మిర్చి మసాల

అవిశ్వాస తీర్మానం సమయంలో ప్రజారాజ్యం పాత్రపై అసెంబ్లీ లాబీల్లో బోలెడు సామెతలు వినిపించాయి. ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చింది అంటారు కానీ ఇక్కడ మాత్రం అధికారపక్షం చావుగండం ప్రజారాజ్యానికి పెళ్లికొచ్చింది అని కొత్త సామెతలు చెప్పుకున్నారు. అదేం కాదు సందట్లో సడేమియా సామెత దీనికి బాగా సరిపోతుందని కొందరంటున్నారు. విషయం ఏమంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై టిడిపి అవిశ్వాస తీర్మానం పెట్టడంతో ఈ రెండు పార్టీల్లో ఎవరికి ప్రయోజనం కలిగింది అనే ప్రశ్న వస్తే ఆ రెండు పార్టీల విషయం ఎలా ఉన్నా ప్రజారాజ్యం పార్టీకి మాత్రం బోలెడు ప్రయోజనం కలిగింది. వేడిగా ఉన్నప్పుడే ఇనుమును వంచాలన్నట్టు ఇంత కాలం తమను పూచిక పుల్లాల్లా, కరివేపాకులా చూస్తున్న అధికార పక్షానికి కీలెరిగి వాత పెట్టాం అని ప్రజారాజ్యం నాయకులు సంబరపడుతున్నారు. మా 17 మంది ఎమ్మెల్యేల మద్దతు లేకపోతే ప్రభుత్వం నిలువలేదు అందువల్ల మా డిమాండ్లు ఆమోదిస్తే సరి లేదంటే మా దారి మేం చూసుకుంటామనగానే అధికారపక్షం గజగజ వణికింది అని రాజ్యం నాయకులు సంబరపడుతున్నారు. రాజకీయ పార్టీని ఏర్పాటు చేసినప్పుడు, ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు చిరంజీవికి రాజకీయ తెలివితేటలు అబ్బకపోయినా పార్టీ దివాళా తీశాక, కాంగ్రెస్‌లో విలీనం చేశాక, రాజకీయం బాగానే వంటబట్టింది అని అభిమానులు సంబరపడుతున్నారు.
-మురళి
తలపాగా..!?
ఇటీవల హైదరాబాద్‌లో రైతుల సంక్షేమం కోసం ఓ సదస్సు జరిగింది. నిర్వాహకులు ఆ సదస్సులో ఉపన్యసించేందుకు వచ్చిన వారికి రైతుల్లా ఒకే రంగు ఉన్న తలపాగలు పెట్టారు. పైగా అవి రైతులు ధరించే తలపాగల్లా కాకుండా రాజస్థానీలు ధరించే ఆకర్షణీయమైన తలపాగల్లా ఉన్నాయి. అక్కడి వరకు బాగానే ఉంది కానీ వచ్చిన ఉపన్యాసకులు ఖరీదైన ఖద్దరు, ముడతలు లేని తెల్లటి వస్త్రాలు ధరించి వచ్చారు. దీంతో ఓ విలేఖరి వచ్చిన వారిలో రైతులెవరూ లేరనే సందేహం వ్యక్తం చేశాడు. ఆ మాట అక్కడే ఉన్న ఓ కాంగ్రెస్ నాయకుని చెవిన పడింది. వెంటనే సదరు నాయకుడు స్పందిస్తూ ‘మీలాంటి వాళ్ళు గుర్తించరాదనే, వచ్చిన వారికి తలపాగాలు పెట్టాం..’ అనడంతో అంతా విస్తుపోయారు.
-వి. ఈశ్వర్ రెడ్డి
Add new comment