ఉత్తరాయణం

బ్యాంకు పరీక్షలకు భారీ ఫీజులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏటా వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టే సందర్భంగా దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు భారీగా ఫీజులు చెల్లించాల్సి రావడం దారుణం. ముఖ్యంగా ఈ ఫీజులు ఓసీ, ఓబీసీ వర్గాల నిరుద్యోగులకు భారంగా పరిణమిస్తున్నాయి. ఓసీ, ఓబీసీ కేటగిరీలకు చెందిన వారంతా ధనవంతులు కారు. వీరు బ్యాంకు ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటేనే ఇప్పుడు భయపడుతున్నారు. గతంలో ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఉద్యోగ నియామకాలకు ఒకే పోటీ పరీక్ష (బిఎస్‌ఆర్‌బి) నిర్వహించేవారు. అయితే ఇప్పుడు జాతీయ బ్యాంకులు విడివిడిగా నోటిఫికేషన్లు జారీచేస్తూ అధిక ఫీజులను వసూలు చేస్తున్నాయి. ప్రతి నెలలో కనీసం ఒకటి, రెండు బ్యాంకులు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి. ఈ పరీక్షలకు హాజరవ్వాలనుకునే పేదవర్గాల అభ్యర్థులు భారీ ఫీజులను చూసి అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. బ్యాంకుల్లో క్లర్కులు, పీఓలు తదితర పోస్టులకు నోటిఫికేషన్లు ఇస్తుండగా లక్షల సంఖ్యలో నిరుద్యోగులు దరఖాస్తు చేస్తున్నారు. ఓసీ, ఓబీసీ వర్గాల వారు 600 నుంచి 800 రూపాయల వరకు దరఖాస్తు రుసుము కింద చెల్లించాల్సి వస్తోంది. కొన్ని వర్గాల వారికి మాత్రం 100 నుంచి 200 రూపాయల వరకు ఫీజులుగా నిర్ణయిస్తున్నారు. కులాన్ని బట్టి కాక పేదరికాన్ని ప్రాతిపదికగా తీసుకుని పోటీ పరీక్షలకు దరఖాస్తు రుసుములను నిర్ణయించాలి. కాగా, స్ట్ఫా సెలక్షన్ కమిషన్, యుపిఎస్‌సి నిర్వహించే పరీక్షలకు దరఖాస్తు రుసుము బ్యాంకు పరీక్షల కంటే తక్కువగానే ఉంటుంది. ప్రభుత్వరంగ బ్యాంకులకు మాత్రం పెద్ద మొత్తంలో దరఖాస్తు రుసుమును నిర్ణయించడం నిరుద్యోగులకు తీవ్ర నిరాశ కల్గిస్తోంది. అన్ని రకాల ఉద్యోగ నియామకాలకు సంబంధించి 100 లేదా 200 రూపాయలను గరిష్ఠ రుసుముగా నిర్ణయిస్తే పేదవర్గాల నిరుద్యోగులకు వెసులుబాటు కలుగుతుంది. పోస్టులను కేటాయించడంలోనే కాక, ఫీజుల విషయంలోను ఓసీ, ఓబీసీ వర్గాలకు అన్యాయం జరుగుతోంది. కులంతో నిమిత్తం లేకుండా, పేదవర్గాలకు చెం దిన నిరుద్యోగులకు దరఖాస్తు రుసుమును తగ్గించాలి. దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయి న ఎస్‌బిఐ నిరుద్యోగుల నుండి భారీగా దరఖాస్తు రుసుము దండుకోవడం దారుణం. ఉద్యోగ నియామకాలకు సంబంధించి దరఖాస్తు రుసుమును రద్దు చేయకపోయినా, కనిష్ఠంగా తగ్గించి నిరుద్యోగులను ప్రభుత్వం ఆదుకోవాల్సి వుంది. వచ్చే నూతన సంవత్సరంలో అయినా పాలకులు ఈ దిశగా నిర్ణయం తీసుకోవాలి.
- ఆర్.కృష్ణకాంత్, చీరాల
తుపాను బాధితులను ఆదుకోండి
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తాజా పెథాయ్ తుపాను రైతాంగాన్ని నిలువునా నష్టపరిచింది. భారీ వర్షం, గాలుల తాకిడికి వరి, మొక్కజొన్న తదితర పంటలు నీట మునగడంతో రైతులు పూర్తిగా నష్టపోయారు. కొందరు మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళి గల్లంతు అయ్యారు. కొండచరియలు, చెట్లు విరిగిపడడంతో అక్కడక్కడా ఆస్తినష్టం జరిగింది. బాధితులను గుర్తించి వారికి సకాలంలో సరైన నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో తుపాను తాకిడికి వరి, మొక్కజొన్న పూర్తిగా తడిసి మొలకెత్తే పరిస్థితిలో ఉన్నది. అలాంటి ధాన్యాన్ని వ్యాపారస్తులు, ప్రభుత్వం మానవతా దృక్పథంతో కొనుగోలు చేయాలని రైతాంగం కోరుతున్నది. ఈ సంవత్సరం వ్యవసాయ సీజన్ అంతంత మాత్రంగానే ఉండి పంటలు ఎండిపోయి కొద్దోగొప్ప ధాన్యం చేతికి వస్తుంది అనుకుంటే అకాల వర్షంతో రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. కొద్దిగా పండిన ధాన్యం కూడా చేతికిరాక వర్షంలో తడిసిపోవడంతో ఆరుగాలం పండించిన రైతులు ఆవేదన చెందుతున్నా రు. సముద్రతీరంలో పూరిగుడిసెల్లో నివసిస్తున్న మత్స్యకారులకు పక్కాగృహాలు నిర్మిం చి, వౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. గుడిసెల్లో ఉంటున్న మత్స్యకారులు విద్యుత్, వంటగ్యాస్ తదితర సౌకర్యాలు లేక తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆ కుటుంబాలు కోరుతున్నాయి. సమయానికి సరిగ్గా వర్షాలు లేక పంట కొంత ఎండిపోయి ఆందోళన చెందుతున్న తరుణంలో పెథాయ్ తుఫాన్ మరింత నష్టాన్ని చేకూర్చింది. ఆదివాసీలు సాగుచేస్తున్న పోడు వ్యవసాయంలో మొక్కజొన్న, పత్తి పూర్తిగా దెబ్బతిన్నది. ఆదివాసీ రైతాంగం పూర్తిగా నష్టపోయారు. అలాంటివారిని గుర్తించి ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని ఆదివాసీ రైతాంగం కోరుతున్నది. తుపాను కారణంగా నష్టపోయిన రైతులతో పాటు ఇతరులనూ ఆదుకోవాల్సి ఉంది.

