రాష్ట్రీయం

కడప ఉక్కుకు తొలి అడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు కేంద్రం ముందుకు రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే ఈ కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించి, అందుకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేసింది. కర్మాగార ఏర్పాటుపై మరింత స్పష్టత వచ్చేలా రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. రాయలసీమ స్టీల్ కార్పొరేషన్‌కు సీఎండీగా ఆర్‌ఐఎన్‌ఎల్ మాజీ సీఎండీ పి.మధుసూదన్‌ను నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సంస్థకు సీఎండీని కూడా నియమించడంతో కర్మాగార ఏర్పాటు ప్రక్రియలో మరో ముందడగు పడినట్లు చెప్పవచ్చు. రాష్ట్ర విభజన సమయంలో కడపలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్రం హామీ ఇచ్చింది. అయితే నాలుగేళ్లుగా ఈ విషయమై కేంద్రం దాటవేత ధోరణిని అనుసరిస్తున్న విషయం తెలిసిందే. కర్మాగార ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్సు నివేదిక కేంద్రానికి ఇచ్చినప్పటికీ, దానిపై కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కర్మాగారం ఏర్పాటుకు అన్ని అనుకూలతలు ఉన్నట్లు ఇతర నిపుణుల చెబుతున్నప్పటికీ, కేంద్రం దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తోంది. ఒక దశలో కడప ఉక్కు కర్మాగార ఏర్పాటును స్టీల్ అథారికీ ఆఫ్ ఇండియా (సెయిల్)కు అప్పగించేందుకు కేంద్రం ప్రతిపాదించింది. అయితే సెయిల్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో సెయిల్‌కు మరో ఉక్కు కర్మాగార నిర్మాణ బాధ్యతలు అప్పగించలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఉన్న ఉక్కు మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రైవేట్ సంస్థలు కూడా ముందుకు రాలేని పరిస్థితి ఉంది. ఒక వేళ ప్రైవేట్ సంస్థలు ముందుకు వచ్చినా, ఇనుప ఖనిజం గనుల కేటాయింపు సమస్యగా మారవచ్చు. అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో ఉన్న ఇనుప ఖనిజ గనుల్లో దాదాపు 250 మిలియన్ టన్నుల మేర ఖనిజం ఉన్నట్టు మెకాన్ సంస్థ అంచనా వేసింది. దాదాపు 20 వేల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టాల్సి ఉండటంతో ప్రైవేట్ సంస్థలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు లాభదాయకం కాదని సుప్రీంకోర్టుకు కూడా కేంద్రం తెలియచేసి, సెయిల్ కూడా ఈ మేరకు నివేదిక ఇవ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు జమ్మలమడుగు మండలంలో దాదాపు 2000 ఎకరాల స్థలాన్ని ఇప్పటికే కేటాయించింది. తాజాగా ఉక్కు కర్మాగార ఏర్పాటును వేగవంతం చేసేందుకు వీలుగా రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థలో ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ భాగస్వామిగా ఉండి, 50 శాతం వాటాను కలిగి ఉంటుంది. మూల ధనంగా రెండు కోట్ల రూపాయలు కేటాయించింది. కర్మాగారానికి కావాల్సిన నీరు, ఇతర వౌలిక సదుపాయాల కల్పన, ఇనుప ఖనిజం గనుల అప్పగింత వంటి చర్యలు తీసుకోనుంది.