మెయిన్ ఫీచర్

అవనికే ఆదర్శం అతివ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళ..
మానవతామూర్తి..
మహోన్నత భావాలు కలగలసిన వ్యక్తి..
కుటుంబ వ్యవస్థకి మూలాధారమైన శక్తి..
కడుపు నింపే తల్లిగా, బాధ్యతను పంచుకునే అక్కగా.. ప్రేమను పంచుకునే చెల్లిగా, మనసుకు నచ్చిన ప్రియురాలుగా, మమతలను పంచే అనురాగవల్లిగా.. ఇలా ఆమె సేవలు ఋణం తీర్చుకోలేనివి. అందుకే పురాతన కాలం నుంచి నేటివరకు మన సమాజంలో మహిళలకు ప్రత్యేక స్థానం కల్పించారు. వారిని దేవతలా భావించి పూజిస్తున్నారు. ఇక్కడ పుట్టిన నదీనదాలను, చెట్లను కూడా తల్లిలాగానే గౌరవిస్తున్నాం. మన దేశాన్ని కూడా భారతమాత అని తల్లిలా గౌరవించి భావించి పూజిస్తున్నాం. మన పురాతన సంప్రదాయంలో మహిళను మాతృమూర్తిగా గౌరవించాం. కానీ నేడు స్ర్తిని కేవలం ఒక భోగ వస్తువుగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఎపుడైతే ప్రతి మహిళను తల్లిగా చూసి, ఆమెకు సమాజంలో పరిపూర్ణ గౌరవాన్ని కల్పించే రోజు వస్తుందో అప్పుడే సంపూర్ణ మహిళా సాధికారత సాధించినట్లు లెక్క. ఈ మార్పు రానంతవరకు దేశం సంపూర్ణ అభివృద్ధి సాధించలేదనేది అక్షరసత్యం. ఆకాశంలో సగంగా వున్న మహిళలు సగర్వంగా తలెత్తి ఆశాభావంతో తమ భవిష్యత్తు మరింత దేదీప్యమానమవ్వాలని హృదయపూర్వకంగా జాతి, మత, కుల, ఆర్థిక, సామాజిక వ్యత్యాసాల్ని మరచి ఒకే వేదికపైకి చేరే రోజు మహిళా దినోత్సవం.
పూర్వకాలంలో స్ర్తిలు వంటగదికే పరిమితమయ్యేవారు. బాల్యవివాహాలు, సతీ సహగమనం వంటి ఆచారాలతో మహిళలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. గాంధీజీ, రాజారామోహన్‌రాయ్, అంబేద్కర్, సావిత్రి భాయి పూలే మొదలగు మహానుభావులు స్ర్తి అభ్యున్నతికి పాటుపడ్డారు. కాని స్ర్తిలు ఇంత అభివృద్ధి, ప్రగతి సాధించినప్పటికీ వారికి గౌరవం లభిస్తుందా, స్ర్తిలకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందా? వారి కలలు సాకారం అవుతున్నాయా? అంటే ఇవన్నీ ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. ఇవన్నీ ఇలావుంటే స్ర్తిలపై అఘాయిత్యాల పరంపర రోజురోజుకీ పేట్రేగిపోతున్నాయి. అయినప్పటికీ మార్చి 8 వస్తుందంటే మహిళలకు పండగే.. ఎందుకంటే మహిళా దినోత్సవ సంబరం వారి ముంగిట పలుకరిస్తుంది. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో పోటీపడి కుటుంబ, ఆర్థిక భారాలను ఒకవైపు చూసుకుంటూనే, ఉన్నత శిఖరాలను చేరుకుని పురుష శక్తికీ తామేమీ తీసిపోమని చాటిచెపుతోంది. మేము ఇంటికే పరిమితం కాదంటూ పురుషులకు ధీటుగా విజయాలు సాధిస్తున్నారు.
ఏ సందర్భంలో పురుడు పోసుకున్నదైనా.. 1975 మార్చి 8న స్థిరపడింది అంతర్జాతీయ మహిళా దినోత్సవం! తాము సగభాగం వున్న సమాజంలో సమాన హక్కులకోసం.. సమాన అవకాశాలకోసం.. సమ సమాజం కోసం.. ఒక లక్ష్యం కోసం పోరాటం! ఆకాంక్ష ఏండ్లనాటిదేనైనా.. మార్చి 8 ఒక మజిలీ! స్థారుూ సామర్థ్యాలను అంచనా వేసుకుని..్భవి భవిష్యత్తుకు బాటలు తీసే సందర్భం! శతాబ్దాల సంకెళ్లను ఒక్కొక్కటిగా తెంచుకుంటూ ముందుకు సాగుతున్నా.. ఇంకా అనేక అమానుషాలు.. అవమానాలు! ఇంటినుంచి మొదలుకుని.. గగనతలాన్ని సైతం శాసించే స్థాయికి మహిళ ఎదుగుతున్నా.. ఇంకా అవే అన్యాయాలు! భారతదేశమూ మినహాయింపు కాదు. ఈనాటికి రోడ్లపై నిర్భయంగా తిరిగే పరిస్థితి ఇంకా ఎండమావే! భద్రమనుకునే ఇండ్లలోనూ అదే హింస! అయినా సహనానికి మారుపేరు.. తన బతుకు మారే రోజుకోసం ఓపికగా ఎదురుచూస్తున్నది. ఆటంకాలెన్ని ఎదురైనా.. తలవంచక.. పురుషాధిక్య సమాజానికి సవాలు విసురుతున్నది! అనేక విజయాలూ తన సిగలో దోపుకుంటూనే వున్నది!
