రాష్ట్రీయం

బాబు ప్రచారానికొస్తే తరిమికొట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, నవంబర్ 21: ‘వదల బొమ్మాళీ వదలనంటూ చంద్రబాబు తయారయ్యారు. గతంలోనే చంద్రబాబును నేను తరిమి కొట్టినా ఇంకా బుద్ధి రాలేదు. ఈ ధపా ఆ పని మీకు వదిలేస్తున్నా. ఎన్నికల ప్రచారానికి వస్తే ఆయనను తరిమి తరిమి కొట్టండి’ అంటూ మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ఎన్నికల ప్రచార సభలో టీఆర్‌ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. జడ్చర్లలో మంత్రి లక్ష్మారెడ్డి అధ్యక్షతన బుధవారం నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభకు కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్రమైన విమర్శలు చేశారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వస్తే ప్రజలు తరిమితరిమి కొట్టాలంటూ ఆవేశపూరితమైన ప్రసంగం చేశారు. తెలుగుదేశం పార్టీ తరపున తెలంగాణలో ఏ ముఖం పెట్టుకుని ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్నారని వారు అసలు తెలంగాణ బిడ్డలేనా? అంటూ టీడీపీ అభ్యర్థులను ఉద్దేశించి ప్రశ్నించారు. తెలంగాణ గడ్డపై మళ్లీ బాబు అడుగుపెట్టడానికి చూస్తే ఇక్కడి బిడ్డలు చేతులు ముడుచుకుని కూర్చుంటారనుకోవడం ఆయన ముర్ఖత్వమేనని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం
ఊకేరాలేదని ఎంతో పోరాటం చేశామని ఆయన వెల్లడించారు. చంద్రబాబులాంటి ద్రోహులను తరిమి కొట్టడానికి 14 ఏళ్లపాటు ఉడుంపట్టులా పట్టి పోరాటం చేశామని అలా పోరాటం చేయకుంటే తెలంగాణ రానేరాదని తెలిపారు. పోరాటంతో సాధించుకున్న తెలంగాణను ఆంధ్రాబాబుల చేతుల్లో ఎలా పెడుతామని అందుకే ఈ వేదిక నుండి తెలంగాణ ప్రజలకు తాను పిలుపునిస్తున్నానని టీఆర్‌ఎస్ చీఫ్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికలను ఆషామాషిగా తీసుకోవద్దని కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాకుండా చేయాల్సిన భాద్యత ప్రజలపైనే ఉందని అన్నారు. కోటి ఎకరాల మాగాణిలో పంటలు పండుతూ ఆకుపచ్చ తెలంగాణగా అయ్యేవరకు ప్రతి తెలంగాణ బిడ్డ నిద్రపోవద్దని ఈ ఎన్నికల్లో మళ్లీ టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్మించుకుంటున్న ప్రాజెక్టులకు అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తూ ఢిల్లీకి లేఖలు రాస్తూ విషాన్ని చిమ్ముతున్న చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. మళ్లీ ఇక్కడ పాదం మోపడానికి కాంగ్రెస్ నాయకుల జుట్టును ఆయన చేతుల్లో పట్టుకుని కుట్రలు చేస్తున్నారని మహకూటమి పేరిట మరో మాయగాడిలా వస్తే ఊరుకునేది లేదని కేసీఆర్ హెచ్చరించారు. ఇక్కడి కాంగ్రెస్ నాయకులు రాజకీయంగా చేతకాదని చంద్రబాబే నిరుపించారని తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను కదిలించే దమ్ము, ధైర్యం కాంగ్రెస్ నాయకులకు, ఆంధ్ర బాబుకు లేదని కేసీఆర్ ఘాటైన విమర్శలు చేశారు. పాలమూరు జిల్లాలో రెండు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీచేస్తున్నారని వారిని చిత్తుచిత్తుగా ఓడించి చంద్రబాబుకు చెంపపెట్టులా తీర్పును ఇవ్వాలని ఆయా నియోజకవర్గాల ప్రజలను విజ్ఞప్తి చేశారు. మిగితా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించి కాంగ్రెస్‌ను కనుమరుగు చేయాలని పిలుపునిచ్చారు. పాలమూరు ప్రజలు తమ పౌరుషాన్ని చాటి పాలమూరు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులకు ఘన విజయాన్ని అందించి గులాబీ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. పాలమూరును తొమ్మిదేళ్లపాటు దత్తత తీసుకుని ఎందుకు అభివృద్ధి చేయలేదో కృష్ణాజలాలను పాలమూరు రైతుల భూముల్లో ఎందుకు పారించలేదో ముందుగా చంద్రబాబునాయుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు తాము ప్రాజెక్టులు కడుతున్నామని ఉత్తుతి కాలువలు తవ్వి ప్రాజెక్టులను పెండింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘనులని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను 90శాతం పూర్తిచేసి నాలుగున్నర ఏళ్లలో 8.50లక్షల ఎకరాలకు సాగునీరు అందించామన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించిన మొదట్లోనే కాంగ్రెస్ నాయకులు సృష్టించిన అడ్డంకులు అన్ని ఇన్ని కావని ఏకంగా 35కేసులు వేశారని ఆరోపించారు. అందులో చంద్రబాబు కూడా తానేమి తక్కువ అంటూ విషం చిమ్ముకుంటూ ఢిల్లీకి లేఖలపై లేఖలు రాసిన దుర్మర్గుడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లలో పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి అవుతుందని దాంతో 20లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. పాలమూరు పచ్చబడుతుంటే బొంబాయికి వెళ్లే బస్సులు కూడా బంద్ అవుతాయని ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో ఉన్న పాలమూరు వలస బిడ్డలు తిరిగి తమ సొంత గ్రామాలకు వచ్చి స్థానికంగా వ్యవసాయాన్ని పండుగగా మార్చుకుంటున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించకుంటే, ఉద్యమాన్ని వీడితే తానను రాళ్లతో కొట్టి చంపాలటూ అప్పట్లో చెప్పానంటూ ఇప్పుడు కోటి ఎకరాల తెలంగాణ మాగాణి పచ్చబడే వరకు నిరంతరం శ్రమిస్తానన్నారు. ఈ ఎన్నికల్లో మరోసారి టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించి మళ్లీ గులాబీ జెండాను తెలంగాణ గడ్డపై ఎగురవేయాలని కేసీఆర్ అభ్యర్థించారు. బహిరంగసభలో మంత్రి లక్ష్మారెడ్డి, టీఆర్‌ఎస్ సెక్రెటరి జనరల్ ఎంపీ కేశవరావు, మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..నల్లగొండ జిల్లా నకిరేకల్ ఎన్నికల సభలో మాట్లాడుతున్న కేసీఆర్