సబ్ ఫీచర్

పేదల సేవే పరమావధిగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గొప్ప వైద్యురాలిగా ఆమె కీర్తి విశ్వవ్యాప్తం.. 1962 నాటి భారత్- చైనా యుద్ధంలో మెడికల్ ఆఫీసర్‌గా విశేష సేవలందించినందుకు ప్రముఖుల నుంచి ఎనె్నన్నో ప్రశంసలు.. అనేక ఆస్పత్రుల్లో వివిధ హోదాల్లో పనిచేసినా పేదల సేవకోసం నిరంతర తపన.. ఇదీ- ఆసియా ఖండంలోనే ‘తొలి మహిళా న్యూరోసర్జన్’గా ఖ్యాతి పొందిన డాక్టర్ టీఎస్ కనక జీవన ప్రస్థానం.. ‘నాడీ వ్యవస్థ నిపుణురాలి’గా చెరగని ముద్ర వేసిన డాక్టర్ తంజావూర్ సంతానకృష్ణ కనక (86) ఈనెల 14న చెన్నైలో తుదిశ్వాస విడిచారు. వైద్యురాలిగా ముఖ్యంగా నాడీ వ్యవస్థ నిపుణురాలి (న్యూరోసర్జన్)గా ఆమె చేసిన సేవలను, పరిశోధనలను వైద్యులు ఒక్కసారిగా గుర్తు చేసుకుంటున్నారు. ప్రపంచంలోనే మూడవ మహిళా న్యూరోసర్జన్‌గా ఆమె కీర్తి చిరస్థాయిగా నిలిచింది.

1932 మార్చి 31న చెన్నైలో జన్మించిన టీఎస్ కనక 1954లో ఎంబీబీఎస్ పట్టా పొందారు. 1968లో ఎంఎస్ (న్యూరోసర్జరీ) పూర్తి చేశారు. విద్యార్థి దశలోనే న్యూరోసర్జరీపై తనకు ఎంతో ఆసక్తి కలిగిందని కనక తన సన్నిహితులకు చెబుతుండేవారు. చెన్నై వైద్య కళాశాలలో కనక చదువుతుండగా ఆమె సోదరి భర్త నాడీ సంబంధ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో అప్పట్లో ప్రముఖ న్యూరోసర్జన్ అయిన డాక్టర్ బి.రామమూర్తి వద్ద వైద్యం ఇప్పించారు. ఆ కాలంలో చెన్నై, వెల్లూరు, బొంబాయిలో మాత్రమే న్యూరోసర్జరీ బాగా అభివృద్ధి చెందింది. వైద్య విద్యార్థినిగా ఉన్నపుడే కనక పలువురు వైద్యులను న్యూరాలజీ గురించి ఎన్నో ప్రశ్నలు వేసి అనుమానాలను నివృత్తి చేసుకొనేవారు. ఇలా న్యూరాలజీపై తనకు ఆసక్తి పెరిగిందని ఆమె గుర్తుచేసేవారు. అనుకున్నట్లే ఆమె ఎంఎస్ పూర్తిచేసి ఆసియా ఖండంలోనే తొలి మహిళా న్యూరోసర్జన్‌గా గుర్తింపు పొందారు. మెదడు, నాడీ వ్యవస్థకు సంబంధించి ఎన్నో పరిశోధనలు చేశారు. 1960- 1970 ప్రాంతంలో డాక్టర్ బాలసుబ్రమణ్యం, డాక్టర్ కల్యాణ్‌రామ్‌లతో పాటు డాక్టర్ టీఎస్ కనక పేరు కూడా మేటి న్యూరోసర్జన్ల జాబితాలో చోటు చేసుకుంది. నాడీ వ్యవస్థ నిపుణురాలిగా ఆమె ఎన్నో శస్తచ్రికిత్సలను చేసి వైద్య నిపుణుల ప్రశంసలు అందుకున్నారు. భారత-చైనా యుద్ధంలో వైద్యురాలిగా సేవలందించడమే గాక, చెన్నైలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సుదీర్ఘకాలం పాటు సేవలందించారు. మద్రాస్ మెడికల్ కళాశాల, అడయార్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్, అంటువ్యాధుల పరిశోధనా సంస్థ, హిందూ మిషన్ ఆస్పత్రితో పాటు అనేక ప్రముఖ వైద్యశాలల్లో పనిచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్వహించే వైద్యసేవా కార్యక్రమాల్లో మూడు దశాబ్దాల పాటు ఆమె పాల్గొన్నారు. 139 సార్లు రక్తదానం చేసిన వ్యక్తిగా 2004లో ‘లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్సు’లో స్థానం సంపాదించారు.
1990లో పదవీ విరమణ చేశాక, వైద్యవృత్తికి విశ్రాంతి ఉండరాదని భావించి పేదల కోసం సొంత డబ్బు వెచ్చించి వైద్యం అందించేవారు. ఇందుకోసం ‘శ్రీ సంతానకృష్ణ పద్మావతీ ఆరోగ్య కేంద్రం, పరిశోధనా సంస్థ’ను స్థాపించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఈ సంస్థ ద్వారా ఉచిత వైద్యసేవలు అందించారు. సహాయం అవసరం ఉన్న వారికి, పేదలకు సేవలందించడమే ధ్యేయంగా వృద్ధాప్యాన్ని సైతం లెక్కచేయకుండా కనక సేవలు అందించారు. న్యూరోసర్జరీ రంగంలో పురుషాధిక్యత కొనసాగుతున్న సమయంలో ఆమె ఓ సంచలనం సృష్టించారు. సేవాతత్పరతకు మారుపేరుగా పేదల గుండెల్లో నిలిచారు. *