చిత్తూరు

ఉద్యోగాలిచ్చే స్థాయికి ప్రతి ఒక్కరూ విద్య, విజ్ఞానాన్ని సముపార్జించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, సెప్టెంబర్ 25: ఉద్యోగాలిచ్చే స్థాయికి ప్రతి ఒక్కరూ విద్య, విజ్ఞానాన్ని సముపార్జించినప్పుడే జీవితానికి సార్థకత చేకూరుతుందని భారత ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం స్థానిక భారతీయ విద్యాభవన్ శ్రీ వేంకటేశ్వర విద్యాలయంలో ఏర్పాటు చేసిన 29వ వార్షికోత్సవ సభలో భారత ఉప రాష్టప్రతి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నేటి సమాజంలో విద్యావంతులందరికీ ప్రభుత్వ కొలువులు అందించడం అన్ని విధాలా సాధ్యం కాదన్నారు. ఈ క్రమంలో విద్యార్థులు ఉద్యోగాలు పొందడానికి విద్యను, విజ్ఞానాన్ని సముపార్జించడానికి పరిమితం కాకుండా ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. తద్వారా విద్యావంతులు తమ కాళ్లపై తాము నిలబడటమే కాకుండా ఇతరులకు చేయూతనిచ్చేందుకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఉన్నతమైన విద్యాలయంలో చదువుతున్న విద్యార్థులు రేపటి దిశానిర్దేశకులన్నారు. భారతీయ సంస్కృతీ, సాంప్రదాయాలకు వారసత్వాన్ని భావి తరాలకు అందించాలన్నారు. భారతీయ పరంపర కొనసాగించడానికి భారతీయ విద్యాభవన్ విద్యాలయం ఆచార్య మున్షీ స్థాపించారని, ఈ సంస్థతో ఎంతో మంది మహనీయులు, స్వాతంత్య్ర సమరయోధులు క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేశారన్నారు. అలాంటి విద్యాలయానికి తిరుపతి, తిరుమల దేవస్థానం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం కలిసి ఇచ్చిన స్థలం నేడు గురుకులాన్ని తలపిస్తుందని చెప్పారు. చదువుతోపాటు మన విలువలు, సాంప్రదాయాన్ని కొనసాగించాలన్నారు. ప్రతి విద్యార్థిలోనూ టాలెంట్ ఉంటుందని, మన దేశంలో 65శాతం యువతతో యువదేశంగా ఉందని, త్వరలో ప్రపంచ రాజ్యాల మధ్య అగ్రదేశంగా అవతరించనున్నదని తెలిపారు. దీన్ని ప్రపంచ బ్యాంకు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకుల నివేదికల మేరకు శక్తివంతమైన ఆర్థిక దేశంగా మన దేశం నిలువనున్నదని ఉప రాష్టప్రతి పేర్కొన్నారు. భారత సంస్కృతి అనేది తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను గౌరవించడం, స్ర్తిని చెల్లిగా, తల్లిగా భావించడం, సాటి జీవులపట్ల ప్రేమాభిమానాలం చూపాలని సూచించారు. మన సంస్కృతి అంటే చీమలకు చక్కెర, పాములకు పాలు, చెట్లకు బొట్లు పెట్టి పూజించి అభిమానించే పవిత్రమైన జాతి మనదని తెలిపారు. ఈ విద్యాలయంలో ప్రాశ్చాత్య సంస్కృతి పుస్తకాలు భావితరాలకు ఉపయోగపడతాయని, స్వామి వివేకానంద, వేమన, సుమతీ శతకాలు చదవాలని, సినిమాలు, టీవీలకు పూర్తిగా బానిసలైతే మెదడు పనిచేయదని తెలిపారు. ప్రాచీన రుషులు, మహానుభావుల విలువలు భారతీయ విద్యకు అవసరమైన జాతి భక్తి వంటివి విద్యార్థుల అభ్యాస సమయంలో భాగస్వామ్యం అయితే ఉన్నత విలువలకు, క్రమశిక్షణకు ఉపయోగం ఉంటుందన్నారు. పాఠశాలల్లో నైపుణ్యం కోసం వ్యవసాయ, సాంకేతిక రంగాల్లో శిక్షణను ఇవ్వాలన్నారు. తాము చదువుకునే రోజుల్లో తప్పనిసరిగా పీఈటీ, ఎన్‌సీసీ, ఆటల పోటీలు, క్రాఫ్ట్‌క్లాస్, డ్రాయింగ్ వంటివి, క్రీడా మైదానాలు ఉండేవని ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు గుర్తుచేసుకున్నారు. తిరుపతి నగరం నేడు విద్యకు కేంద్రంగా ఉందని, నిన్నటి రోజునే భారతీయ పాకశాస్త్ర ప్రావీణ్య బోధనాలయం ప్రారంభించుకున్నామని చెప్పారు. ఐఐటీ, ఐజర్ వంటి విద్యా సంస్థలు, యూనివర్శిటీలు ఉన్నాయన్నారు. విద్యార్థి దశ నుంచే శాస్ర్తియ ధోరణి ఏర్పడి స్వచ్ఛ భారత్, ప్లాస్టిక్ నిషేధం, చెట్లు పెంచడం, మాతృభాషపై అభిమానం కలిగి ఉండటం అలవాటు చేసుకోవాలని సూచించారు. కన్నతల్లిని, జన్మభూమిని, అమ్మభాషైన మాతృభాషను, ఇంటిలో, వీధిలో, పక్కనున్న తోటి వారితో ఆప్యాయంగా మెలగడం అలవరచుకోవాలని సూచించారు. మాతృ భాష మనకు కళ్లయితే, పరాయి భాష కళ్లద్ధాల్లాంటివన్నారు. ఆదికాలం నుండి, వేదకాలం నుంచి నుండి పుణ్యభూమి నుంచి పురాణాల కాలం నుంచి వచ్చిన సంస్కృతి హిందూ ధర్మం అన్నారు. మతం అనేది వ్యక్తిగతమని, హిందూధర్మ అనేది ఓ జీవన విధానమని చెప్పారు. విదేశాలకు వెళితే సూటు, కోటు, బూటు వంటివి ధరించనని, అడ్రెస్ మారినా డ్రస్ మార్చనవసరం లేదన్నారు. మన నినాదం ఒకే దేశం, ఒకే ప్రజ అన్నారు. గూగుల్ లాంటివి ఎన్ని వచ్చినా గురువులను గౌరవించాలని, గొప్పగా చూడాలని, ఉన్నత ఆలోచనలు శారీరక శ్రమ వంటివి అలవరచుకోవాలన్నారు. భారతీయ విద్యాభవన్‌లో ఉప రాష్టప్రతి సైన్స్ ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ్ రెడ్డి, భారతీయ విద్యాభవన్ సంచాలకులు సత్యనారాయణ రాజు, ఐఐటీ సంచాలకులు సత్యనారాయణ, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతి, జేసీ-2 చంద్రవౌళి, తిరుపతి ఆర్‌డీఓ నరసింహులు, విద్యాభవన్ అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.