కథ

బలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలాసేపట్నుంచి ఎదురుచూస్తున్నానే గాని చంద్రం రాలేదు. పదవ తరగతి పరీక్షకు అప్లికేషన్లు పంపడానికి రేపు ఒక్కరోజు మాత్రమే వ్యవధి ఉంది. నా తరగతిలో విద్యార్థులంతా ఫీజుతో సహా అప్లికేషన్ ఫారాలు పూర్తి చేసి ఇచ్చేశారు. చంద్రం ఇంకా ఇవ్వలేదు. స్కూలుకి కూడా రాలేదు. ఇక ఉండబట్టలేక వాడి ముఖ్య స్నేహితుడు శేఖరాన్ని అడిగాను. చంద్రం డబ్బుల కోసం తిరుగుతున్నాడని వాడు చెప్పాడు..
చంద్రం అంటే నాకు కొంత అభిమానం ఉంది. బదిలీ మీద నేనా ఊరొచ్చి ఆంజనేయస్వామి గుడి వద్ద బస్సు దిగాను. గుడి అరుగు మీద కూర్చున్న కొంతమంది ఎవరో అన్నట్టుగా చూశారే తప్ప మాట్లాడలేదు. మరి కొంతమంది ఇలా చూసి అలా ముఖాలు తిప్పుకున్నారు. ఇంతలో గుడికెదురుగా ఉన్న చింతచెట్టు కింద గోళీలాడుతున్న కుర్రవాళ్లలో ఒకడు గబగబా నా వద్దకొచ్చి, ‘ఎవరింటికెళ్లాలండీ?’ అన్నాడు.
‘ఇక్కడ నాకు బంధులెవరూ లేరు నాయనా! హైస్కూల్‌కి ఎటువెళ్లాలో చెప్పు’ అన్నాను. దానికి జవాబుగా ‘నాకూడా రండి!’ అన్నాడు వాడు ముందుకు నడుస్తూ. సుమారు పదేళ్ల వయస్సుండే ఆ కుర్రాణ్ణి అనుసరిస్తూ వివరాలు సేకరించాను.
వాడి పేరు చంద్రం. ఆ సంవత్సరం ఐదో తరగతితో చదువు ఆపేసి రామయ్య అనే చేనేత షావుకారు వద్ద పనిలో కుదిరి చుక్కలు తియ్యడం నేర్చుకుంటున్నాడు. చదువుకోవాలని వున్నా వాడి తండ్రి ఒప్పుకోవడం లేదు. ఆ ఊళ్లో చేనేత కార్మికులంతా నెలకోసారి సెలవు తీసుకుంటారు. ఆ రోజు సెలవు కావడంతో స్నేహితులతో గోళీలాడుతున్నాడు.
చంద్రం మాటలు విన్నాక వాడిలా చదువు మీద ఆసక్తి ఉండీ చదువుకోలేక పోతున్న కుర్రాళ్లు ఇక్కడ ఇంకెందరున్నారో అనుకున్నాను. కాస్త ముందుకెళ్లాక ఒక సందులో ఉన్న ఇల్లు అనబడే రేకుల షెడ్డు చూపించి ‘అదేనండీ మా ఇల్లు’ అన్నాడు.
నేను తలపంకించి, ‘హైస్కూలు ఇంకా ఎంత దూరం?’ అన్నాను.
‘అవిగో పొడవుగా చెట్లు కనిపిస్తున్నాయి కదండీ అదే!’ అంటూ అక్కడికి సుమారుగా అరకిలోమీటరు దూరంలో వున్న హైస్కూలుకి నన్ను చేర్చి వాడు వెళ్లిపోయాడు.