ఈ రోజు సాధికారిత.. సమానత్వం దిశగా అడుగులు వేసే మహిళల గురించే ప్రస్తావించే సందర్భం. నేటికీ మేటి విలువలతో రాణిస్తున్న మహిళామణులు ఎందరో.. ఇందులో భారతీయ మహిళ కూడా తనకంటూ గుర్తింపు కోసం అహర్నిశలూ కృషి చేస్తూనే వుంది. విభిన్న రంగాల్లో భారతీయ మహిళలు మేలైన విజయాలనే సొంతం చేసుకున్నారు. వారి స్ఫూర్తి రేపటి ఆశతో ముందడుగు వేసే నేటి మహిళకి ఆదర్శం. వివక్ష, అసమానతల్లాంటివి వెనక్కి లాగుతున్నా తన జీవన పరిధిని విశాలం చేసుకుంటూ ఉన్నతంగా ఎదుగుతోంది. అడుగులు తడబడుతున్నా తరుణి పట్టుదలగా ముందుకు సాగిపోతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే అతివలు సాధిస్తున్న అనితర విజయాలు మరెందరికో వెలుగుబాటలవుతున్నాయి. దేశ విదేశాలలో బయట ప్రపంచంలో విభిన్న రంగాలలో దూసుకుపోతున్నా.. గృహిణిగా తన బాధ్యతలను నిర్వర్తించే ప్రతి తల్లి కూడా నిత్య జీవిత విజేతే.. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథిదేవోభవ అని స్ర్తిని ఉపనిషత్తులో అందరికంటే అగ్రపూజ అందవలసిన మాతృమూర్తిగా అభివర్ణించారు. స్ర్తి అను పదములో ‘స’కార, ‘త’కార, ‘ర’కారములున్నాయి. ‘స’కారము సత్వగుణానికి, ‘త’కారము తమోగుణానికి, ‘ర’కారము రజోగుణానికి ప్రతీకలు. అంటే త్రిగుణాత్మకమైన ప్రకృతికి ప్రతీకగా స్ర్తిని పేర్కొనవచ్చు.
ఎక్కడైతే స్ర్తిలు పూజింపబడతారో అక్కడ ఉత్తమ సంతానం కలుగుతుంది. స్ర్తికి కలిగే ఉత్తమ సంతానంవలననే ఉత్తమ సమాజం ఏర్పడుతుంది. ఏ దేశంలో అయితే మహిళలు సర్వాంగ సుందరంగా ఆభరణాలతో అలంకరిం
చుకుని పురుషుని
సహాయం, తోడు లేకుండా రహదారులలో, వీధులలో ధైర్యంగా ఏ భయభ్రాంతులు లేకుండా తిరగగలదో ఆ దేశం సుపరిపాలన కలది అని పంచమ వేదమైన మహాభారతం చెప్పింది. వేదకాలం నుండి స్ర్తిని అత్యధికంగా గౌరవిస్తూనే స్ర్తి రక్షణ కొరకు అనుక్షణం ఆరాటపడుతూనే ఉంది. యావత్ సమాజంలో నేటికీ కొనసాగుతూనే ఉంది. గాంధీ మహాత్ముడు కూడా ఆడవారు ఒంటరిగా, ధైర్యంగా అర్థరాత్రి తిరగగలిగితేనే నిజమైన స్వాతంత్య్రం అని చెప్పాడు. తాను మరణయాతన పొంది మరో జన్మనెత్తి జాతి మొత్తాన్ని కని, పాలిచ్చి, పెంచి సకల సేవలనందిస్తూ, సృష్టిని సుస్థిరం చేస్తున్న మహోన్నత త్యాగమూర్తి స్ర్తి. ఈ సృష్టిలోని స్ర్తిని కేవలం మామూలు స్ర్తిగా భావించక ఒక పురుషుడి విజయం, కుటుంబ విజయం, వెనుక స్ర్తి సహకారం లేనిదే పురుషుడికి మనుగడే లేదు, జీవితమే లేదు అన్న సత్యాన్ని గ్రహించి అంతటి మహోన్నతమైన స్ర్తిమూర్తిని గౌరవిద్దాం. యత్ర నార్యస్తు పూజ్యంతే -రమంతే తత్ర దేవతా- ఎక్కడైతే స్ర్తిలను గౌరవిస్తారో అక్కడ దేవతలు కొలువుదీరి ఉంటారు. అలాంటి మహిళాశక్తిని లోకమంతటికీ చాటేలా వారికోసం ఒక రోజునే కేటాయించారు. అదే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రపంచ వ్యాప్తంగా వున్న మగువలంతా ప్రతి సంవత్సరం ముచ్చటపడి జరుపుకునే రోజు అది. కేవలం ఈ ఒక్క రోజు మాత్రమే కాదు వారం రోజుల ముందునుంచే మహిళా దినోత్సవ ఉత్సవాలు జరుగుతాయి.
