రాష్ట్రీయం

గ్రామాల్లో ప్రాదేశిక సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి: గత యేడాది నవంబర్ మాసంలో శాసనసభ ఎన్నికలతో మొదలైన సందడి వరుసబెట్టి ఒకదాని వెనుక మరో ఎన్నిక వస్తుండటంతో గ్రామాల్లో రాజకీయ వాతావరణం వేడి వేడిగానే కనిపిస్తోంది. ఈనెల 11వ తేదీన కొనసాగిన పార్లమెంటు మొదటి విడతలో ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంటు నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెలువడకముందే తాజాగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగార మోగడంతో గ్రామాలన్నీ గోలగోలగా మారాయి. ఆయా ప్రధాన పార్టీలు తమ మద్దతుదారులను గెలిపించుకోవాలనే లక్ష్యంతో సన్నాహాలు చేసుకుంటున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పార్టీలు తమ అభ్యర్థులను రంగంలోకి దింపడానికి కృషి చేస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో గతంలో 46 మండలాలు ఉండగా 46 మంది జడ్పీటీసీలు, అంతే మొత్తంలో ఎంపీపీ అధ్యక్షులు ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక జిల్లాల పునర్విభజనతో ఉమ్మడి జిల్లా కాస్త మూడు ముక్కలైంది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలుగా ఆవిర్భవించాయి. ఒక్కో జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయగా కొత్తగా కూడా మండలాలు విస్తరించాయి. సంగారెడ్డి జిల్లాలో 26 మండలాలు, మెదక్ జిల్లాలో 20 మండలాలు, సిద్దిపేట జిల్లాలో 22 మండలాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం నిర్వహించబోతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ముగ్గురు జిల్లా పరిషత్ చైర్మన్లు అధికారంలోకి రానున్నారు. ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయగా సర్పంచ్‌ల మాదిరిగానే మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. పురుషులతో సమానంగా మహిళా ప్రజాప్రతినిధులు స్థానిక సంస్థలకు ఎన్నిక కానున్నారు. సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి మహిళకే రిజర్వ్ అయ్యింది. చైర్ పర్సన్ పదవే ధ్యేయంగా పెట్టుకున్న నాయకులు ఆ దిశగా అడుగులు వేస్తూ పావులు కదుపుతున్నారు. అధికార టీఆర్‌ఎస్ పార్టీలో చైర్మన్ పదవిపై ఎక్కువ మంది ఆశవహులు ఉండగా సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆశీస్సులు పొందేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామాల్లో కూడా ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసేందుకు నాయకులు ఎవరికి వారే టికెట్లు దక్కించుకునేందుకు కృషి చేస్తున్నారు. ఎమ్మెల్యేల ద్వారా టికెట్లు సంపాదించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. శాసన సభ ఎన్నికల్లో పోలింగ్ బూత్ వారీగా సాధించిన పార్టీల ఓట్ల మెజార్టీని బేరీజు వేసుకుని తమ పార్టీ గెలుస్తుందంటే తమ పార్టీ గెలుస్తుందనే ధీమాలో ఆయా పార్టీల నేతలు ఉన్నారు. సర్పంచుల ఎన్నికల్లో కూడా ఆయా పార్టీల మద్దతుదారులు గెలుపొందిన తీరుపై ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు. ఇదే నెలలో నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో గ్రామాల్లో నాయకుల సందడి, ఓటర్ల మద్దతు కూడగట్టుకోవడంలో పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఒక్క సంగారెడ్డి నియోజకవర్గం మినహాయిస్తే మిగతా తొమ్మిది అసెంబ్లీ స్థానాలను టీఆర్‌ఎస్ పార్టీ తిరుగులేని విజయం సాధించింది. సంగారెడ్డి నియోజకవర్గంలో కూడా అతి తక్కువ మెజార్టీతో ఓడిపోవడంతో ఈ నియోజకవర్గంలో కూడా ఎంపీపీలను, జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఆ పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పార్టీ శ్రేణులను ముందుకు నడిపిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుకునేందుకు గట్టిగా కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది.
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవిని చింతా ప్రభాకర్‌కు కట్టబెట్టే యోచనలో అధిష్టానం ఉన్నట్లు విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఈ విషయంలో మాత్రం చింతా ప్రభాకర్ ఇప్పటి వరకు ఎక్కడ కూడా ప్రకటించలేదు. నోటిఫికేషన్ రావడమే తరువాయిగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందడి వాతావరణం నెలకొనడం ఖాయమని చెప్పవచ్చు. అధికారులు సైతం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి అన్ని విధాలుగా సన్నద్ధమవుతున్నారు.