పచ్చని చెట్ల మధ్య ప్రశాంత వాతావరణంలో ఉందా హైస్కూలు. ప్రధానోపాధ్యాయుడ్ని కలుసుకొని మాట్లాడి ఊళ్లోకి వెళ్లాను.. చేనేత పరిశ్రమకు, ఆయుర్వేద మందుల తయారీకి పేరు పొందిన ఆ ఊరు బానే ఉంది. చాలా ఇళ్లల్లోంచి నేతనేస్తున్న శబ్దాలు వినిపిస్తున్నాయి. ఊరికి అతి దగ్గర్లో వున్న సముద్రం ఉండుండీ ఘోష పెడుతోంది. సముద్రపు టొడ్డున అక్కడక్కడా ఏపుగా పెరిగిన సరుగుడు తోటలున్నాయి. మత్స్యకార స్ర్తిలు కొందరు రోడ్డు పక్కన చేపలు, రొయ్యలు ఎండబెట్టే పనిలో ఉన్నారు.
సముద్రానికి సమీపాన ఉన్న లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నాను. వారం తర్వాత చంద్రం వాళ్లూ ఉండే వీధిలోనే ఇల్లు దొరికింది. ఓ ఆదివారం వెళ్లి నా కుటుంబాన్ని తీసుకొచ్చాను.
ఒకరోజు స్కూల్‌కి వెళుతూంటే చంద్రం వాళ్లింట్లోంచి వాడి ఏడుపు వినిపించింది. ‘ఏమైందబ్బా?’ అనుకుంటూ లోపలికెళ్లాను. చంద్రానికి ఒంట్లో బాగుండక పనికి పోనంటే తండ్రి నారాయణ వాడిని కొట్టి బయటకు వెళ్లిపోయాడని చంద్రం తల్లి సూరమ్మ చెప్పింది.
సూరమ్మకు ఇద్దరు పిల్లలు. చంద్రంకన్నా పెద్దదైన ఆడపిల్ల నవఖండ్రవాడలో వాళ్ల అమ్మమ్మ వద్ద ఉంటుంది. సూరమ్మ భర్త తాగుబోతు. ఆ ఊళ్లో చాలామంది కులంతో నిమిత్తం లేకుండా చేనేత పని మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. ఆ కులం కాకపోయినా నారాయణ చేనేతకు సంబంధించిన పనులన్నీ నేర్చుకున్నాడు. కానీ, తెల్లవారుజామున నిర్వహించే పడుగు పనికి మాత్రమే వెళ్లి పదయ్యేసరికి ఇంటికొచ్చేస్తాడు. పడుగు చేయించుకున్న వాళ్లిచ్చిన డబ్బులతో తాగేస్తాడు. ఇంకా చాలకపోతే సూరమ్మను పీడిస్తాడు, దండిస్తాడు. అలాక్కూడా పని జరక్కపోతే ఇంట్లో ఉన్న గిన్నో ముందో బజారుకెళ్లిపోతుంది. ఊళ్లో అప్పులు దండిగా ఉన్నాయి.
సూరమ్మ ఇంట్లో పనయ్యాక చేనేత షావుకారు రామయ్య షెడ్డు కెళుతుంది. ఆయనో అరడజను మగ్గాలు పెట్టి పది మందికి పని చెబుతున్నాడు. సూరమ్మకు ముందుగా కొంత డబ్బు అప్పుగా ఇచ్చాడు. సూరమ్మ అక్కడి మగ్గాలకు కావాల్సిన కండెలు చుడుతుంది. అచ్చులు అతుకుతుంది.
అచ్చులో ఉన్న పోగుకు పడుగు పోగును అతకడం అతికష్టం. అయినా సూరమ్మ ఆ పని చాలా ఓపికగా చేస్తుంది. ఆ పనులన్నీ అయ్యాక రాత్రి ఏడు గంటల వరకూ నేతనేసి ఇంటికొస్తుంది. ఎంత కష్టపడ్డా నారాయణ తాగుడు కారణంగా ముగ్గురి కడుపులూ నిండడం కనాకష్టమవుతోంది.. ఈ విషయాలన్నీ వివరించి సూరమ్మ కళ్లనీళ్లు పెట్టుకుంది.
