శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

సమీక్షలోనూ కుదరని సయోధ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, మార్చి 1: నెల్లూరు జిల్లా రాజకీయాలు, ఇక్కడి రాజకీయ నాయకుల విలక్షణ శైలి ఎవరికీ కొరకరాని కొయ్యని మరోసారి రుజువైంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలోనూ జిల్లా నాయకుల్లో సయోధ్య కరవైంది. అభ్యర్థుల ఎంపికలో భాగంగా నెల్లూరు, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 14 నియోజకవర్గాలకు సంబంధించి అమరావతిలో గురువారం సాయంత్రం నుండి శుక్రవారం తెల్లవారు జాము వరకూ ముఖ్యమంత్రి నాయకులతో మంతనాలు సాగించారు. జిల్లాలోని అన్ని స్థానాలకు అభ్యర్థుల ఖరారు ఒక కొలిక్కి వస్తుందని జిల్లా టీడీపీ శ్రేణులన్నీ భావించాయి. తీరా ఏడు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ముఖ్యమంత్రి ఖరారు చేశారు. కోవూరు, ఉదయగిరి, సూళ్లూరుపేట నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికను పెండింగ్‌లో ఉంచారు. దీంతో ఆయా నియోజవకవర్గాల్లో టీడీపీలో సస్పెన్స్‌కు తెరదించినట్లయింది. నాయకుల అభిప్రాయాలు తెలియచేసేందుకు తొలుత నియోజకవర్గాల వారీగా ముఖ్య నేతలతో ఎమ్మెల్యే, ఇన్‌చార్జ్‌లు, పార్టీ నిర్ణయించిన ప్రత్యేక ఇన్‌చార్జ్‌లు సమావేశమయ్యారు. కోవూరు సమీక్ష సమయంలో టీడీపీ నేత జివిఎన్ శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ సీనియర్ టీడీపీ నాయకులందరినీ పక్కనబెట్టి కొత్తవారిని అందలం ఎక్కిస్తున్నారంటూ పరోక్షంగా స్థానిక ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డిని ఉద్దేశిస్తూ చేసిన కొన్ని వ్యాఖ్యలు సమావేశంలో గందరగోళానికి దారితీశాయి. శేఖర్‌రెడ్డి వ్యాఖ్యల పట్ల ఎమ్మెల్యేతోపాటు ఆయన అనుచరులు కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో మరో నేత పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి పైకి లేచి శేఖర్‌రెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తూ మాట్లాడారు. దీంతో ఒకరిపై ఒకరు అరుపులు, కేకలతో సమావేశంలో గందరగోళ వాతావరణం నెలకొంది. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ ఇరు వర్గాలకు సర్దుబాటు చేస్తూ కేవలం గెలుపుకు తీసుకోవాల్సిన అంశాలపై మాట్లాడదామని చెప్పడంతో పరిస్థితి సద్దుమణింది.