-వూకె రామకృష్ణదొర, గుండాల
రాజకీయ కోణంలో రుణమాఫీ
ఎన్నికల రణక్షేత్రంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆచరణ సాధ్యం కాని హామీలను గుప్పించడం, అరచేతిలో వైకుంఠం చూపించడం, తీరా అధికారంలోకి రాగానే సగానికిపైగా హామీలను గాలిలో వదిలేయడం మన దేశంలో రాజకీయ పార్టీలకు రివాజుగా మారింది. తాజాగా ఇటీవల ముగిసిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో రైతులకు రుణమాఫీ అంశం ఒక ముఖ్యమైన ఎన్నికల హామీగా మారింది. ఇందుకోసం లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రజాధనం కావలసి వుండగా ఇంత మొత్తంలో బడ్జెట్ సమకూర్చడం దాదాపుగా అసాధ్యం అని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయిదు రాష్ట్రాలలో ఎన్నికైన ప్రభుత్వాలు తమ తొలి ప్రాధాన్యత ఋణ మాఫీ అని ఎన్నికలముందే ఘనంగా ప్రకటించాయి. గతంలో ఋణమాఫీ హామీలు ఇచ్చిన ఎనిమిది రాష్ట్రాలలో కేవలం రెండు రాష్ట్రాలు (ఉత్తరప్రదేశ్, హరియాణా), అదీ కేంద్ర ప్రభుత్వం సమకూర్చిన నిధుల సాయంతో పాక్షికంగా అమలుచేయగా మిగతా ఆరు రాష్ట్రాలు అధికారం లోనికి వచ్చాక ఆ ఊసే ఎత్తకపోవడం గమనార్హం. మొత్తం మీద ఋణమాఫీ అనేది పార్టీలకు అధికారంలోకి వచ్చేందుకు ఒక పాశుపతాస్త్రంగా మారిందనడంలో ఎలాంటి సందేహంలేదు. నేడు నెలకొన్న వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడానికి అది ఒక్కటి మాత్రమే చాలదన్న విషయం అందరూ గుర్తెరగాలి. ప్రకటించే ఆ రైతు రుణమాఫీని పూర్తిస్థాయిలో అమలుచేయాలి తప్ప ఆపద మొక్కులాగా చెల్లించితే ఏమీ ప్రయోజనం వుండదు. మొత్తం వ్యవసాయ రుణాల్ని మాఫీ చేస్తామని ఎన్నికల హామీనిచ్చి అధికారానికి వచ్చాక రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా రైతుల ఋణమాఫీ పథకం పాక్షికంగా, కంటి తుడుపు చర్యలా మాత్రమే అమలు అయ్యింది. ఇచ్చింది గోరంత కాగా, చేసింది కొండంత అని ప్రభుత్వాలు ప్రకటించుకోవడం ప్రజలను మభ్యపెట్టడమే అవుతుంది. పీకల్లోతు కష్టాలలో కూరుకుపోయిన దేశ వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు వ్యవసాయ ఋణాలమాఫీ అనేది మంచి ఆలోచన కానేకాదు. రైతులకు తక్కువ శాతానికే ఋణాలు ఇవ్వడం, సులభతరమైన ఋణాలను తీర్చే విధానం, మెరుగైన రైతు బీమా, ఖర్చులకు అనుగుణంగా వ్యవసాయ మద్దతు ధరలు ప్రకటించడం, దళారీల వ్యవస్థను రద్దుచేసి, మార్కెట్లలో రైతులకే నేరుగా ఉత్పత్తులు అమ్ముకునే సౌలభ్యం వంటి చర్యలను ప్రభుత్వం తీసుకోవడం ఎంతో అవసరం. వ్యవసాయ సంక్షోభ నివారణకు రుణమాఫీ తప్పక తోడ్పడుతుంది. అయితే అది మాత్రమే చాలదు. వ్యవస్థాగత సమస్యలను పరిష్కరించాలి. ముఖ్యంగా సంస్థాగత రుణ లభ్యత, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం వ్యవసాయోత్పత్తులకు న్యాయమైన ధర కల్పన వంటి అంశాలపై సర్కారు దృష్టి పెట్టాలి.
- సి.హెచ్.ప్రతాప్, శ్రీకాకుళం