మరుసటి రోజు నారాయణను కలిసి తాగుడు మానమని, చంద్రాన్ని ఆరో తరగతిలో చేర్చమని అనేక విధాలుగా నచ్చజెప్పాను. అలా చెప్పగా చెప్పగా చంద్రాన్ని స్కూలుకి పంపించాడు గాని తాగుడు మాత్రం మానలేదు.
చంద్రం చదువులో చురుగ్గా ఉంటాడు. ప్రతి సంవత్సరం అందరికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటున్నాడు. మంచి తెలివైన వాడిగా గుర్తింపు పొందాడు.. తండ్రి తాగుబోతు, పేదరికం, ఆర్థిక ఇబ్బందులతోపాటు చదువుకి ఏ మాత్రం అనుకూలంగా లేని ఇంట్లో నివసించే చంద్రం అలాంటి గుర్తింపు పొందడం విశేషమనే చెప్పుకోవాలి. సెలవు రోజుల్లో ఊరికినే తిరక్కుండా చుక్కలవీ తీసి, డబ్బులు సంపాదించి, వాటితో నోట్ పుస్తకాలవీ కొంటుంటాడు.
చూసీ చూసీ నాకు విసుగొచ్చిందే గాని మొత్తానికా రోజు చంద్రం స్కూల్‌కి రానే రాలేదు. శేఖరంగాడు చెప్పినట్టు ‘డబ్బుల కోసం ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాడేమో!’ అనుకొని, అసలు విషయం తెలుసుకునేందుకా సాయంత్రం వాళ్లింటికి వెళ్లాను. సూరమ్మ ఇంట్లోనే ఉంది. ఒంట్లో బాగుండక చేనేత పనికి వెళ్లలేకపోయానని, చంద్రం డబ్బులు కోసం తన తల్లి వద్దకు వెళ్లాడని చెప్పింది. మర్నాడు తప్పక చంద్రాన్ని స్కూల్‌కి పంపమని చెప్పి రోడ్డుమీదికొచ్చాను.
అప్పుడే ఇంటికొస్తున్న నారాయణ ఎదురుపడ్డాడు. వణుకుతున్న చేతులతో నమస్కారం పెట్టి ‘ఇపుడొచ్చారేటి మాట్టారూ?’ అంటూ పలకరించాడు. అప్పటికే అతగాడు పూటుగా తాగి ఉన్న విషయం నాకర్థమైంది. అయినా మాట్లాడక తప్పదు గనుక - పరీక్ష ఫీజు కట్టడానికి రేపే ఆఖరి రోజని, ఫీజు కట్టకపోతే చంద్రాన్ని పరీక్ష రాయనివ్వరని చెప్పాను.
‘రాయకపోతే పోనీ మేట్టారూ... అసలాడు సదివేటి సేత్తాడు? ఎంత సంపాదించేత్తాడేటి? ఇప్పుడాడు నేతలోకి పోతే రోజుకో వందొత్తాది తెలుసా, తెలుసా అని. ఇదిగో మేట్టరూ ఓ మేట్రూ నా మాటిను. నా కొడుక్కి సదువొద్దు. పరీచ్చలూ వద్దు...’ నారాయణ ఇంకేదేదో మాట్లాడుతున్నాడు. నేను గబగబా ముందుకి నడిచాను. తాగిన మత్తో మరొకటో తెలియదు గాని అతను మాట్లాడిన మాటలు నన్ను అమితంగా బాధించాయి. కుమారుడి పట్ల బాధ్యతతో వ్యవహరించి, వాడికో మార్గం చూపించాల్సిన తండ్రి అలా మాట్లాడ్డం చిరాకనిపించింది. వ్యసనం మనిషినెంత వివేకహీనుణ్ణి చేస్తుందో నాకా క్షణాన బాగా బోధపడింది.
మరుసటి రోజు స్కూలుకెళుతూ చంద్రం ఇంటి వద్ద ఆగాను. విచార వదనంతో సూరమ్మ ఇంటి అరుగు మీద కూర్చొనుంది. ‘ఏమైంది సూరమ్మా! చంద్రం ఇంకా ఊర్నుంచి రాలేదా?’ అన్నాను.