పోలంరెడ్డి తీరుపై ముఖ్యమంత్రి అసహనం
కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తీరుపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. తొలుత అన్ని నియోజకవర్గాలతో కలిసి ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ జిల్లాలో 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుండి వచ్చిన ఒక వ్యక్తికి తాను టీడీపీలో అవకాశం కల్పిస్తే గెలిచిన సదరు ఎమ్మెల్యే టీడీపీ కార్యకర్తలను వివక్షకు గురిచేస్తూ తన వారిని ప్రోత్సహిస్తున్నారని, ఈ పద్ధతి మానుకోవాలంటూ పరోక్షంగా పోలంరెడ్డిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. తెల్లవారుజామున కోవూరు అభ్యర్థి ఎంపికకు సంబంధించి పోలంరెడ్డి ముఖ్యమంత్రిని కలిసిన సమయంలోనూ ముఖ్యమంత్రి ఆయనపై అసహనం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీ కార్యకర్తలను పట్టించుకోకుండా తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని, అందుకనే కోవూరు ఎంపికను తాను వాయిదా వేస్తున్నట్లు పోలంరెడ్డికి స్పష్టం చేసినట్లు తెలిసింది. అప్పటివరకూ తానే అభ్యర్థినంటూ ప్రచారం చేసుకోవద్దని కూడా ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. నియోజకవర్గ టీడీపీ నేతలతో మరోసారి సమావేశం నిర్వహించి కోవూరు విషయంలో ముఖ్యమంత్రి స్పష్టతనిచ్చే అవకాశాలున్నాయని టీడీపీ శ్రేణుల ద్వారా తెలుస్తోంది. ఉదయగిరి విషయంలోనూ స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పలువురు చేసిన ఫిర్యాదులతోపాటు సర్వేల్లో వెల్లడైన వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాన్ని ముఖ్యమంత్రి వాయిదా వేసినట్లు సమాచారం. సూళ్లూరుపేట నుండి పరసా రత్నం పేరు దాదాపు ఖరారైనప్పటికీ తిరుపతి ఎంపీ అభ్యర్థిత్వం ఖరారుకు సూళ్లూరుపేటకు ముడిపెట్టి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికను వాయిదా వేశారు. ముఖ్యమంత్రి ఖరారు చేసిన ఏడు స్థానాల్లో ప్రచారానికి అభ్యర్థులు సిద్ధమవుతుండగా, మూడు స్థానాల్లో మాత్రం ఉత్కంఠ కొనసాగనుంది.

గూడూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే పాశం
* అధికారికంగా ప్రకటించిన చంద్రబాబు
* సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన పాశం
* గ్రామాల్లో అభిమానుల కోలాహలం, బాణసంచా కాల్చడం
గూడూరు, మార్చి 1: గూడూరు ఎస్సీ నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. దీంతో గూడూరు నియోజకవర్గంలో ఉత్కంఠతకి తెరతీసినట్లయింది. ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ అభిమానులు గ్రామాల్లో సందడి చేస్తూ కోలాహలంగా బాణాసంచా పేల్చుతున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడికి ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. గూడూరు నియోజకవర్గ శాసనసభ ఎస్సీ స్థానం జనరల్ స్థానాన్ని తలపిస్తుంది. వైసీపీ, టీడీపీ అభ్యర్థులు ఎవరు అనే విషయంలో రెండు పార్టీలు అధిష్టానం ప్రకటించడంలో ఆలస్యం చేయడంతో చాలా ఊహాగానాలు తలెత్తాయి. గురువారం అమరావతిలో జరిగిన టీడీపీ రివ్యూ సమావేశంలో గూడూరు టీడీపీ అభ్యర్థిగా పాశం సునీల్‌కుమార్ పేరు వచ్చినా పార్టీ అధిష్టానం నిన్న ప్రకటించడకపోవడంతో మళ్లీ రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఈ పరిస్థితుల్లో నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు పాశం సునీల్‌కుమార్ పేరును అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. దీంతో గూడూరు నియోజకవర్గంలో టీడీపీలో ఉత్కంఠతకు తెరతెగింది. దీంతో ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ అభిమానులు గ్రామాల్లో భారీగా బాణాసంచా పేల్చి సంబరాల్లో మునుగుతున్నారు.

