జాతీయ వార్తలు

అభివృద్ధి-సంక్షేమానికి ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: రక్షణ రంగానికి శుక్రవారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో పెద్దమొత్తాన్ని కేటాయించారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ రంగానికి 3.05 లక్షల కోట్లను కేటాయిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ఇది గత బడ్జెట్ కన్నా 20 వేల కోట్లు అధికం. సరిహద్దు భద్రత, బలగాల పటిష్టానికి ఈ రంగానికి పెద్దమొత్తంలో నిధుల కేటాయింపు చేశామని, దేశంలో మొదటిసారిగా ఈ రంగానికి కేటాయించిన నిధులు మూడు లక్షల కోట్లు దాటాయని ఆయన చెప్పారు. అవసరమైతే ఈ రంగానికి మరిన్ని నిధులు కేటాయిస్తామని ఆయన తెలిపారు. దేశరక్షణ, జాతి భద్రత గురించి ఆయన ప్రస్తావిస్తూ సైనికులు సరిహద్దుల్లో సంక్లిష్ట పరిస్థితుల్లో సైతం విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. వారి సంక్షేమాన్ని కాంక్షించాల్సిన అవసరం ఉందన్నారు. గత 40 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (ఓఆర్‌ఓపీ) అంశాన్ని తాము పరిష్కరించినట్టు ఆయన చెప్పారు. గత ప్రభుత్వాలు 2014-15లో దీని నిమిత్తం 500 కోట్లను కేటాయించిందని, అయితే తమ ప్రభుత్వం 35 వేల కోట్లను ఇప్పటికే దీని నిమిత్తం ఇచ్చి దీని అమలులో తమ చిత్తశుద్ధిని నిరూపించుకున్నామని చెప్పారు. అలాగే మిలటరీ సర్వీస్ పే (ఎంఎస్‌పీ)ని ఎక్కువ చేస్తున్నామని, నేవీ, ఎయిర్‌ఫోర్సు, ఇతర క్లిష్టతరమైన విధులు నిర్వహించే వారికి ప్రత్యేక అలవెన్స్‌లు ఇస్తామని మంత్రి తెలిపారు.
న్యాయ మంత్రిత్వ శాఖకు
రూ.666 కోట్లు విడుదల
ఎన్నికల నిర్వహణకు అదనంగా నిధులు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: వచ్చే లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు వీలుగా న్యాయ మంత్రిత్వ శాఖకు అదనంగా రూ. 666 కోట్లను ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో కేటాయించారు. ఎన్నికల సంఘంలో పాలనాపరమైన శాఖ విధులను న్యాయ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. ఇందులో కొన్ని నిధులను హోంశాఖకు కేటాయిస్తారు. రవాణా, భద్రతాసిబ్బంది, ఇతర లాజిస్టిక్స్ ఖర్చుల కింద నిధులు కేటాయిస్తారు. ఓటర్లను చైతన్యపరిచేందుకు రూ.16.67 కోట్లు, రెవెన్యూ కింద రూ. 12.14 కోట్లు కేటాయించారు. ఈ సారి లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏపి, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ రద్దయిన నేపథ్యంలో జమ్ముకాశ్మీర్‌లో కూడా ఎన్నికలను నిర్వహిస్తారు. సిక్కిం అసెంబ్లీకి పదవీ కాల పరిమితి మే 27, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీ కాలపరిమితి జూన్ 18వ తేదీలోగా ముగుస్తాయి. 2004లో ఫిబ్రవరి 29వ తేదీన, 2009లో మార్చి 2వ తేదీన, 2014లో మార్చి 5వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన విషయం విదితమే.

ఇది సరికొత్త చరిత్ర

లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ను చరిత్రలో నిలిచిపోతుందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభివర్ణించారు. సమాజంలోని అన్నివర్గాల ప్రజలతోపాటు ఆర్థికంగా బలపడేందుకు ఈ బడ్జెట్ దోహదం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని ఆయన అన్నారు. మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చే ఎన్నో ప్రయోజనాలు ఈ బడ్జెట్‌లో రూపొందించామని, అందులో భాగంగా ఇపుడున్న ఆదాయపు పన్ను పరిమితిని పెంచి 5 లక్షల రూపాయల వరకు మినహాయింపు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా బ్యాంకు డిపాజిట్లు, అద్దెలపై వచ్చే వడ్డీపై కూడా మినహాయింపు ఇచ్చినట్టు ఆయన తెలిపారు. ‘దేశ ఆర్థిక పరిస్థితిని మరింత బలోపేతం చేయడానికి వీలుగా సరికొత్త బడ్జెట్‌ను రూపొందించాలని మా ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకుంది. ఈసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ తప్పకుండా చరిత్రాత్మకమే. ఇది ఎంతోమంది సమాజంలోని అన్నివర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుంది’ అని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంటు వెలుపల మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అభివర్ణించారు. కాగా, ప్రతిపక్షంపై సర్జికల్ స్ట్రయిక్‌గా మధ్యంతర బడ్జెట్‌ను కేంద్ర మంత్రులు రామ్ విలాస్ పాశ్వాన్, ఆర్.కే.సింగ్ అభివర్ణించారు. ఈ బడ్జెట్ రెండో సర్జికల్ స్ట్రయిక్ అని, తొలిసారి జరిగిన సర్జికల్ స్ట్రయిక్ మన సైనికులు సరిహద్దులో బుల్లెట్లతో చేసిన పోరాటమని వారు పేర్కొన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్ శర్మ ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలోని సాధారణ వ్యక్తులతోపాటు అన్నివర్గాలకు మేలు చేకూర్చే బడ్జెట్ అని అన్నారు. చాలాకాలం తర్వాత ఇలాంటి బడ్జెట్‌ను చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు.