AADIVAVRAM - Others

‘ఫైబర్ గ్లాస్’లో సబ్బండ వర్ణాల శ్రమైక జీవనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయిని చెక్కితే శిల్పం (స్కల్‌ప్చర్) అనేది ఒకప్పటి భావన. శిల్పానికి కాదేదీ అనర్హమంటున్నారు ఆధునిక శిల్పులు. తుక్కు (స్క్రాప్) సైతం చక్కని శిల్పానికి ఆధారమవుతోంది. అంతేనా? కాదు.. కలప, సిమెంట్, ఫైబర్ గ్లాస్, ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ఫ్లైయాష్.. ఇట్లా ఒకటేమిటి ఎన్నో వస్తువులతో అపురూప శిల్పాలను తీర్చిదిద్దుతున్నారు. విచిత్రమేమిటంటే ‘కాగితం గుజ్జు’ సైతం శిల్పానికి ముడి సరకవుతోంది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి 2007 సంవత్సరంలో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (స్కల్‌ప్చర్) పట్టా పొందిన ఆరెళ్లి కుమారస్వామి వర్తమాన శిల్ప కళారంగంలో అనేక ప్రయోగాలు చేస్తూ, సరికొత్త ప్రమాణాలను సృష్టిస్తున్నారు. ఫైబర్ షీట్‌తో ఆయన మలచిన మూర్తులు చూపరులను మైమరపింప జేస్తున్నాయి. రాగి పలకలపై రసరమ్య ఆకారాలను తీర్చిదిద్ది ‘మ్యూరల్స్’గా అమర్చిన నైపుణ్యం ఆయనది.
ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్‌లో తెలంగాణలోని సబ్బండ వర్ణాల శ్రమను తెలిపే శిల్ప సమాహారాన్ని రూపొందించి ఆయన శభాష్.. అనిపించుకున్నారు. ‘ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ మార్కెట్’ను గజ్వేల్‌లో ఇటీవల ప్రారంభించారు. దాని ఆవరణలో సమస్త వృత్తుల సహస్ర హస్తాల చిహ్నంగా భారీ వేదికపై గ్రామీణ కులవృత్తుల వారిని శిల్పాలుగా చూపించారు. 12 కుల వృత్తుల వారి నిలువెత్తు విగ్రహాలను ఫైబర్ గ్లాసులో ‘కాస్టింగ్’ చేసి ఓ భారీ వేదికపై తీర్చిదిద్దారు. చెన్నైలోని మెరీనా బీచ్‌లో ‘లేబర్’ పేర ఎప్పుడో నెలకొల్పిన శిల్పం తరతరాలుగా ఎందరినో ఆకర్షిస్తోంది. అలాగే గజ్వేల్‌లో కుమారస్వామి శ్రామిక జీవన సౌందర్యాన్ని పోతపోసి చూపారు. కమ్మరి, కుమ్మడి, వడ్రంగి, మేదరి, చాకలి, మంగలి, గౌడ, గొల్ల - కురుమ, ఎరుకలి ఇట్లా పనె్నండు వృత్తుల ప్రాతినిధ్యం ఆ వేదికపై నిలువెత్తు రూపంలో దర్శనమిస్తోంది. ఇంతవరకు రాజులు.. రాణులు, సేనానులు, రాజకీయ నాయకులు, జ్ఞాన సంపన్నుల శిల్పాలే వివిధ కూడళ్లలో, బహిరంగ ప్రదేశాల్లో దర్శనమిచ్చాయి. వర్తమానంలో ‘శ్రమజీవి’కి పట్టం కట్టి ‘పీఠం’పై కూర్చోబెట్టే ప్రజాస్వామ్య పవనాలు వీస్తున్నాయి. అందుకే సబ్బండ వర్ణాల వారు ఇప్పుడు చిరకాలం స్ఫూర్తిదాతలుగా బహిరంగ ప్రదేశాల్లో, కూడళ్లలో శిల్పాలై నిలుస్తున్నారు. వాటికి ఆరెళ్లి కుమారస్వామి ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు.
