రాష్ట్రీయం

బీజేపీది నిరంకుశ పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, ఫిబ్రవరి 19 : దేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీ, ప్రధాని నరేంద్రమోదీ నిరంకుశ పాలన, ఆంధ్రప్రదేశ్‌కు ఆ పార్టీ చేసిన మోసం గురించి ప్రజలకు తెలియచేసేందుకే కాంగ్రెస్ పార్టీ భరోసా హోదా బస్సు యాత్ర చేపడుతోందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్ చాందీ అన్నారు. అనంతపురం జిల్లా మడకశిరలో మంగళవారం బస్సుయాత్ర ప్రారంభం సందర్భంగా ఊమెన్ చాందీ, పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు, పీసీసీ ఉపాధ్యక్షులు తులసిరెడ్డి తదితరులు విలేఖరులతో మాట్లాడుతూ 2014లో ప్రధాని మన్మోహన్‌సింగ్ నేతృత్వంలో రాష్ట్ర విభజన జరిగినప్పటికీ విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పించేందుకు చట్టంలో పొందుపరిచామన్నారు. అయితే అప్పట్లో బీజేపీ ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు, పదిహేనేళ్లు కావాలని, తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని చెప్పిందన్నారు. అయితే ఆ పార్టీ కనీసం కాంగ్రెస్ ప్రకటించిన అంశాలను కూడా అమలు చేయలేకపోయిందన్నారు. దీని వల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో 20 ఏళ్లు వెనుకబడిపోయిందన్నారు. కేంద్రంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా కల్పించడంతోపాటు విభజన చట్టంలోని అంశాలను అమలు చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారన్నారు. ఇతర దేశాల్లో పర్యటించిన సందర్భాల్లో కూడా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారన్నారు. బీజేపీ పాలనలో దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని, రైతులకు తీరని నష్టం జరిగిందన్నారు. సామాన్య ప్రజలను బతకలేని స్థితికి బీజేపీ తీసుకువచ్చిందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి దెబ్బతీశారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను పాలిస్తున్న చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గత నాలుగేళ్ల పాటు ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన దాఖలాలు ఎక్కడా లేదని, అయితే ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండటంతో హోదా గురించి మాట్లాడకపోతే పుట్టగతులు ఉండవని భావించి స్వార్థ రాజకీయాల కోసం తూతూమంత్రంగా హోదా నినాదాన్ని తీసుకువచ్చి ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు. ప్రాంతీయ పార్టీలు హోదా సాధించలేవన్నారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ఇది సాధ్యమవుతుందన్నారు. తెలుగు రాష్ట్ర ప్రజల్లో ప్రత్యేక హోదా అంశం వారి మనసు నుంచి పుట్టుకు వచ్చిందని, ఇది కాంగ్రెస్‌కు కలిసివస్తుందన్నారు. కర్నాటక తరహా ఏపీలో సైతం కాంగ్రెస్ అధికారం చేపట్టడం ఖాయమన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారం చేపడితే సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు. రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ, రూ.2 లక్షల డ్వాక్రా రుణాల మాఫీ, ఏడాదికి నాలుగు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడంతోపాటు విభజన చట్టం హామీలు అమలు చేస్తామన్నారు. సమావేశంలో కనుమూరి బాపిరాజు, శైలజానాథ్, కమలమ్మ, నారాయణస్వామి, కోటా సత్యం, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. అనంతపురం జిల్లా నీలకంఠాపురంలో విలేఖరులతో మాట్లాడుతున్న ఊమెన్ చాందీ