డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు-42

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్వం ఇక్ష్వాకు వంశంలో ప్రతాపవంతుడైన సగరుడు అనే రాజు ఉండేవాడు. అతనికి చాలాకాలం సంతానం కలుగలేదు. అతను హైహయ వంశరాజులను, తాలజంఘులనే క్షత్రియులను జయంచి తన రాజ్యాన్ని విస్తరించాడు.
సగరునికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య వైదర్భి. రెండవ భార్య శైబ్య. సగరుడు ఇద్దరి భార్యలతో కలిసి సంతానం కోసం కైలాస పర్వతం దగ్గర తీవ్రమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు ప్రసన్నుడైన శివుడు ప్రత్యక్షమై అతనితో ఇలా అన్నాడు. ‘‘నీవు వరం అడిగిన మూహూర్తమునుబట్టి దాని ఫలం కూడా ఉంటుంది. అరవై వేలమంది పరాక్రమం, అభిమానం గల పుత్రులు ఒక భార్యకు జన్మిస్తారు. కాని ఒకేసారి వారంతా నాశనమవుతారు. రెండవ భార్యకు ఒకే ఒక వంశోద్ధారకుడు పుడతాడు’’. ఇలా వరం ఇచ్చి శివుడు అంతర్థానమయ్యాడు. సగరుడు సంతోషంతో భార్యలతో కలిసి తన నగరానికి చేరుకున్నాడు.
కొంతకాలానికి వైదర్భి, శైబ్య ఇద్దరు గర్భవతులు అయ్యారు. మరి కొంతకాలానికి శైబ్య ఒక కుమారుని కన్నది. వైదర్భి ఒక సొరకాయ వంటి దాన్ని కన్నది. సగరుడు ఆ ఫలాన్ని పారవేయడానికి ప్రయత్నించగా ఆకాశం నుండి ఇలా వినబడింది. ‘‘రాజా! సాహసం చేయకు. ఆ సొరకాయ గింజలను తీసి నేతి పాత్రలో విడివిడిగా భద్రం చేయ. వాటినుండి నీవు అరవై వేల మంది పుత్రులను పొందెదవు. శివుని వరం వల్ల వీరు ఇలా పుడ్తారు. కనుక ఇంకొక విధంగా ఆలోచించకు.’’
అశరీరవాణి వాక్కు విన్న సగరుడు అదే విధంగా చేసి ఆ పాత్రల రక్షణార్థం దాదులను ఏర్పాటు చేశాడు. చాలాకాలానికి ఆ పాత్రల నుంచి బలసంపన్నులైన పుత్రులు అరవై వేలమంది పుట్టారు. వారంతా కఠినులు, ఆకాశంలో సంచరించగలవారు, క్రూరకర్మలు చేసేవారు. సంఖ్యాబలం చేత గర్వితులై వారు దేవతలను సహితం హేళన చేసేవారు. పురజనులను బాధించేవారు. అప్పుడు జనులు దేవతలు కలిసి బ్రహ్మదేవుని శరణువేడారు. బ్రహ్మవా రితో ఇలా అన్నాడు. ‘‘మీరంతా మీమీ స్థానాలకు వెళ్ళిపొండి. కొద్ది రోజులలోనే వారు చేసిన తప్పులకు శిక్ష పొందుతారు’’ ఆ మాటలు విని వారు వెనక్కి మరలిపోయారు.
కొంతకాలం ఈ విధంగానే గడిచింది. అప్పుడు సగరుడు అశ్వమేధ యాగం చేయసంకల్పించి అశ్వాన్ని పూజించి వదిలాడు. దానికి రక్షణగా ఈ పుత్రులందరినీ పంపాడు. ఆ అశ్వం స్వేచ్ఛగా తిరిగి జలశూన్యమైన సముద్ర తీరానికి వచ్చి అంతర్థానమైంది. (సముద్రం నీరంతా కాలకేయులను వధించడానికి దేవతల కోర్కెపై అగస్త్యుడు త్రాగి వేశాడు. అశ్వం అంతర్థానమైన విషయం సగర పుత్రులు వచ్చి తండ్రితో చెప్పాడు. మరల అతని ఆజ్ఞపై అన్ని దిక్కులు వెతకటం ప్రారంభించారు. భూమినంతా వెదకి నా అశ్వం జాడ తెలియక ఆ విషయాన్ని తండ్రికి విన్నవించారు. అశ్వం కాని, అశ్వచోరుడు కాని ఎక్కడా దొరకలేదు అని చెప్పారు. వారి మాటలకు కోపించి తండ్రి గుర్రం దొరికే దాకా నగరానికి తిరిగి రావద్దని వారికి ఆజ్ఞ ఇచ్చాడు. మరల వారు అశ్వాన్ని వెతకటానికి వెళ్ళి ఒక చోట ఒక బిలం చూశారు. వారు ఆ బిలాన్ని త్రవ్వుకుంటూ పోయారు. ఇలా సముద్రాన్ని వారు త్రవ్వారు. అలా వారు అన్ని వైపుల నుంచి త్రవ్వుతూ ఉంటే సముద్రం బాధపడింది. వారిచే చంపబడిన ప్రాణులు వేల కొద్దీ అయ్యాయ. చాలాకాలం ఆ విధంగా త్రవ్వినా అశ్వం జాడ తెలియలేదు. సగరులు మిక్కిలి కోపంతో సముద్రాన్నిచీల్చి పాతాళం చేరి అక్కడ ఉన్న