కేవలం శ్రమ జీవుల శ్రమైక జీవన సౌందర్యానే్న గాక తెలంగాణ కళలు, కళారూపాలను కూడా ఆయన పరిచయం చేస్తున్నారు. గజ్వేల్ పట్టణంలోనే నిర్మించిన ‘మహతి’ ఆడిటోరియంలో ఆయన పేరిణి నృత్యం, బతుకమ్మ, బోనాలు, కొమ్ముకోయ, గుస్సాడీ లాంటి తొమ్మిది కళా రూపాలకు ఫైబర్ గ్లాస్‌తో ప్రాణం పోశారు. కుల వృత్తుల సముదాయ శిల్పాలను, తెలంగాణ కళారూపాలను ఇలా ఆధునిక శిల్పకళా మాధ్యమం ద్వారా చిత్రిక పట్టినవారు ఆరెళ్లి శివకుమార్ ఒక్కరే అంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ సమాజ ఔన్నత్యాన్ని తన శిల్ప కళాచాతుర్యంతో చిరకాలం నిలిచేలా ఆయన శ్రమిస్తున్నారు. హైదరాబాద్ శిల్పారామంలో సైతం గొర్రెల కాపరి లాంటి శిల్పాలే కాక రాతిలో ఆయన చెక్కిన శిల్పాలు కనిపిస్తాయి. ఆ రకంగా అసంఖ్యాకుల మదిని ఆయన దోచుకుంటున్నారు. తెలంగాణ ‘ఆత్మ’ను తన ‘కళ’ ద్వారా నిరంతరం వ్యక్తపరుస్తున్నారు.
రైతే రాజు.. అన్న శీర్షికతో ఓ కాంస్య విగ్రహాన్ని రూపొందించారు. దీన్ని మరింత భారీ స్థాయిలో రూపొందించి ప్రజలకు స్ఫూర్తి కలిగేలా, అందరి మదిలో రైతు గౌరవ స్థానంలో నిలిచేలా రూపొందించే పనిలో కుమారస్వామి ఉన్నారు.
ఇలా ఓ ఫైబర్ గ్లాస్ శిల్పం తయారుచేయాలంటే.. ముందుగా మట్టితో (క్లేతో) ఆకారం రూపొందించాలి. అనంతరం దాన్ని ‘అచ్చు’ (వౌల్డ్) తీయాలి, ఆ తరువాత కాస్టింగ్ చేయాలి.. చిట్టచివరన ఫినిష్ చేసి, మోనోక్రోమ్ రంగులద్దాలి... సజీవంగా కనిపించేందుకు అవసరమైన రీతిలో తీర్చిదిద్దాలి. ఈ ప్రక్రియ ఊహించినంత సులువైనది మాత్రం కాదు. రాయిని శిల్పంగా మార్చటం ఎంత కష్టమో ఈ వౌల్డింగ్ పద్ధతిలో శిల్పాన్ని తీర్చిదిద్దడం అంతే కష్టం. ఆ కష్టాన్ని శిల్పులు ఎంతో ఇష్టంగా భరిస్తారు కాబట్టే అనేక ఆకృతులు, శిల్పాలు అంతటా దర్శనమిస్తున్నాయి.
జనహర్ష అనే ఓ ప్రైవేటు రిసార్ట్‌లో కుమారస్వామి తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ఒకేచోట 120 బొమ్మలను ‘ఇన్‌స్టాల్’ చేశారు. ఆదిమ మానవుల నుంచి గిరిజనులు, జానపదులు, సాధు - సన్యాసుల వరకు మానవ జీవన పరిణామ క్రమాన్ని చూపే విధంగా ఈ బొమ్మలున్నాయి. గిరిజన నృత్యాలు, వారి వాద్య పరికరాలు, అలంకరణ ఇత్యాది అంశాలు ఎంతో హృద్యంగా, వివరంగా వాటిలో పొందుపరిచారు. ఇవన్నీ ఫైబర్ గ్లాస్‌తో రూపొందించి జనారణ్యంలో ఓ ‘అరణ్య’ వాతావరణం సృష్టించారు. అలాగే కలప (వుడ్)లో కార్వింగ్ చేయడమంటే తనకెంతో ఇష్టమని కుమారస్వామి అంటున్నారు. ఆ మాధ్యమంలోనూ ఎన్నో శిల్పాలను తీర్చిదిద్దారు. ఈ వుడ్ స్కల్‌ప్చర్‌తోపాటు స్క్రాప్ స్కల్‌ప్చర్‌ను చేశారు. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలలో అవి దర్శనమిస్తాయి. ఇలా ‘మిక్స్‌డ్ మీడియా’లో చేయి తిరిగిన శిల్పి ఆయన. పేపర్ మెష్‌తోనూ ఆకారాలను అద్భుతంగా అందించే నైపుణ్యం ఆయన సొత్తు. హైదరాబాద్‌లోని హైటెక్ కనె్వన్షన్ సెంటర్ వద్ద సిమెంట్ మ్యూరల్స్, రాగి పలకలతో మ్యూరల్స్ తీర్చిదిద్ది అంతర్జాతీయ అతిథులను ఆకర్షించారు.
