డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు -10

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమృతం తెస్తే మా తల్లి దాస్యం తొలగిపోతుందని చెప్పారు కదా! ఇప్పుడు అమృతం తెచ్చాను. నేటి నుండి నా తల్లి దాస్యం తొలగిపోయింది. మీరు వెళ్లి స్నానం చేసి రండి’’అన్నాడు.
సర్పాలు అతని మాటలకు అంగీకరించి స్నానానికి వెళ్లాయి. ఆ సమయంలో ఇంద్రుడు వచ్చి అమృత కలశాన్ని తీసుకొని స్వర్గానికి వెళ్లిపోయాడు. స్నానం చేసి వచ్చిన నాగులకు దర్భలపై అమృత కలశం కనిపించలేదు. నాగులు ఆ దర్భలనే నాకటం మొదలుపెట్టాయి. దానివల్ల వాటి నాలుకలు రెండుగా చీలిపోయాయి. వారు ద్విజిహ్వులు అయ్యారు. సుపర్ణుడు, తల్లితో స్వేచ్ఛగా తిరుగుతూ సర్పాలను భుజిస్తూ విష్ణువుకు వాహనంగా ఎంతో కీర్తితో జీవించాడు. ఇదీ పక్షీంద్రుని కద!

శకుంతల చరితము
పూర్వం పౌరవ వంశంలో తేజస్వి అయిన దుష్యంతుడు జన్మించి ఈ భూమండలాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. అతడు అత్యంత సమర్థుడు. మహావీరుడు. శత్రుమర్దనుడు. అతని పరిపాలనలో ఎక్కడా వర్ణసాంకర్యం జరుగలేదు. ఎవ్వరూ ఏ పాప కర్మలు చేయలేదు. జనులు తమ తమ ధర్మాలను పాటిస్తూ ఉండడం వలన వారికి ఏ విధమైన చోరభయం కాని, వ్యాధి భయం కాని లేకుండినది. నాలుగు వర్ణాల జనులు తమ ధర్మాలని ఆచరిస్తూ, ఎలాంటి భయాలు లేకుండా జీవించేవారు.
ఆ దుష్యంత మహారాజు యువకుడు. పరాక్రమశాలి. దృఢగాత్రుడు. గదాయుద్ధంలో కుశలుడు. బలంలో విష్ణువుతో, సహనంలో భూమితో, తేజస్సులో సూర్యునితో సమానమైనవాడు.
ఒకనాడు దుష్యంతుడు తన సైన్యాన్ని తీసుకొని అరణ్యానికి వేటకు వెళ్లాడు. అతడు రథంపై వెళ్తూ మారేడు, వెలగ, చండ్ర మొదలైన వృక్షాలు ఉన్న అరణ్యాన్ని చూశాడు. అక్కడ ఏనుగులు, సింహాలు, పులులు మొదలైన అనేకమైన మృగాలు ఉన్నాయి. అతడు తన సేవకులతో కలిసి మృగాలను వేటాడసాగినాడు. దూరంగా ఉన్న వాటిని బాణాలతోను దగ్గరగా ఉన్నవాటిని ఖడ్గంతోనూ సంహరించాడు. అడవిలోని మృగాలు భయం చెంది అక్కడి నుండి పారిపోయాయి. మదగజాలు కూడా ఆయుధాల దెబ్బల వల్ల రక్తాన్ని కారుస్తూ పరుగెత్తసాగినాయి. అవి కొంతమంది మనుష్యులను చంపాయి. ఆ వనమంతా చచ్చిపోయిన లేళ్లతో, సింహాలతో, ఇతర మృగాలతో నిండిపోయింది.
