రాష్ట్రీయం

పది లక్షల కోట్లిచ్చాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 21: ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు అధికార పక్ష నేతలు ఏమి చెబుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ గత ఐదేళ్లలో ఏమైనా ప్రగతి సాధించిందంటే అది కేంద్ర ప్రభుత్వం అందించిన ఆర్థిక తోడ్పాటుతోనే సాధ్యమైందని కేంద్ర రహదారులు, నౌకా రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రానికీ లభించని రీతిలో కేంద్రం నుంచి దాదాపు పది లక్షల కోట్ల రూపాయలపైనే సాయం అందిందన్నారు. కేవలం తన ఆధీనంలోని రహదారులు, ఓడరేవుల శాఖల నుంచే మూడు లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులు చేకూరాయన్నారు. ఇందులో ఏమైనా అపోహలు - సందేహాలు ఉంటే థర్డ్‌పార్టీ ఆడిట్‌కు సిద్ధమేనా అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. రహదారులశాఖ నుంచి లక్షా, 24వేల కోట్లు, ఓడరేవుల శాఖ నుంచి లక్షా, 64వేల కోట్లు నిధులు అందాయని అన్నారు. సోమవారం విజయవాడ పీబీ సిద్ధార్థ ఆడిటోరియంలో జరిగిన కృష్ణా జిల్లా కార్యకర్తల సమావేశంలో మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ స్వాతంత్య్రానంతరం ఈ రాష్ట్రానికీ ఇప్పటి వరకు ఇంతటి భారీ సాయం ముందెన్నడూ అందలేదన్నారు. గోదావరి
నదిపై నిర్మితమవుతున్న పోలవరం ప్రాజెక్టు పూర్తికి కేంద్రం నూటికి నూరు శాతం నిధులు కేటాయిస్తున్నదని అన్నారు. సకాలంలో పోలవరం పూర్తికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఈ దేశంలో నీటి కొరత ఉన్న రాష్ట్రాలకు నీరు అందించాలన్న లక్ష్యంతో 20 ఏళ్ల క్రితమే నాటి ప్రధాని వాజ్‌పేయి గోదావరి - కృష్ణా - పెన్నా - కావేరి నదుల అనుసంధానానికి రూ. 60 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రపంచ బ్యాంక్ సాయంతో కేంద్రం ఓ బృహత్తర పథకాన్ని రూపొందించారన్నారు. కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేస్తున్నదన్నారు. నిరుపేదల కోసం ఉజ్వల పథకం కింద ఇప్పటికే ఆరు కోట్ల గ్యాస్ కనెక్షన్‌లను అందించిందన్నారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం పది శాతం రిజర్వేషన్లను అమల్లోకి తీసుకురావడమే ఒక విప్లవాత్మకమైన అంశమని అన్నారు. పారిశ్రామికాభివృద్ధికి విశాఖ - చెన్నై ఇండిస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో సెజ్‌లు నిర్మిస్తామన్నారు. సాగర్‌మాల కింద తొమ్మిది పారిశ్రామిక వాడల ఏర్పాటుకు అనుమతిస్తున్నామని అన్నారు. రూ. 4,562 కోట్ల అంచనాతో కాకినాడలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ క్లస్టర్, రూ. 3,328 కోట్లతో అప్పెరల్ క్లస్టర్, రూ. 24,500 కోట్లతో సిమెంట్ క్లస్టర్, రూ. 15వేల కోట్లతో ఐదు షిప్పింగ్ హార్బర్లు, కాకినాడ - పుదుచ్చేరి జాతీయ రహదారిని నిర్మిస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం పూర్తయితే మూడు లక్షల హెక్టార్ల భూమి కొత్తగా సాగులోకి రాగలదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఈ ఘనత అంతా తమదేనని చెప్పుకుంటున్నారన్నారు. 2014 నాటికి రాష్ట్రంలో 4,193 కి.మీ జాతీయ రహదారులుండగా ఈ ఐదేళ్లలో 7,260 కి.మీకి చేరాయన్నారు. భారత్‌మాల పథకం కింద రూ. 44వేల కోట్లతో 2520 కి.మీ రహదారులను నిర్మిస్తున్నామని, సేతుభారత్ పథకం కింద రూ. 2500 కోట్లు ఖర్చుతో 31 ఆర్‌ఓబీలు, రూ. 1301 కోట్లతో 18 రైల్వే ఆర్‌ఓబీలు నిర్మిస్తున్నామని, అనంతపురం - అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి రూ. 20వేల కోట్లు మంజూరు చేసామన్నారు. రూ. 8,700 కోట్ల అంచనాలతో నిర్మించే 159 కి.మీ నిడివిగల అమరావతి బైపాస్ రింగ్‌రోడ్ నిర్మాణానికి అనుమతిచ్చామన్నారు. సాగర్‌మాల ప్రాజెక్టు కింద రాష్ట్రంలో 108 పోర్టుల కనెక్టివిటీకి లక్షా, 65వేల కోట్ల రూపాయ విలువైన ప్రాజెక్టులను గుర్తించామన్నారు. వీటిల్లో 71 పనులు 2018 డిసెంబర్ మాసాంతం నాటికి పూర్తి అయ్యాయన్నారు. పోర్టులు అభివృద్ధి చెందితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయంటూ విశాఖ పోర్టు ఎగుమతుల సామర్థ్యాన్ని 152 మిలియన్ మెట్రిక్ టన్నులు నుంచి 2011 మెట్రిక్ టన్నులకు పెంచాలన్నది తమ లక్ష్యంగా మంత్రి గడ్కరీ తెలిపారు.
ముందుగా పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్‌లను స్వాగతిస్తూ మంత్రి గడ్కరీచే భారీ కేక్ కట్ చేయించారు. పార్టీ నగర అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ అధ్యక్షతన జరిగిన సభలో రాష్ట్ర అధ్యక్షులు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, మహిళా మోర్చా జాతీయ ఇన్‌చార్జి, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి, శాసనసభలో బీజేపీపక్ష నేత పెనె్మత్స విష్ణుకుమార్‌రాజు, రాష్ట్ర అధికార ప్రతినిధి ఉప్పలపాటి శ్రీనివాసరాజు తదితరులు ప్రసంగించారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహరావు, రాష్ట్ర సహ ఇన్‌చార్జి సునీల్ డియోధర్, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు, ఎమ్మెల్యే పీవీఎన్ మాధవ్, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న నితిన్ గడ్కరీ