పాశ్చాత్య శిల్పుల్లో మైకలాంజిలలో, పికాసో తనకెంతో ఇష్టమని, భారతదేశానికొస్తే డి.పి.రాయ్ చౌదరి శిల్పమంటే చెవి కోసుకుంటానని, తెలంగాణ వరకొస్తే డి.ఎల్.ఎన్. రెడ్డి తనకు ఆరాధ్యుడని చెప్పే కుమారస్వామికి 2006 సంవత్సరంలో జె.ఎన్.టి.యు. ఫైన్ ఆర్ట్స్ కళాశాల నుంచి బంగారు పతకం, తన శిల్పానికి జాతీయ అవార్డు, ప్రాంతీయ అవార్డు, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అవార్డులను అందుకున్నారు. దేశంలోని ప్రముఖ నగరాలలో తన సృజనను ప్రదర్శించారు. ప్రముఖుల మన్ననలు అందుకున్నారు.
గోదావరిఖనిలోని బొగ్గుగని కార్మికుడు మల్లయ్య కుమారుడైన కుమారస్వామి శిల్ప కళారంగంలో ఈ ఎత్తులకు ఎదుగుతారని ఎవరూ ఊహించలేదు. ఆయన ‘దూకుడు’ చూస్తుంటే మరెన్నో శిఖరాలను అవలీలగా అధిరోహిస్తాడనిపిస్తోంది. *

అధివాస్తవికత అతని ఆరో ప్రాణం

రెండు తెలుగు రాష్ట్రాల విశిష్ట యువ చిత్రకారుడు గాడిగ శివకుమార్ అధివాస్తవికత (సర్రియలిజం) శైలిలో చిత్రాలు గీసేవారు మాయమవుతున్న తరుణంలో ఆ శైలితో రంగుల్లో బలమైన భావ ప్రసరణ చేస్తున్న చిత్రకారుడాయన. తన కలలకు చిత్ర కళారూపం ఇచ్చేందుకు శ్రమిస్తున్నాడు. నైరూప్యానికి రంగుల రూపం అద్దుతున్నారు.
అధివాస్తవికత శైలి ఒకప్పుడు ప్రపంచాన్ని కుదిపేసింది. రంగుల విప్లవాన్ని తీసుకొచ్చింది. మొద్దుబారుతున్న మెదళ్ల తుప్పు వదిల్చేందుకు అది ఎంతో ఉపకరించింది. మనిషి జాగరూకతలో ఉండేందుకు ఈ చిత్రకళ సహకరించింది. అలాంటి చిత్రాలు వేసే చిత్రకారులకు వేపకాయంత వెర్రి ఉంటుందని భావించే వారున్నారు. అయినా జడుసుకోకుండా డాలీ లాంటి ప్రముఖ చిత్రకారులు తమ మనోక్షేత్రంలో మెరిసిన అంశాలకు రంగులు అద్ది చిత్రకళా యవనికపై విస్ఫోటనం కలిగించారు. డాలీతోపాటు అమెరికన్ చిత్రకారుడు రెనీ మొగ్రెటీ తాను అభిమానించే చిత్రకారులని శివకుమార్ అంటున్నారు.
ఈ భావజాలం కొంతకాలం భారతదేశంలోనూ కనిపించింది. కాలక్రమంగా కొత్త ఆలోచనలు, భావాలు, శైలి, రూపాలు తన్నుకొచ్చి ‘అధివాస్తవిక’ పద్ధతిని వెనక్కి నెట్టాయి. కానీ అది వేసిన బీజం ఎక్కడో అక్కడో మొలకెత్తుతుందనడానికి నిదర్శనం శివకుమార్ చిత్రాలు.