బయటపడని ఆత్మహత్యకు గల కారణాలు
వెంకటాచలం, మార్చి 1 : రైలు కిందపడి ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వెంకటాచలం మండలం కంటేపల్లి రైల్వే గేటు సమీపంలో ఎఫ్‌సీఐ గోదాముల వెనుక గూడూరు - నెల్లూరు రైలు మార్గంలో 159-12 వద్ద రైల్వే ట్రాక్ పై శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. మండలంలోని తిక్కవరప్పాడు గ్రామ పంచాయితి పరిధిలోని గొట్లపాళెం గ్రామానికి చెందిన గుమ్మడి చెంచయ్య కుమారుడు వెంకటేశ్వర్లు, కసుమూరు గ్రామానికి చెందిన దొడ్డక ఈశ్వరయ్య కుమారై కామాక్షి ఆత్మహత్యకు గల కారణాలు ఎంటనేది ఇరువర్గాల కుటుంబ సభ్యులు చెప్పలేకున్నారు. గురువారం ఇంటి వద్ద నుంచి నెల్లూరుకు వెళ్తున్నానని చెప్పిన వెంకటేశ్వర్లు గురువారం సాయంత్రం కామాక్షితో కలిసి తిరిగాడనే విషయం స్పష్టమవుతుంది. గురువారం రాత్రి వరకు కామాక్షి ఇంటికి చేరకపోవటంతో బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. శుక్రవారం ఉదయం వెంకటాచలం పోలిసులకు దొడ్డక కామాక్షి కనిపించటంలేదని ఫిర్యాదు చేశారు. నెల్లూరు రూరల్ సీఐ శ్రీనివాస రావు, వెంకటాచలం ఎస్‌ఐ శివకృష్ణారెడ్డిలు విచారిస్తుండగా కంటేపల్లి రైల్వే గేటు సమీపంలో రైల్వే ట్రాక్ పై రెండు మృతదేహలు పడి ఉన్నాయని తెలియడంతో అంతా అక్కడకు చేరుకుని పరిశీలించారు. అయితే తన సమీప బంధువైన దొడ్డక కామాక్షితో పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఈవిషయం బయటపడితే సమస్యలు వస్తాయనే భయంతోనే ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో రాజకీయం అంటే ఏమిటో చూపిస్తా
* ఎమ్మెల్యే కాకాణిపై మంత్రి సోమిరెడ్డి ధ్వజం
ముత్తుకూరు, ఫిబ్రవరి 1: రాజకీయంగా నా 32 ఏళ్ల చరిత్రలో ఎక్కడా నేను అవినీతికి పాల్పడలేదని, ఎన్నికల్లో గెలిచినా ఓడినా ప్రజా సమస్యలపైనే పనిచేస్తున్నానని నాతో పాటు నా కుటుంబ సభ్యులపై కూడా అవినీతి ఆరోపణలు చేస్తావా? వచ్చే ఎన్నికల్లో రాజకీయం అంటే ఏమిటో నీకు చూపిస్తానంటూ సర్వేపల్లి నియోజక వర్గం ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం రాత్రి మంత్రి సోమిరెడ్డి కృష్ణపట్నం గ్రామానికి విచ్చేసారు. స్థానిక నాయకులు మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు హారతులు ఇచ్చి బ్రహ్మరథం పట్టారు. ఊరు చివర మైదానంలో ప్రపంచ బ్యాంకు నిధులు రెండు కోట్ల 29 లక్షలతో నిర్మించిన బహుళళ ప్రయోజన తుఫాన్ రక్షిత భవనాన్ని మంత్రి ప్రారంభించారు. అలాగే కర్నాలవీధి బీసీ కాలనీలో పది లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సిమెంటు రోడ్డు నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక బస్టాండు సెంటరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. మత్స్యకారేతర ప్యాకేజీకి సంబంధించి ప్రస్తుతానికి 348 మందికి చెక్కులను అధికారులు సిద్ధం చేసారని, ఎన్నికల కోడ్ సమీపిస్తుండటంతో త్వరితగతిన అధికారులు పై చెక్కులను సిద్ధం చేయడం హర్షనీయమన్నారు. మత్స్యకారేతర ప్యాకేజీ చెక్కులను మంత్రి చేతుల మీదుగా గ్రామస్తులకు అందజేశారు. మిగిలిన 10,500 కుటుంబాలకు అధికారులు నేటి నుంచి చెక్కులను సిద్ధం చేస్తారని మంత్రి తెలిపారు. అంతకుముందు మంత్రి మాట్లాడుతూ రాజకీయంగా తనను దెబ్బ తీసేందుకు తనపై ఎమ్మెల్యే కాకాణి అవినీతి ఆరోపణలు చేస్తున్నాడని ఈ నేపథ్యంలో పోలీసుస్టేషన్‌కు వెళ్లి ప్రతి రోజు సంతకం పెట్టి వచ్చే స్థాయికి దిగజారావని కాకాణిపై మంత్రి విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో రాజకీయం అంటే ఏమిటో చూపిస్తా అంటూ మంత్రి అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు వైకాపా నుంచి కాపీ కొడుతున్నారని ఎమ్మెల్యే ప్రచారం చేస్తున్నాడని, మీ వైకాపా పథకాలను నేను కాపీ కొడితే నీలాగా, మీ నాయకుడిలాగా స్టేషన్‌కు వెళ్లి సంతకాలు పెడుతూ జైల్లో కూర్చొనే పరిస్థితి వస్తుందని ఆ స్థాయి మాకు వద్దంటూ మంత్రి హేళన చేశారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నా ప్రజా సంక్షేమం కోసం సీఎం చంద్రబాబునాయుడు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని మంత్రి అన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఓట్లు వేసి గెలిపించాలని మంత్రి కోరారు. అనంతరం కృష్ణపట్నం బకింగ్ హామ్ కెనాల్ అవతల ఆక్వా రైతులకు సంబంధించి నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ లైన్, ట్రాన్స్‌ఫార్మర్ మోటార్‌ను స్విచ్చ్ వేసి మంత్రి ప్రారంభించారు. రైతుల సంక్షేమం కోసం ప్రత్యేకించి కరెంటు లైన్ ఏర్పాటు చేసారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఈదూరు రామ్మోహన్‌రెడ్డి, దువ్వూరు విశ్వమోహన్‌రెడ్డి, రాగాల కోదండయ్య, మోచర్ల మొలకమ్మ తదితరులు పాల్గొన్నారు.

మత్స్యకేతర ప్యాకేజీ చెక్కులను పంపిణీ చేస్తున్న మంత్రి సోమిరెడ్డి
అభినందన్ తెగువ అభినందనీయం : మంత్రి సోమిరెడ్డి
నెల్లూరు, మార్చి 1: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ పోరాటపటిమ తెగుమ స్పూర్తిదాయకమైనదని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అభినందించారు. శత్రుదేశ విమానాలను తరిమికొడుతూ ఆ దేశంలో ప్రవేశించినప్పటికీ భారతదేశానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు శత్రువులకు లభించకుండా నాసనం చేసిన అభినందన్ దేశభక్తికి హాట్సాప్ అన్నారు. శత్రు సైనికుల అదుపులో ఉన్నప్పటికీ గుండె నిబ్బరాన్ని ఎక్కడా కోల్పోని అభినందన్ ధైర్యం అందరికీ ఆదర్శప్రాయమని శుక్రవారం ఒక ప్రకటనలో మంత్రి అభినందించారు.

పెంచలకోన పాలక వర్గం ప్రమాణ స్వీకారం
రాపూరు, మార్చి 1: పెంచలకోన నరసింహస్వామి దేవస్థానం పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం శుక్రవారం ప్రశాంతంగా నిరాడంబరంగా జరిగింది. ఈ సందర్భంగా ట్రస్టు బోర్డు చైర్మన్‌గా నియోజకవర్గకేంద్రమైన వెంకటగిరి పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రాష్ట్ర గిడ్డంగుల డైరెక్టర్ గంగోడి నాగేశ్వరరావు చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యులుగా కలువాయి మండలం దాచూరుకు చెందిన పీర్ల సోమయ్య రాపూరు మండలం గోనుపల్లికి చెందిన నూతలపాటి దామోదర్ నాయుడు, కలువాయి మండలం చింతలాత్మకూరుకు చెందిన కుంచి నాగరాజును అలాగే రాపూరు మండలం సంక్రాంతిపల్లికి చెందిన వంచివేలు కోటేశ్వరరెడ్డి, తిరుపతికి చెందిన సుగుణ, డక్కిలి మండలానికి చెందిన పాయశం రత్నమ్మ, పొదలకూరు మండలం మరుపూరుకు చెందిన కలివేటి ప్రభాకర్‌రెడ్డి, కడప జిల్లా చక్రంపేటకు చెందిన రాచకొండ జగదీష్, వెంకటగిరికి చెందిన ఆవుల భగీరద్‌లు ప్రమాణస్వీకారం చేశారు. అలాగే ఎక్స్‌గ్రేషియా సభ్యులుగా దేవస్థానం ప్రధాన అర్చకులు బిల్లు సీతారామయ్య బాద్యతలు చేపట్టారు. దేవస్థానం ఆలయ సహాయ కమిషనర్ వెంకటసుబ్బయ్య ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ట్రస్టుబోర్డు చైర్మన్ నాగేశ్వరరావు మాట్లాడుతూ తనపై ఎంతో బాధ్యతతో దైవసేవ చేసే అవకాశాన్ని కల్పించిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అటు భక్తులకు ఎల్లవేలలా అందుబాటులో ఉంటూ ఆలయ అభివృద్ధికి తనదైన శైలిలో అభివృద్ధివైపు పరుగులు పెట్టిస్తానన్నారు.

