రాష్ట్రీయం

టీఆర్‌ఎస్‌కు ఇవే చివరి ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల: నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం పేరిట మాయ మాటలతో ఉద్యమ ముసుగు తొడిగి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్.. ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం చేయలేదని, దొరల పాలనను అంతమొందించేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని, టీఆర్‌ఎస్‌కు ఇవే చివరి ఎన్నికలని గద్వాల మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. ఆదివారం జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలోని గద్వాల నియోజకవర్గంలో ఆమె పర్యటించారు. మల్లెందొడ్డి, మార్లబీడు, కేటీదొడ్డి, పాతపాలెం గ్రామాలతో పాటు మహిళా సంఘాలు, పెయింటింగ్ యూనియన్, పట్టణంలోని 2, 20 వార్డులకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు దాదాపు 2 వేలమంది కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి డీకే అరుణ మాట్లాడుతూ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, విద్యుత్ సరఫరా పేరిట కోట్లాది రూపాయలు కమీషన్ దండుకున్న కేసీఆర్ ఈ ఎన్నికల్లో డబ్బులు పంచి మరోసారి గద్దెనెక్కేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇంటింటికీ ఉద్యోగమంటూ నిరుద్యోగ యువతను మోసం చేశారని, తన ఇంటిలో ఐదు రాజకీయ ఉద్యోగాలు సంపాదించుకొని రాష్ట్ర ప్రజలను మొత్తం గాలికి వదిలేశారని అన్నారు. 60 ఏళ్లలో ఏ ప్రభుత్వమూ చేయనంత అప్పులు చేసి ప్రజాధనాన్ని దోచుకున్నది టీఆర్‌ఎస్ పార్టీయేనని, అప్పులన్నీ తెలంగాణ ప్రజలకు, కమీషన్లు కేసీఆర్ కుటుంబానికి దక్కాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆత్మగౌరవాన్ని ఈ ప్రాంత ఉద్యమాన్ని అమరుల త్యాగాలను స్మరించుకొని సోనియాగాంధీ తన పుట్టినరోజు కానుకగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని మంజూరు చేస్తే, కాంగ్రెస్ పార్టీలో టీఆర్‌ఎస్‌ను కలుపుతానని మాటఇచ్చి ఉద్యమ పంథాను పక్కకుపెట్టి రాజకీయ పార్టీగా మారుతామంటూ ఊసరవెల్లి రాజకీయాలతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఐదేళ్లు పాలించకుండానే తొమ్మిది నెలల ముందుగా గద్దెదిగి రాష్ట్రాన్ని పాలించేందుకు మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రజల ముందుకు వెళుతున్న టీఆర్‌ఎస్ నేతలకు ఎక్కడకు వెళ్లినా చీవాట్లు తప్పడం లేదని గుర్తు చేశారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం, జూరాల ముంపు నిర్వాసితులకు నాలుగేళ్లలో ఎలాంటి న్యాయం జరగలేదని, ఓట్ల కోసం ఇచ్చిన హామీలు, వాగ్దానాలు నీటిమూటలుగా మిగిలాయని, 99వ ప్యాకేజీ పనులు ఇంకా పూర్తి కాలేదని, వీటిపై టీఆర్‌ఎస్ నేతలు సమాధానం చెప్పాలని అన్నారు. అన్ని సర్వేలూ మహాకూటమికి ప్రజలు బ్రహ్మరథం పడతారని తెలియజేస్తుండడంతో గులాబీ నేతలకు నిద్రపట్టడం లేదని, అక్రమంగా దోచుకున్న డబ్బును నియోజకవర్గాల్లో పంచి లబ్ధిపొందాలని మంత్రులు, మాయగాళ్లు, ఇన్‌చార్జిలు మకాం వేసి కుట్రలు చేస్తున్నారని వాపోయారు. నడిగడ్డలో దొరల పాలనకు, నడిగడ్డ ఆత్మగౌరవానికి జరుగుతున్న ఎన్నికలని, ప్రజలు మరోసారి అవకాశం కల్పిస్తే గద్వాలను రాష్ట్రంలోనే అగ్రగ్రామిగా నిలుపుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, మాణిక్యారెడ్డి, రామాంజనేయులు, గంజిపేట తిమ్మన్న, నాగులుయాదవ్, హన్మంతరాయ, శ్రీను, నారాయణ తదితరులు పాల్గొన్నారు.