రాష్ట్రీయం

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 12: తిరుమల శ్రీవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు రంగరంగ వైభవంగా జరుగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. రాత్రి 7 నుంచి 8గంటల మధ్య సేనాధిపతి ఉత్సవం, వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు. వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యతవుంది. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతోపాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం. ఏదైనా ఉత్సవానికి 9 రోజుల ముందుగానీ, ప్రధాన ఉత్సవానికి 7, 5, 3 రోజుల ముందుగానీ అంకురార్పణ నిర్వహిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. జ్యోతిష శాస్త్ర సిద్దాంతాల ప్రకారం చంద్రుడుని సస్యకారకుడంటారు. ఈ కారణంగా పగటి వేళ అంకురాలను ఆరోపింపచేయడం తగదు. సాయంత్రం వేళ మంచి ముహూర్తంలో అంకురార్పణ నిర్వహిస్తారు. అంకురార్పణంలో నవధాన్యాలను విత్తనాలు నాటుతారు. మొలకలు ఎంత ఏపుగా వస్తే కార్యక్రమం అంత విజయవంతం అవుతుందని నమ్మకం.
అంకురార్పణ క్రమం
విత్తనాలు నాటేందుకు పాలికలు అనే మట్టి కుండలను వినియోగిస్తారు. యాగశాలలో ఈ క్రతువు నిర్వహించే ప్రదేశాన్ని ఆవు పేడతో అలుకుతారు. ఇక్కడ బ్రహ్మపీఠాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ తరువాత మంట ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఇసాన, జయ అనే దేవతలను ఆహ్వానిస్తారు. ఆ తరువాత భూ మాతను ప్రార్థిస్తూ పాలికలను మట్టితో నింపుతారు. చంద్రుడిని ప్రార్థిస్తూ అందులో విత్తనాలు చల్లి నీరు పోస్తారు. ఈ పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణుసూక్తం పఠిస్తారు. ప్రతి రోజూ ఈ పాలికల్లో కొద్దిగా నీరు పోస్తారు. ఈ మొత్తం కార్యక్రమం వేదమంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ సాగుతుంది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, జేఈఓ శ్రీనివాసరాజు ఇతర అధికారులు పాల్గొన్నారు.