అసలేంటీ మహిళా దినోత్సవం? ఏదైనా ఉత్సవమో, పండుగో, ప్రత్యేక సందర్భమో జరుపుకోవడానికి ఒక నేపథ్యం అంటూ ఉంటుంది. అలాగే మహిళా దినోత్సవం జరుపుకోవడానికి కూడా ప్రత్యేక నేపథ్యం ఉంది. ఇపుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మొదట అంతర్జాతీయ శ్రామిక దినోత్సవంగా పిలిచేవారు. ఫిబ్రవరి 28, 1909న మొట్టమొదటి మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఆ తర్వాత సంవత్సరం అంటే 1910 ఆగస్టులో అంతర్జాతీయ సామ్యవాద సమావేశానికి ముందు అంతర్జాతీయ మహిళా సమావేశం డెన్మార్క్ నగరంలో కోపెన్‌హాగెన్‌లో జరిగింది. ఈ సమావేశంలో ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాలని తీర్మానించారు. మహిళలు పురుషులతో సమానంగా ఓటు హక్కుతోపాటు సామాజిక సమానతను సాధించడానికి ఇదే మంచి అవకాశమని వారు భావించారు. ఆ తర్వాత సంవత్సరం 1911, మార్చి 19న ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్ తదితర దేశాలలో మొదటిసారిగా మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. తర్వాత 1913లో జరిగిన చర్చల ఫలితంగా 1914 నుంచి మార్చి 8న దీన్ని జరుపుకోవడం ప్రారంభించారు.
మహిళా దినోత్సవం రోజున కొన్ని దేశాలలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాలయాలు వంటి వాటిల్లో అధికారిక సెలవుదినంగా ప్రకటిస్తారు. దీంతోపాటు ఈ రోజున ప్రజలంతా ఊదారంగు రిబ్బన్లు ధరించడం కూడా సంప్రదాయంగా వస్తోంది. ఎందుకు ఆ రంగే అంటే.. మహిళల సమానత్వానికి, హుందాతనానికి ఊదారంగును గుర్తుగా భావిస్తారు. అలాగే ఈ రోజున మహిళలకు ప్రత్యేకమైన కానుకలను ఇచ్చి, వారికి శుభాకాంక్షలు తెలిపి వారిపట్ల తమ అనుబంధాన్ని, కృతజ్ఞతను చాటుకుంటారు.
రాజ్యాంగంలో మహిళలకోసం
భారత రాజ్యాంగంలో పురుషులతో పాటు మహిళలకూ సమాన హక్కులు పొందుపరిచి ఉన్నాయి. మహిళల కోసం కొన్ని ప్రత్యేక చట్టాలనూ ఆమోదించింది. కొన్ని సవరణలు కూడా అయ్యాయి. నేడు ఎంతోమంది మహిళలు విద్యావంతులు అవుతున్నా, వారి కాళ్లమీద వారు నిలబడుతున్నా, ఎక్కడో ఒకచోట వివక్ష ఎదురవుతూనే వుంది. చట్టాలపై అవగాహనా లేమి కూడా ఇందుకు కొంత కారణం.
జాతీయ మహిళా కమిషన్, నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ గర్ల్ చైల్డ్, నేషనల్ పాలసీ ఫర్ ఎంపవరింగ్ విమెన్ లాంటివే కాక మహిళలపై హింసను తగ్గించేలా నిర్భయ, అక్రమ రవాణా నిరోధక చట్టాలు వంటి వాటిని కూడా రూపొందించారు. మన భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను, వారి రక్షణ కోసం కేటాయించిన చట్టాలను గురించి ప్రాథమిక అవగాహన కలిగి ఉండడం ప్రతి మహిళకూ అవసరం. అప్పుడే ఏదైనా సమస్య ఎదురైనప్పుడు లీగల్‌గా, ధైర్యంగా ఎదుర్కోగలం.
