కడప

పార్టీ పటిష్టతకు బాబు కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,డిసెంబర్ 18: టీడీపీ పటిష్టతకు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్టవ్య్రాప్తంగా కసరత్తు చేపట్టారు. శాసనసభ ఎన్నికలకు మూడునెలల ముందే రాష్ట్రంలోని దాదాపు అన్ని నియోజకవర్గాలకు తెలుగుదేశంపార్టీ అభ్యర్థులను ఖరారు చేయనుందా? ఇందుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతి జిల్లాలో రోజంతా మకాం వేసి పార్టీలోని క్రిందిస్థాయి నేతల అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకోనున్నారా ? అనే అభిప్రాయాలు తెలుగుదేశంపార్టీలో వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈనెల 27,28వ తేదీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలో మకాం వేయనున్నారని ఆపార్టీ వర్గాలు చెబుతున్నాయి. 27వ తేదిన జమ్మలమడుగు నియోజకవర్గంలోని మైలవరం మండలం కంబాలదినె్న గ్రామపరిధిలోని భూముల్లో ఉక్కుపరిశ్రమకు శంకుస్థాపన కార్యక్రమం ఉంది. 27వ తేదీ రాత్రి, 28వ తేదీ పగలు జిల్లాలో తెలుగుదేశంపార్టీ పటిష్టతకు, అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు మూడునెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని ఇటీవల చంద్రబాబునాయుడు ప్రకటించడం, జిల్లాలో రెండురోజులు మకాం వేయడం వంటి పరిణామాలతో ఆపార్టీ నేతల్లో ఉత్కంఠ మొదలైంది. ఇప్పటికే పలు రకాలుగా నిర్వహించిన సర్వేలపై నివేదికను సిద్ధం చేసుకున్న చంద్రబాబునాయుడు ప్రతి నియోజకవర్గంపై ఆచితూచి అడుగువేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కఠినమైన నిర్ణయాలు తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈపరిణామం జిల్లాలోని 10నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్న నేతల్లో గుబులురేకెత్తిస్తోంది. సర్వేలో తమకు అనుకూలంగా వచ్చిందా, వ్యతిరేకంగా వచ్చిందా, టిక్కెట్ ఇస్తారా ఇవ్వరా అనే అనుమానాలతో ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో టికెట్ ఆశించేవారు ఒకరికి మించి ఉన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గం మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో ఎవరికి టిక్కెట్ ఇస్తారన్నది విశే్లషకులకే అంతుచిక్కడం లేదు. ప్రతి నియోజకవర్గంలోనూ రెండు వర్గాల పోరు కొనసాగుతోంది. ఎవరికి వారు రానున్న ఎన్నికల్లో టిక్కెట్ తమకే వస్తుందని ప్రచారం చేసుకోవడమే గాకుండా అధిష్ఠానవర్గాన్ని మెప్పించడం కోసం రకరకాల రాజకీయ ఎత్తుగడలతో తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీలోనే ఉన్న రెండువర్గాలు తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శించుకుంటున్న సందర్భంలో, ఒకరికి టికెట్ ఇస్తే, మరోవర్గం ఎన్నికల్లో వెన్నుపోటు పొడిచే అవకాశం కూడా లేకపోలేదు. ఇది అవతలి పార్టీ అభ్యర్థికి కలిసొచ్చే అంశం. ఈ పరిణామాలు ఎదురుకాకుండా ఇప్పటి నుండే ముఖ్యమంత్రి అందరితో చర్చించి హామీ ఇచ్చే కార్యక్రమానికి పూనుకోబోతున్నట్లు తెలుస్తోంది. ముందస్తుగానే అభ్యర్థులను ప్రకటించడం ద్వారా, పార్టీలోని అసంతృప్తులను బుజ్జగించేందుకు తగిన సమయం ఉంటుందనే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు పార్టీ వర్గాల కథనం. అందువల్లే మూడునెలలకు ముందే అభ్యర్థుల జాబితాను ప్రకటించే నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. కాగా జిల్లాలోని ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టీడీపీలోని రెండు వర్గాల మధ్య పచ్చగడ్డివస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. వీరిని కట్టడి చేయడం అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. కమలాపురం, బద్వేలు, రాజంపేట, రైల్వేకోడూరు, కడప నియోజకవర్గాల్లోనూ టికెట్ ఆశించే వర్గాల మద్య విబేధాలున్నాయి. ఈనేపధ్యంలో జిల్లాలో రెండురోజులపాటు మకాం వేసి నియోజకవర్గాల వారీగా నేతలతో మాట్లాడి, సర్వేల ఫలితాలను బయటపెడతారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇది జిల్లా నేతలను కలవరపరుస్తోంది. ఈనెల చివరినాటికి కొన్ని నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక ప్రకటించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.