ఆమె ఎగదన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుతూ ఏదో చెప్పడానికి ప్రయత్నించీ నోరు విప్పలేక పోయింది. నా గుండె బేజారైంది. చంద్రానికేమైనా జరగకూడనిది జరిగిందేమోనన్న అనుమానమూ వచ్చింది. కొన్ని క్షణాలాగి ‘నన్ను ఇబ్బంది పెట్టక చంద్రానికేమైందో చెప్పు?’ అన్నాను. ఆమె లోపలికెళ్లి ఎత్తుపీట తెచ్చి అరుగు మీద వేసి కూర్చోమంది. నేను కూర్చున్నాక ఉండుండీ దుఃఖపడుతూ సూరమ్మ చెప్పిన విషయాలు వినగానే నా కళ్లు చెమర్చాయి.
గత రాత్రి చంద్రం అమ్మమ్మ ఇచ్చిన డబ్బులు పట్టుకొని ఊర్నుంచి వచ్చాడు. తెచ్చిన డబ్బులు, పూర్తి చేసిన అప్లికేషను ఫారం నోట్ పుస్తకంలో ఉంచి, తన పుస్తకాల బల్ల మీద పెట్టి పడుకున్నాడు. తెల్లవారి చూస్తే పుస్తకంలో డబ్బులు కనిపించలేదు. అనుమానం వచ్చి సూరమ్మ, చంద్రం పడుగు చేసే వాళ్ల వద్దకు వెళ్లి అడిగితే ఆ వేళ నారాయణ అక్కడికి రానే లేదని చెప్పారు. తల్లీకొడుకులు తిరగ్గా తిరగ్గా ఊర చెరువు దగ్గరున్న సారా దుకాణం వద్ద నారాయణ కనిపించాడు. పీకల దాకా తాగి స్పృహ లేకుండా పడున్నాడు.
నారాయణ వద్ద ఉండాల్సిన డబ్బులు గురించి సారా కొట్టు యజమానిని నిలదీశారు. ఆ రోజు తాగిన దానికీ పాత బాకీకి సరిపోయాయి అన్నాడతను. పాతబాకీ తర్వాత ఇస్తాం. ఆ డబ్బులు ఇవ్వమంది సూరమ్మ. అతను ఒప్పుకోలేదు. కుర్రాడి పరీక్ష ఫీజు కట్టాలి. పోనీ అప్పుగా ఇవ్వు. షావుకారు రామయ్యగారు ఊరెళ్లారు. ఆయన రాగానే వడ్డీతోసహా ఇచ్చేస్తాను అంటూ సూరమ్మ ఎంత బతిమాలినా బండరాయి లాంటి అతడి మనసు కరగలేదు.
ఇక చేసేదిలేక సూరమ్మ ఓ పక్కన పడున్న నారాయణని అటూ ఇటూ కదిపింది. లేవలేదు. అక్కడున్న ప్లాస్టిక్ బకెట్‌తో చెరువులో నీళ్లు తెచ్చి నెత్తిన గుమ్మరించే సరికి అతని మత్తు దిగింది. తను చేసిన పనికి సిగ్గుపడ్డం మాని తల్లీకొడుకులు సారాకొట్టు దగ్గరకొచ్చినందుకు మండిపడుతూ నానా తిట్లూ తిట్టాడు. చెంప అదిరిపోయేలా చంద్రాన్ని కొట్టాడు. తండ్రినేమీ అనలేని నిస్సహాయ స్థితిలో చంద్రం ఒక్క ఉరుకున అక్కడ నుంచి వెళ్లిపోయాడు. అలా వెళ్లిన వాడు అంతవరకూ ఇంటికి రాలేదు.