‘్ఫటో రియలిజం’ మాధ్యమంలోనూ ఆయన అనేక వర్ణ చిత్రాలను కాన్వాస్‌పై చిత్రించారు. ఈ మాధ్యమం సైతం సంప్రదాయ చిత్రకళకు కాస్త దూరమైనదే! 2007 సంవత్సరంలోనే ఈ శైలిలో ఓ పాప్ గాయకుడిని, ఓ నీగ్రోను మరికొన్ని పోట్రేట్స్‌ను చిత్రించి తన విశిష్టతను - ప్రత్యేకతను ఆయన చాటుకున్నారు. తన స్వప్నాలను సర్రియలిజం డ్రీమ్స్ పేర పెద్దపెద్ద కాన్వాసులపై రంగుల నైరూప్యాలను పొందుపరిచారు. స్వప్నానికి సరైన పద్ధతి - రూపం - రంగు - కదలిక కనిపించదు. ఆ అవ్యవస్థిత చలన గతికే రంగులద్దే సాహసం శివకుమార్ చేశారు. ‘హిడెన్ ఎమోషన్స్’ పేర మరికొన్ని వర్ణచిత్రాల్ని చిత్రించి రంగుల మార్మికతను కాన్వాసుపై కనబరిచారు. తాను ఇతర చిత్రకారులకు ఎంతో భిన్నమన్న సంగతిని ప్రతి కాన్వాసులో ఆయన తెలియజేస్తారు. అతి చిన్న వయసులో శివకుమార్ ఈ ప్రత్యేకతను - విశిష్టతను చాటుకోవడం గొప్ప విషయం. అందుకే సీనియర్ చిత్రకారులతో సులభంగా కలిసిపోతారు. ఈ ప్రత్యేకతను - ప్రతిభను చాటుతూ కొన్ని సెటైరికల్ (వ్యంగ్య) వర్ణ చిత్రాలు ఆయన గీశారు. ఇవి విభిన్న మనస్తత్వాల్ని, వినూత్న వైఖరిని బట్టబయలు చేస్తున్నాయి. పెయింటింగ్‌లో వ్యంగ్యం పలికించడం ఓ వినూత్న ప్రయోగం. వార్తాపత్రికల్లోని వార్తలు, విశేషాలు తన కాన్వాసుపై రంగుల్లో - రూపాల్లో, వివిధ ఆకారాల్లో దర్శనమిస్తాయని ఆయన అంటారు. ఈ వ్యక్తీకరణ ఓ సాహసం. ఈ కొత్తకోణం ఆషామాషీ వ్యవహారం ఎంత మాత్రం కాదు.
నాలుగు ఇంటు ఏడు అడుగుల పెద్ద పెయింటింగ్‌ను ఒకే ఫ్రేమ్‌గా భావించి ముఖం కనిపించని కొమ్ములు తిరిగిన ఓ వ్యక్తి కుర్చీలో కూర్చుని ఉపన్యసిస్తూ ఉండగా ఓ కుక్క వచ్చి కుర్చీ వద్ద మూత్ర విసర్జన చేస్తుంది. అతని చుట్టూ కాకులు అరుస్తూ ఉంటాయి. దూరంగా ఓ ‘జీబ్రా’ వెళ్లిపోతూ కనిపిస్తుంది. గురివింద గింజలు రాశిపోసి కనిపిస్తాయి, నెమలి, హంస, నక్క, ఫొటో స్టూడియోలో కనిపించే ఓ లైట్‌స్టాండ్.. శ్మశానంలో కనిపించే రాళ్లు, ఇలా ఒకదానికొకటి సంబంధం లేని, విభిన్నమైనవి సమాజంలోని వివిధ వ్యక్తులకు చిహ్నంగా చూపానని చిత్రకారుడంటారు.