అశ్వాన్ని, తేజస్వి అయన కపిల మహర్షిని చూశారు. వారు గుర్రాన్ని చూసిన ఆనందంతో మహర్షిని లెక్కచేయక అశ్వాన్ని పట్టుకోవడానికి పరుగుపెట్టారు. వారి చర్యతో కోపించిన కపిలుడు తన కంటి చూపుతో వారందరినీ భస్మం చేశాడు. అప్పుడు నారదుడు సగరుని దగ్గరకు వచ్చి వారి వృత్తాంతం అతనికి చెప్పాడు. సగరుడు రుద్రుడు చెప్పిన విషయం గుర్తుతెచ్చుకొని బాధపడి, అసమంజసుని పుత్రుడైన అంశుమంతుని పిలిచి అశ్వాన్ని వెతికి తీసుకుని రమ్మని పంపాడు. సగరుడు మనుమని పంపడానికి కారణం ఉంది. అంశుమంతుని తండ్రి అసమంజసుడు శైబ్య యొక్క పుత్రుడు. అతడు పౌరుల పిల్లలను పట్టుకుని సరయూనదిలోకి విసిరివేసేవాడు. దానితో పౌరులు తమ కష్టాన్ని రాజుకు నివేదించగా అతను కుమారుని దేశ హితం కోరి, రాజ్యం నుండి వెడలగొట్టాడు. అంశుమంతుడు తాత దగ్గరే పెరిగి పెద్దవాడయ్యాడు. అశ్వం కోసం వెళ్తున్న మనుమనితో సగరుడు ఇలా అన్నాడు. ‘‘నీ తండ్రిని త్యాగం చేయడం వల్ల ఇతర కుమారుల మరణం వల్ల నేను చాలా దుఃఖంతో ఉన్నాను. యజ్ఞ విఘ్నం కాకుండా అశ్వాన్ని తెచ్చి నాకు మనశ్శాంతిని కలిగించు.’’
అంశుమంతుడు ముందుగా తన తండ్రులు త్రవ్విన బిలం దగ్గరకు వెళ్ళి సముద్రంలోకి ప్రవేశించాడు. అక్కడ కపిలుని, యజ్ఞ అశ్వాన్ని చూశాడు. ఆయనకు ముందుగా శిరస్సు వంచి మహర్షికి నమస్కరించాడు. ముని ప్రసన్నుడై అతన్ని వరం కోరుకోమన్నాడు. అంశుమంతుడు యజ్ఞ సమాప్తి కోసం అశ్వాన్ని కోరాడు. తన పితరులను తరింప చేయడానికి ఇంకొక వరం కోరుకున్నాడు. ముని సంతోషించి అతనికి వరాలు వచ్చి అతని వల్ల సగరుడు తరిస్తాడని తెలుపుతాడు. అతని మనుమడు స్వర్గం నించి గంగ తీసుకొని వచ్చి శంకరుని సంతోషపెట్టి, పితరులను తరింపచేస్తాడు అని చెప్తాడు.
అంశుమంతుడు అశ్వాన్ని తీసికొని వచ్చి తాతకు అప్పగించి ముని చెప్పిన విషయాలను తాతకు చెప్తాడు. సగరుడు అశ్వంతో యజ్ఞపూర్తి చేశాడు. చాలాకాలం రాజ్యం చేసి మనుమని రాజును చేసి తపస్సుకు వెళ్ళి తర్వాత స్వర్గాన్ని చేరుతాడు. అంశుమంతుడు కొంత కాలం రాజ్యం చేసి తన కుమారుడు దిలీపునికి రాజ్యం ఇచ్చి తను కూడా స్వర్గం చేరాడు. దిలీపుడు కొంతకాలం అదే విధంగా పరిపాలించి తన కుమారుడైన భగీరథుని రాజును చేసి వానప్రస్థానికి వెళ్ళిపోతాడు.
భగీరథుడు రాజైన తర్వాత గొప్ప కీర్తి సంపాదించాడు. తన పితరులకు కలిగిన నాశనాన్ని, స్వర్గప్రాప్తి లేకపోవటము గురించి తెలుసుకున్నాడు. రాజ్యభారాన్ని మంత్రులపైన ఉంచి అతను హిమాలయాలకు వెళ్లి చాలాకాలం గంగ గురించి తపస్సు చేశాడు. అప్పుడు గంగ అతని ముందు ప్రత్యక్షమై ఏమి కోరి అతను తన గురించి తపస్సు చేస్తున్నాడో తెలుపమంది.
భగీరథుడు ఆ పుణ్యనదికి నమస్కరించి ఇలా అన్నాడు. ‘‘నా పితరులు అరవై వేల సగర పుత్రులు కపిలుని శాపాగ్నికి భస్మరాసులై పోయారు. వారి శరీరాలకు నీ జల స్పర్శ తగిలితేనే ఉత్తమ గతులు లభిస్తాయ. కనుక వారిపై ప్రవహించి వారికి స్వర్గ ప్రాప్తి కలిగించు’’.
సురగంగ అతని ప్రార్థనకు ప్రసన్నురాలై ఇలా అంది - ‘‘నీ ప్రార్థనకు సంతోషించాను. భూమిపైకి వస్తాను. కాని నా ప్రవాహ వేగాన్ని శంకరుడు తప్ప ఇంకెవ్వరూ భరించలేరు. కనుక ముందు శంకరుని మెప్పించు. నీ తపస్సుకు మెచ్చి శంకరుడు నన్ను తన శిరస్సుపై ధరిస్తాడు’’.
భగీరథుడు మరల శంకరుని కోసం తపస్సు ప్రారంభించాడు. శంకరుడు అతని తపస్సుకు సంతోషించి గంగను తలపై ధరించటానికి ఒప్పుకొన్నాడు.
ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి