవసరం, పోలింగ్ సిబ్బంది, పోలింగ్ బూత్‌లు, శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీస్ సిబ్బంది తదితర అంశాలపై సమగ్రంగా చర్చించింది. ఎన్నికల నిర్వహణకు శాంతిభద్రతల పరిస్థితి అనుకూలంగా ఉందా లేదా అన్న అంశంపై కూడా పరిశీలించింది.

అలా వచ్చి..ఇలా వెళ్లి..
రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పరిస్థితిని పరిశీలించేందుకు ఢిల్లీ నుండి వచ్చిన అధికారుల బృందం తన నివేదికను శుక్రవారం కేంద్ర ఎన్నికల కమిషన్‌కు (సీఈసీ) సమర్పించే అవకాశం ఉందని తెలిసింది. సీఈసీ ఆదేశాల మేరకు ఢిల్లీ నుండి వచ్చిన 10 మందితో కూడిన అధికారుల బృందం రాజధానిలో సుడిగాలిలా పర్యటించింది. ఢిల్లీ నుండి మంగళవారం సాయంత్రం హైదరాబాద్ వచ్చిన ఈ బృందం రాజకీయ పార్టీలు, రెవెన్యూ, ఆర్థిక, పోలీసు తదితర అధికారులతో చర్చలు జరిపింది. హైదరాబాద్ వచ్చినప్పటి నుండి బుధవారం ఢిల్లీ వెళ్లేంత వరకు వివిధ సమావేశాల్లో ఈ బృందం బిజీగా గడిపింది. అనధికారులు, అధికారుల నుండి సేకరించిన సమాచారాన్ని లిఖిత పూర్వకంగా తీసుకున్న వివరాలను ఢిల్లీలో గురువారం ఈ బృందం పరిశీలిస్తుందని తెలిసింది. వీలైతే శుక్రవారమే సమగ్ర నివేదికను కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌కు అందిస్తారని సమాచారం. ఒక వేళ శుక్రవారం వరకు నివేదిక రూపొందించడం పూర్తి కాకపోతే శనివారం సమర్పిస్తారని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.