మరో వర్ణచిత్రంలో ఓ పాఠశాల విద్యార్థి పుస్తకాలు కింద పారేసి గన్ సవరిస్తూ కనిపిస్తాడు, ఓ రిక్షా కార్మికుడు, తన కుటుంబ సభ్యులను అందులో కూర్చోబెట్టుకుని లాగుతాడు. ఓ పక్క శ్మశానంలో శవాలు కాలుతుంటాయి. రాజకీయ నాయకుడు ఇంకోపక్క ప్రసంగిస్తూ ఉంటాడు. ఓ దిక్కున బాంబులు పేలుతుంటాయి. పిండాలు తింటున్న కాకులు, నరికేసిన చెట్లు, ఓ ఊరేగింపులు, జెండా.. నెమలి.. ఇట్లా అనునిత్యం పత్రికల్లో వచ్చే కథనాలకు, వార్తలకు స్పందించి గీసిన వర్ణచిత్రమని శివకుమార్ అంటున్నారు. ఆయన ఆలోచనా సరళి ఎంత భిన్నమైనదో ఈ వ్యక్తీకరణతో తేటతెల్లమవుతోంది. ఎంత అధివాస్తవికత.. వ్యంగ్యం రంగుల్లో గూడుకట్టుకుని ఉందో అర్థమవుతోంది. ఈ సాహసం ఇతర ఏ చిత్రకారుల్లో కనిపించదు. ఇదో ప్రత్యేకత, విశిష్టత. సమాజంలోని వివిధ మనస్తత్వాలు గల పెద్దలకు చిహ్నంగా ఓ ఎర్రతివాచీపై పులి, నక్క, కుక్క, గొర్రె ఇలా కొన్ని జంతువులు హుందాగా కదులుతూ ఉంటాయి. క్రూర మానవ మనస్తత్వాలను జంతువులతో పోల్చి చూపే సరికొత్త ప్రయోగం ఆయన చిత్రాల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇదో సరికొత్త ధోరణి.. సరళి. తెలుగు నేలపై ఇలాంటి సృజన అగుపించడం అరుదు. ‘హిడెన్ ఎమోషన్స్’ శీర్షికతో మనుషుల్లోని పశుత్వం నర్మగర్భంగా వ్యక్తం చేస్తున్నారు. సాధారణ వీక్షకుడు దీన్ని పట్టుకోవడం కొంత కష్టంగా ఉండవచ్చు గానీ భావం మాత్రం అద్భుతం. లోకులు పలుకాకులన్న విషయాన్ని ఇంత ‘బోల్డ్’గా పేర్కొనడం సాహసంగాక ఏమవుతుంది?.. అమాయక ప్రజల ‘ఆర్తి’ కూడా ఇందులో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
శివకుమార్ చిత్రకారుడే గాక శిల్పి కూడా. తన మిత్రుడు ఆరెళ్లి కుమార్ స్వామితో కలిసి శిల్పాలు రూపొందించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో జరిగిన లిటరరీ ఫెస్టివల్ సందర్భంగా ‘వుమన్ ఇన్ఫినిటి) పేర ఓ వినూత్న శిల్పాన్ని ఆరుబయట ప్రదర్శించి మన్ననలు అందుకున్నారు. హైదరాబాద్ సుందరీకరణ కార్యక్రమంలోనూ ఆయన పాల్గొన్నారు.
2002 సంవత్సరంలో జెఎన్‌టియు ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో చేరేందుకు శివకుమార్ పాత మహబూబ్‌నగర్ జిల్లా అమన్‌గల్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఐదు సంవత్సరాల ఆ కోర్సు చేశాక బెంగుళూరు విశ్వవిద్యాలయం నుంచి 2008 సంవత్సరంలో ఎంఎఫ్‌ఏ పూర్తి చేశారు. పెయింటింగ్‌లోని మెలకువలను తెలుసుకుని అదే లోకంగా అధివాస్తవికత ఆరవ ప్రాణంగా బతుకుతున్నారు. లాండ్‌స్కేప్ బొమ్మలూ వేస్తున్నారు. 2010 సంవత్సరం నుంచి వివిధ మాధ్యమాలలో తన నైపుణ్యం ప్రదర్శిస్తూ అనేక బహుమతులు గెలుచుకున్నారు. కేమల్ అవార్డు అందుకుని యూరప్‌ను సందర్శించి అక్కడి ఆర్ట్ గ్యాలరీలలో చిత్రకళను పరిశీలించారు. ఢిల్లీలోని లలిత కళా అకాడెమీ అవార్డును, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అవార్డుతోపాటు అనేక అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. ఓ ఇంటర్నేషనల్ స్కూల్‌లో డ్రాయింగ్ టీచర్‌గా పని చేస్తూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.
అమన్‌గల్‌లోని ఓ తాపీమేస్ర్తి కుమారుడు ఇప్పుడు చిత్రకళా రంగంలో అకాశమంత ఎత్తు ఎదిగి తాను పుట్టిన గడ్డకు గొప్ప పేరును తీసుకొస్తున్నారు. సృజనాత్మక ఆలోచనలకు చిరునామాగా నిలుస్తున్నారు.

ఆరెళ్లి కుమారస్వామి 98496 02663 జి.శివకుమార్ 95056 46092

-వుప్పల నరసింహం 9985781799