క్రైమ్/లీగల్

సరిహద్దుల్లో మూడంచెల నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, ఫిబ్రవరి 22: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సరిహద్దుల్లో నక్సల్స్ కదలికలపై నిఘా పెంచుతూనే మద్యం, డబ్బుల రవాణాను నియంత్రించేందుకు మహారాష్ట్ర, తెలంగాణ పోలీసులు పరస్పర సహకారంతో భద్రతకు వ్యూహంతో ముందుకు సాగాలని ఇరు రాష్ట్రాల పోలీసు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ఆదిలాబాద్‌లోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అంతరాష్ట్ర సరిహద్దు పోలీసు అధికారుల సమావేశం నిర్వహించగా రానున్న పార్లమెంట్ ఎన్నికలే ఎజెండాగా పోలీసు బందోబస్తు, నిఘా, చెక్‌పోస్టుల ఏర్పాటు అంశాలపై అధికారులు చర్చించారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్ ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా సాగేందుకు పొరుగునే గల మహారాష్టల్రోని చంద్రపూర్, యావత్‌మాల్, నాందేడ్ జిల్లాల సరిహద్దు పోలీసు సిబ్బందితో పాటు ఉమ్మడి జిల్లాలకు చెందిన పోలీసు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే మూడంచెల బందోబస్తు బహుముఖ వ్యూహంతో నిఘా పెడుతున్నట్లు తెలిపారు. సరిహద్దు గుండా ఆసాంఘిక శక్తులకు తావులేకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులకు సమాచారం అందించాలని, ముఖ్యంగా ప్రాణహిత నదీ తీరంతో పాటు గోదావరి జిల్లాలకు ఆనుకొని ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేకంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి మద్యం, డబ్బుల రవాణాను నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో అధికారులు నిర్ణయించారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికలలోనూ ఇరు రాష్ట్రాల పోలీసుల సహకారం వల్లే ఎన్నికలు సజావుగా ముగిశాయని తెలిపారు. సరిహద్దు పోలీసు స్టేషన్‌లను అప్రమత్తం చేసి సుశిక్తులైన అధికారులనే అక్కడ నియమించాలని ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. రెండు నెలల పాటు నిరంతరం నిఘా పెంపొందించాలని మహారాష్ట్ర పోలీసు అధికారులు సూచించారు. సమాచార వ్యవస్థ కీలకమని, ఎన్నికల్లో ఎప్పటికప్పుడు ఇరు రాష్ట్రాలు పరస్పరం నేర చరిత్రపై, నిందితుల గురించి సమాచారం అందించాలని నిర్ణయించారు. గత ఎన్నికల్లో పరస్పర సహకారం వల్లే భారీ ఎత్తున డబ్బు, మద్యంను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, చంద్రపూర్ పరిసరాల్లో నక్సల్స్ కదలికలపై కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాలని పలువురు వివరించగా ఇందుకు నిర్ణయం తీసుకున్నారు. నిర్మల్ ఎస్పీ శశిదర్ రాజు, కుమురంభీం ఎస్పీ మల్లారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాలకు లోబడి ప్రవర్తన నియమావళి పకడ్బందీగా అమలుపరుస్తామన్నారు. నాందేడ్ ఎస్పీ నూరుల్ హసన్, గడ్‌చందూర్ డీఎస్పీ యామన్‌వాఘ్, పాండ్రకవడ డీఎస్పీ అముల్‌కోడే, వణి డీఎస్పీ లాగరే, నిర్మల్ అదనపు ఎస్పీ దక్షణమూర్తి, ఆదిలాబాద్ డీఎస్పీ నర్సింహారెడ్డి, కాగజ్‌నగర్ డీఎస్పీ సాంబయ్య పాల్గొన్నారు.