మృగాలను ఆ విధంగా వేటాడుతూ సైన్యంతో సహా దుష్యంతుడు ఇంకొక వనం ప్రవేశించాడు. ఆకలి, దప్పులతో అతను ఇంకొకవనానికి వెళ్లాడు. ఆ వనం చక్కని ఆశ్రమాలతో ఉండి అతని మనస్సుకు ఆనందం కలిగించింది. వనం అంతా ఫలపుష్ప వృక్షాలతో పక్షులు చేసే కలకల ధ్వనులతో లేళ్ల గుంపులతో, ఎంతో ప్రశాంతంగా ఉంది. ఆ వనం సిద్ధులు, అప్సరసలు, గంధర్వులు, వానరుల చేత సేవించబడుతోంది. వనం అంతా తిరుగుతూ ఆనందిస్తున్న దుష్యంతుడు అక్కడ ఒక చక్కని ఆశ్రమాన్ని చూచాడు. ఆ ఆశ్రమం యతులతో, మునిగణాలతో అగ్నిహోత్ర గృహాలతో నిండి ఉంది. మాలినీ నదికి ఇరుప్రక్కలా విస్తరించి ఉంది. అక్కడ క్రూరమృగాలైన పులులు, సింహాలు కూడా ఎంతో సౌమ్యంగా ఉన్నాయి. అక్కడ వేదఘోష అన్ని వైపులా వినపడుతున్నది. ఆ ఆశ్రమం కాశ్యపగోత్రుడైన కణ్వమహర్షిది. దుష్యంతుడు ఆశ్రమంలోకి వెళ్లా లనుకొన్నాడు. మహర్షిని దర్శించి వందనమాచరించాలని తలంచాడు. తన సైన్యాన్ని ద్వారం దగ్గరే ఉంచి వారితో ఇలా అన్నాడు.
‘‘ఇది కణ్వమహర్షి ఆశ్రమం. తపోధనుని చూడటానికి వెళ్తున్నాను. నేను వచ్చే వరకు మీరు ఇక్కడే వేచి ఉండండి’’.
తపోవనంలోకి ప్రవేశించిన దుష్యంతుని ఆకలిదప్పులు మటుమాయం అయినాయి. అతను తన రాజచిహ్నాలను మంత్రులను ఆశ్రమం బయటే విడిచి, ఒక్క పురోహితుడు తోడు రాగా ఆశ్రమంలోకి వెళ్లాడు. అక్కడ నిర్వికారుడైన కణ్వ మహర్షిని దర్శించాలని తలచాడు. ఆశ్రమంలో బ్రాహ్మణులు నాలుగువేదాలు చదువుతున్నారు. వారు అలా వేదసంహితను పఠనం చేస్తుంటే ఆ ఆశ్రమం ఇంకొక బ్రహ్మలోకంలా కన్పించింది.
అక్కడ యజ్ఞవేదికలను ఏర్పాటు చేయడంలో నిపుణులు, క్రమంలో శిక్షణ ఇవ్వగలిగేవారు, న్యాయతత్వం ఆత్మజ్ఞానం కలిగిన వేదపారంగులు, మోక్షం పట్ల, ధర్మం పట్ల ఆసక్తి ఉన్నవారు, సిద్ధాంతం, వ్యాకరణం, పరమార్థం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం పట్ల శ్రద్ధ, జ్ఞానం కలవారు శాస్తప్రండితులు ఇలా ఎంతో మంది విద్వాంసులైన మునులు ఆ ఆశ్రమంలో ఉన్నారు. వారందరినీ చూస్తూ వారికి వందనమాచరిస్తూ అతను కాశ్యపుని ఆశ్రమంలోకి ప్రవేశించాడు. కాని అక్కడ అతనికి కణ్వమహర్షి కనబడలేదు. ఇంతలో లక్ష్మీదేవి వంటి రూపంతో ఒక తాపస కన్య ఆశ్రమంలోంచి బయటకు వచ్చింది.
అతడు ఆశ్రమానికి వచ్చిన అతిథిగా గ్రహించి నియమానుసారం అతనిని అర్ఘ్యపాద్యాదులిచ్చి పూజించింది.
దీర్ఘమైన బాహువులతో, విశాలమైన నేత్రాలు, సింహభుజుడు అయిన రాజుతో ఆమె ఇలా అన్నది. ‘‘మీకు స్వాగతం. నేను మీకు ఏమి చేయగలను? ఆశ్రమానికి ఎందుకు వచ్చారు? మహర్షి ఆశ్రమానికి వచ్చిన మీరెవరు?’’
అప్పుడు రాజు ఆ కన్యతో ఇలా అన్నాడు. ‘‘్భద్రా! నేను ఇలిలుడనే రాజర్షి పుత్రుడను. నా పేరు దుష్యంతుడు. నేను కణ్వమహర్షిని దర్శించడానికి వచ్చాను. మహర్షి ఎక్కడకు వెళ్లారు?’’
శకుంతల ఇలా అంది ‘‘పూజ్యుడైన నా తండ్రి ఫలాల కోసం ఆశ్రమం బయటకు వెళ్లారు. కొంతసేపు నిరీక్షిస్తే ఆయన వస్తారు’’. (ఇంకావుంది)