ఎయిడెడ్ కళాశాలలకు ఆదర్శంగా వీఆర్‌సీ
రాజకీయాలకు అతీతంగా పూర్వ వైభవాన్ని తీసుకొస్తాం
నెల్లూరు టౌన్, మార్చి 1: రాష్ట్రంలో ఉన్న అన్ని ఎయిడెడ్ కళాశాలలకు ఆదర్శంగా నిలిచేలా వీఆర్ కళాశాలను తీర్చిదిద్దుతామని వీఆర్‌సీ అల్మిని అండ్ వీఆర్‌సీ విద్యా సంస్ధల పరిరక్షణ, అభివృద్ధి కమిటీ ప్యానల్‌లోని సభ్యుడైన గునపాటి తులసీరాంరెడ్డి అన్నారు. శుక్రవారం నగరంలోని ఐఎం హాలు సమీపంలో ఉన్న స్మార్ట్ లైఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో గునపాటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే అతిపెద్ద 2వ ఎయిడెడ్ విద్యా సంస్థ ఈ వీఆర్ కళాశాలన్నారు. దానికి పూర్వ వైభవాన్ని తీసుకురావాలనే ఉద్ధేశ్యంతో వీఆర్‌సీ పూర్వ విద్యార్థులైన తాము ఓ ప్యానల్‌ను ఏర్పాటుచేసి జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిర్ణయించామన్నారు. తమ ప్యానల్‌లో రాజకీయ నాయకులు, లాయర్లు, కార్పొరేటర్లు, సామాజిక వేత్తలు, వైద్యులు ఉన్నారని వారి ప్రజా సంబంధాల ద్వారా కార్పొరేటు కళాశాలలకు ధీటుగా వీఆర్‌సీని అన్ని హంగులతో గత వైభవాన్ని తిరిగి తెస్తామన్నారు. కుల, మత భేదాలు లేకుండా, రాజకీయాలకు అతీతంగా పనిచేస్తూ పూర్వవైభవాన్ని తీసుకొచ్చి పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తామని చెప్పారు. కొంతమంది కుటుంబ కబంధహస్తాల్లో చిక్కుకుని ఉన్న ఈ సంస్ధ ఆస్తులు ఇప్పటికే అన్యాక్రాంతం అయి, చాలావరకు నిర్వీర్యం అయిపోయిందన్నారు. దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత పూర్వ విద్యార్థులపై ఉందన్నారు. గతంలో ఉన్న 12 వేల మంది విద్యార్థులు ఉండేవారని ప్రస్తుతం ఆ సంఖ్య 280కి చేరిందన్నారు. మళ్లీ ఆ సంఖ్యకు చేరేలా తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. అన్యాక్రాంతం అయిన ఆస్తులను తిరిగి రాబట్టేలా చర్యలు చేపడతామన్నారు. 16,300 మంది ఓటర్లు ఉన్నారన్నారు. 84 మంది ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్‌లు దాఖలాలు చేశారన్నారు. అందులో ఉన్న తమ ప్యానల్‌ను పూర్వ విద్యార్థులందరూ గెలిపించి, తమ ప్యానల్‌కు ఒక అవకాశం కల్పిస్తే ఆ కళాశాలను రాష్ట్రంలో ఉన్న ఎయిడెడ్ కళాశాలలే కాక కార్పొరేటు కళాశాలలకి కూడా ఆదర్శంగా నిలిచేలా చేస్తామని వారు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ సంగీత అకాడమీని వీఆర్ సంస్థల్లోకి విలీనం చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని తమ దృష్టికి వచ్చిందని దాని వల్ల వీఆర్ విద్యా సంస్థల ప్రాముఖ్యత కోల్పోతుందని, దానిని విలీనం చేయకూడదని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. దీనిపై మార్చి 3న కలెక్టర్‌కి వినతి పత్రం ఇవ్వనున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఆ ప్యానల్ సభ్యులు పిట్టి సత్యనాగేశ్వరరావు, కె అజయ్‌కుమార్, మల్లిరెడ్డి కోటారెడ్డి, డాక్టర్ శ్రీనివాస్‌తేజ, డాక్టర్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