సూరమ్మ చెప్పినదంతా విన్నాక బాధతో నా హృదయం బరువెక్కింది.. చిత్రం. తాగి బిడ్డల భవిష్యత్తుతో ఆటాడుకునే వాడొకడు. తాగి పెళ్లాన్ని తనే్నవాడొకడు. తాగి బండి నడుపుతూ పరుల ప్రాణాల్ని తీసే వాడొకడు. తాగి పరస్ర్తిని చెరిచేవాడొకడు. తాగి రోడ్డు మీద దొర్లే వాడొకడు. వీళ్లకెన్ని చెప్పినా ఏం చేసినా బుద్ధి రాదేమో! అసలిలాంటి దృశ్యాలు చూడని రోజు, వినని రోజు వస్తుందా? ఎన్నో విషాద కథలు వింటున్నా, తాగుడు కారణంగా ఎనె్నన్నో కుటుంబాలు బలవుతున్నా పాలించే ప్రభువులకు చీమ కుట్టదు గాక కుట్టదు... నా తల దిమ్మెక్కిపోయింది. భారంగా నిట్టూర్చి, సూరమ్మ వద్ద నుంచి చంద్రం అప్లికేషన్ ఫారం తీసుకున్నాను. చంద్రం రాగానే అర్జంటుగా నా వద్దకు పంపమని చెప్పి స్కూల్‌కి వచ్చేశాను.
ఆ రోజు ఫీజు కట్టకపోతే చంద్రానికి ఇబ్బంది అవుతుంది. ఓ సంవత్సరం వృధా అయినా కావచ్చు. తెలివైన వాడి భవిష్యత్తు దెబ్బతినకూడదన్న ఉద్దేశంతో కుర్రవాళ్లందరి ఫీజులతో కలిపి వాడి ఫీజు కూడా కట్టేశాను. ఉండబట్టలేక చంద్రం ఎక్కడెక్కడ ఉంటాడో తెలిసిన శేఖరానికి, వాడిని వెదికి తీసుకురమ్మని పురమాయించాను.
ఆగని కాలం ముందుకు కదిలింది. ఇంటికి పోవచ్చునంటూ స్కూలు గంట మోగింది. విద్యార్థులంతా వెళ్లిపోయారు. శేఖరం, చంద్రాల జాడలేదు. మరో పావుగంట చూసి నేను బయలుదేరుతూంటే శేఖరం వచ్చాడు.
‘ఏడిరా చంద్రం!’ అన్నాను కోపంగా.
‘చంద్రమండీ.. చంద్రం...’ నసుగుతూ ఉండిపోయాడు శేఖరం.
‘ఏమైందిరా.. చంద్రం కనిపించలేదా?’ అన్నాను అసహనంగా.
‘లేదు సార్! చంద్రం ఇంక కనిపించడు’ అని పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ-
‘చంద్రం శవమై పోయాడు సార్! వాడు సముద్రపు టొడ్డున పడి ఉన్నాడు?! సూరమ్మ గుండె పగిలేలా ఏడుస్తోంది! నారాయణ రాతిబొమ్మలా ఉలుకూ పలుకూ లేకుండా నిలబడి ఉన్నాడు. చాలామంది నేతగాళ్లు, మత్స్యకారులు అక్కడున్నారు...’ ఈ మాటలు గబగబా చెప్పేసి వెక్కివెక్కి పడుతూ ఏడవసాగేడు శేఖరం.
నా కాళ్లకింది భూమి కంపించింది. కళ్ల ముందు నక్షత్రాలు మెరిశాయి. అయిపోయింది. అంతా అయిపోయింది. చివరికా తాగుబోతు నారాయణ, ఎంతో వృద్ధిలోకి వస్తాడనుకున్న చంద్రాన్ని, ఓ భావి భారత రత్నాన్ని సాగరానికి బలి ఇచ్చాడు. బలి ఇచ్చేవాడు. మనిషిలో విచక్షణా జ్ఞానాన్ని దహించి వేసే మద్యానికి అడ్డుకట్ట వెయ్యకపోతే ఇలాంటి బలులు జరుగుతూనే ఉంటై. నిత్యం కుటుంబాలు కూలిపోతూనే ఉంటై..

చోడిశెట్టి శ్రీనివాసరావు 4-66/2, మధురాపురం, వాకలపూడి, కాకినాడ-533 005 89786 14136