మార్పు రానంతవరకూ అభివృద్ధి ఉండదు
ఏ దేశంలో అయినా అక్కడి స్ర్తిల స్థితిగతులు మహిళా ఉన్నతిపై ఆధారపడి ఉంటాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో భారతదేశంలో ప్రవేశించిన వ్యాపారాత్మక ధోరణి మానవ విలువలలో, భావజాలంలో పెనుమార్పులు తెచ్చింది. ఆ మార్పులో మహిళను ఇరికించారు. తమ వ్యాపార వృద్ధికోసం మహిళను బజార్లోకి తెచ్చారు. ఈ ధోరణి మహిళల జీవితాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టింది. పెట్టుబడికి అవసరమైన దిశలో ఆమె గమనాన్ని బాహ్యశక్తులు నిర్దేశిస్తున్నాయి. వారి ఉత్పత్తుల ప్రచారం కోసం మహిళలను వ్యాపార వస్తువులుగా చూపిస్తున్నారు. ఎంతగా అంటే మగవాడు మాత్రమే వాడే వస్తువులకు ఆడవారిని అర్ధనగ్నంగా ఊరేగించేవరకు. ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నా అవి ఉపన్యాసాలవరకే పరిమితం అవుతున్నాయి. వారి స్థితిగతుల్లో చెప్పుకోదగ్గ మార్పు ఇంకా రాలేదు. మహిళలపట్ల వ్యాపారాత్మక ధోరణి మారలేదు. అంతవరకూ ఎన్ని మహిళా దినోత్సవాలు జరిపినా ఎటువంటి ప్రయోజనం ఉండదు.

ఈ ఏడాది థీమ్ ఇదే!
ఐక్యరాజ్యసమితి మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించిన తరువాత ప్రతీ ఏడాదీ ఒక్కో థీమ్‌తో ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆ థీమ్ ఆధారంగా మహిళా కార్యక్రమాలు, ప్రసంగాలు, ప్రచారాలు, క్యాంపెయిన్‌లు ఉంటాయి. ఈ సంవత్సరం థీమ్ 3బ్యాలెన్స్ ఫర్ బెటర్2. లింగ వివక్షకు వ్యతిరేకంగా ఆడ, మగ ఇద్దరూ సమానమేనన్న థీమ్‌తో సంవత్సరం పొడుగునా, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా నేటి ఆధునిక సమాజంలో ఆడవారు అన్ని రంగాల్లోనూ, అన్ని ఉద్యోగాల్లోనూ, అన్ని వృత్తుల్లోనూ.. మగవారితో సమానంగా పోటీపడుతున్నారు. తమకు నచ్చిన రంగంలో ప్రతిభను చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో ఎన్నో అడ్డంకులు, సమస్యలు ఎదురైనా బెదరడం లేదు. పట్టుదలతో ముందుకు సాగుతూనే ఉన్నారు. ఆడవాళ్ళు, మీకెందుకీ ఉద్యోగాలు.. హాయిగా తిని ఇంట్లో కూర్చోక.. వంటి సూటిపోటి మాటలను భరిస్తూనే.. ఉద్యోగాల్లో, వృత్తుల్లో వివక్ష ఎదురవుతున్నా సరే, మగవారి కంటే ఆడవారికి జీతాలు తక్కువగా ఇస్తున్నా సరే.. తమను తాము నిరూపించుకోవాలన్న లక్ష్యంతో ఒకొక్క అడుగూ వేస్తూ, ఒకొక్క మెట్టూ పైపైకి ఎక్కుతూ.. తనలోని ప్రజ్ఞను, తెలివితేటలను, ఆలోచనలను బహిర్గతపరుస్తూనే ఉంది ధీరనారీ.. అలాగే పోరాడి కొన్ని హక్కులను సాధించుకుంది కూడా.. ఇన్ని సాధించినా.. మహిళను అబలగానే, శారీరక అవసరాన్ని తీర్చే జడపదార్థంగానే చూస్తున్నారు. నేటికీ మహిళకు స్వేచ్ఛలేదు. మాన, ప్రాణపరంగా రక్షణ లేదు. ఇంటినుండి బయలుదేరి వెళ్ళిన మహిళగానీ, ఆడపిల్లలు గానీ నిర్భయంగా, క్షేమంగా ఇల్లు చేరతారనే భరోసా లేదు. సమాజం ఎంత ముందుకు వెళ్ళినా స్ర్తిలపై హింస విషయంలో మాత్రం రాతియుగమే నయమనిపించేలా ఉంది.

- బొట్లగూడూరు వెంకట శైలజ 9441921129