రైతు సంక్షేమమే జగన్ ధ్యేయం
సంగం,మార్చి 1: రాబోయే ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి రాగానే రైతు సంక్షేమమే ధ్యేయంగా జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తారని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి స్పష్టం చేశారు. సంగం మండలం వెంగారెడ్డిపాళెం గ్రామంలో శుక్రవారం ఆయన పర్యటించారు. ఆయనకు నాయకులు, యువకులు ఘనంగా స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా ప్రజలతో మాట్లాడి వైసీపీని ఆదరించాలని కోరారు. దివంగత రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. యువకులకు క్రికెట్, వాలీబాల్ కిట్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతుందని విమర్శించారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో రాష్ట్రంలో వర్షాలు పడక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. రాబోయే ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం రావడం ఖాయమని వర్షాలు పడి రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని పేర్కొన్నారు. అనంతరం పలువురు నేతలను మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. కావలి కాలువ కింద పండించే రైతులు సాగునీటి సమస్యపై ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించి సమస్యలను విన్నవించారు. అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ రఘునాధరెడ్డి, బాలక్రిష్ణారెడ్డి, చంద్రారెడ్డి, ఫణీంద్రరెడ్డి, వాసుదేవరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, జహంగీర్, కరీముల్లా, చెంచురామిరెడ్డి, శివకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నగర వ్యాప్తంగా రోడ్ల నిర్మాణాలన్ని నెల రోజుల్లోపూర్తి
రూ.184 కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం
స్థాయి సంఘం సమావేశంలో మేయర్
నెల్లూరుసిటీ, మార్చి 1: నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూగర్భ పనులతో సహా, నూతన రోడ్ల మరమ్మత్తు పనులతో సహా, నూతన రోడ్ల నిర్మాణాలన్ని ప్రణాళిక బద్దంగా నెల రోజుల్లో పూర్తి చేసి సుందర నెల్లూరును ప్రజలకు అందిస్తామని నగర మేయర్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. కార్పొరేషన్ కార్యాలయంలో స్థాయి సంఘ సమావేశాన్ని మేయర్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతిపాదించిన 108 అంశాలను మేయర్ ఆధ్వర్యంలో సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా 9 కమ్యూనిటీ భవనాల నిర్మాణం, రజకులకు అదనంగా మరో ఆధునీక దోబీఘాట్, అదనంగా 150 మంది తాత్కాలిక పారిశుద్ధ్య కార్మికుల నియామకం, నూతనంగా రోడ్లు , డ్రైయిన్ల నిర్మాణం, పార్కుల అభివృద్ధి మునిసిపల్ స్కూళ్ల ఆధునీకరణ తదితర అభివృద్ధి పనులకు 184 కోట్ల నిధులను కేటాయించామని చెప్పారు. నగర వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పనులకు కార్పొరేషన్ సాధారణ నిధులతో పాటు ఎస్సీ సబ్‌ప్లాన్, 14వ ఆర్థిక సంఘం, హడ్కో, సిప్ నిధులను మంజూరు చేసి వేగవంతంగా పనులు జరిగేలా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. నగర ప్రజల సౌకర్యార్థం మటన్ మార్కెట్, సంతపేట మార్కెట్, పాత వస్త్రాల విక్రయ భవనం, నూతన షాదిమంజిల్ నిర్మాణం, నూతనంగా 6 ఏసీ బస్ షెల్టర్ల నిర్మాణాలను ప్రతిష్టాత్మకంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. మహిళల కోసం కంప్యూటర్ ఆధారిత వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలు, టైలరింగ్ ఆసక్తి ఉన్న మహిళల కోసం ప్రత్యేక కేంద్రాల ద్వారా శిక్షణ, కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ స్ర్తిలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. అదే విధంగా రహదారి మార్గం ద్వారా నెల్లూరు నగరంలోనికి ప్రవేశించే 3 ప్రాంతాలల్లో ఆకర్షణీయమైన ముఖద్వారాల నిర్మాణం, పాండురంగ అన్నదాన సమాజం ఆధ్వర్యంలో బోడిగాడి తోటలో పార్థివ శరీర వసతి గృహ నిర్మాణం, అన్ని మతాలకు చెందిన స్మశాన వాటికల అభివృద్ధి పనులకు నిధులను కేటాయించి సుందరీకరణతో ఆధ్యాత్మిక చింతన కలిగేలా వాటిని రూపుదిద్దుతామని వివరించారు. ఈ సమావేశంలో కమిషనర్ అలీంబాషా, స్థాయి సంఘం సభ్యులు పిట్టి సత్యనాగేశ్వరరావు, ప్రశాంత్‌కుమార్, భువనేశ్వర ప్రసాద్, మధు, ఎస్‌ఇ రవికృషం రాజు తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికలు నిష్పక్షపాతంగా జరపండి
జిల్లా కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు హెచ్చరికలు
గూడూరు, ఫిబ్రవరి 1: జిల్లాలో ఎన్నికలను నిష్పక్షపాతంగా జరపడానికి అధికారులందరూ కచ్చితంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు హెచ్చరికలు జారీచేశారు. శుక్రవారం గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో బూత్ స్థాయి అధికారులు, రెవెన్యూ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల పరిధిలో వాస్తవంగా నివాసం ఉంటున్న వారి పేర్లు ఓటర్ల జాబితాలో తొలగింపు జరగకుండా సిబ్బంది పనిచేయాలన్నారు. పోలింగ్ కేంద్రం పరిధిలో ఎన్నికల నిబంధనల ప్రకారం కచ్చితంగా పనిచేయాలని ఆయన సూచించారు. బిఎల్‌ఓలు, ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో కచ్చితంగా పనిచేయాలన్నారు. 2014 ఎన్నికల సమయంలో ఉన్న ఓటర్లు, 2019 ఓటర్ల జాబితాలో అందరూ ఉన్నారా లేరా లేదా ఎవరైనా తొలగించారా? ఎందుకు తొలగించారు అనే అంశంపై చర్యలు తీసుకోవాలన్నారు. 4,5,6 పోలింగ్ కేంద్రాల బిఎల్‌ఓలు నిశాంతి, మస్తానయ్య, సుబ్బరామయ్యలు సక్రమంగా పనిచేశారని అభినందించారు. వారిలాగానే మిగతా బిఎల్‌ఓలు రెవెన్యూ సిబ్బంది సక్రమంగా పనిచేసి ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో గూడూరు సబ్ కలెక్టర్ ఓ ఆనంద్, సిడిపిఓ ఉమామహేశ్వరి, తహశీల్దార్ సుధారాణి ఇతర అధికారులు, బిఎల్‌ఓలు పాల్గొన్నారు.