ఆంధ్రప్రదేశ్‌

మడమ తిప్పను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 26: నవరత్నాలతోపాటు ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాను.. మద్య నిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తాను.. అవినీతిని అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకుంటాను.. అవసరమైతే పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దుచేసి రివర్స్ టెండరింగ్ చేస్తాను.. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు చిత్తశుద్ధితో పని చేస్తాను.. ప్రత్యేక హోదాకోసం ప్రధాన మంత్రిని వేడుకుంటూనే ఉంటానని ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించారు. ఎన్నికల ప్రణాళిక తనకు ఖురాన్, బైబిల్, భగవద్గీత లాంటిదని జగన్‌మోహన్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఒక శే్వతపత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయి. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం, కడప ఉక్కు కర్మాగారం, దుగరాజపట్నం ప్రాజెక్టు తదితర అంశాల గురించి ప్రధానితో చర్చించానన్నారు. రాష్ట్రానికి వీలున్నంత వరకు ఆర్థిక సహాయం చేస్తామని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల తనకు ఎలాంటి ద్వేషం లేదని.. అయితే ఆయన హయాంలో జరిగిన అవినీతికి హద్దులు లేవని అన్నారు. తన హయాంలో రాష్ట్రంలో అవినీతి అనేదే జరగదని
అన్నారు. రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తెస్తాం.. ఎవ్వరూ ఊహించని పద్ధతిలో ప్రభుత్వాన్ని నడిపిస్తాం.. ప్రజలకు సమర్థ, అవినీతి రహిత పాలనను అందజేస్తామని జగన్‌మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రతి పని పారదర్శకంగా ఉంటుంది.. పారదర్శకత్వానికి కొత్త నిర్వచనం ఇస్తామని ఆయన తెలిపారు.
మద్య నిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తాం.. రాష్ట్రానికి లభించే ఆబ్కారీ ఆదాయాన్ని ఒకేసారి తొలగించలేం.. ఆబ్కారీ ఆదాయాన్ని నిదానంగా తగ్గిస్తూ నిషేధాన్ని అమలు చేస్తామని అన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల నాటికి మద్యపానాన్ని ఐదు నక్షత్రాల హోటళ్లకు మాత్రమే పరిమితం చేసిన తరువాతే ప్రజలను ఓట్లు అడుగుతామనే హామీని ఆయన ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకే దఫాలో మద్య నిషేదాన్ని అమలు చేస్తానని ఎన్నికల ప్రణాళికలో చెప్పలేదన్నారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన ప్రతి హామీని తు.చ. తప్పకుండా అమలు చేస్తాం.. ఎప్పుడెప్పుడు ఎలా అమలు చేస్తామనేది కూడా ఎన్నికల ప్రణాళికలో వివరించాం కాబట్టి దాని ప్రకారం చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రజలు విశ్వసనీయతతో తనకు ఓట్లు వేశారు.. దానిని నిలబెట్టుకుంటాను.. ప్రజల విశ్వాసం తగ్గకుండా, సన్నగిల్లకుండా తాను అడుగు ముందుకు వేస్తానని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును మర్యాదపూర్వకంగా కలిశానని అన్నారు. పొరుగు రాష్ట్రాలు మరీ ముఖ్యంగా తెలంగాణతో సత్సంబంధాలు ఉండాలని అన్నారు. చంద్రశేఖరరావు మంచి మనసుతో ప్రత్యేక హోదా సాధనకోసం మీతో ఉంటాను.. మా ఎంపీలు పార్లమెంటులో మీతో ఉంటారని చెప్పారు కాబట్టి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి పని చేయటం ఎంతో అవసరమని జగన్‌మోహన్ రెడ్డి చెప్పారు. మా బలం 22, కేసీఆర్ ఎంపీలు 9 మంది మొత్తం 31 మంది కలిసి పని చేస్తారని అన్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిశానని ఆయన తెలిపారు. ఈ దేశంలో రెండో అత్యంత బలవంతుడైన వ్యక్తి అమిత్ షా కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు, అవసరాల గురించి మొదటి మనిషి నరేంద్ర మోదీని కలిసిన అనంతరం రెండో అత్యంత బలవంతుడైన అమిత్ షాను కూడా కలిశానని అన్నారు. ఆర్థిక సమస్యలున్నాయి.. నవరత్నాలను అమలు చేయాలంటే కేంద్ర సహాయం ఎంతో అవసరం.. అందుకే ఢిల్లీకి వచ్చానని ఆయన వివరించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి, కుంభకోణాల గురించి ప్రజలకు వివరించవలసి ఉన్నది.. అందుకే దీనిపై శే్వతపత్రాన్ని విడుదల చేస్తామని అన్నారు. రాజధాని భూముల విషయంలో ఎంతో పెద్ద కుంభకోణం జరిగిందని జగన్‌మోహన్ రెడ్డి చెప్పారు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు, ఆయన మనుషులు ఇన్‌సైడ్ ట్రేడింగ్ లాంటిది చేశారని ఆయన ఆరోపించారు. తనకు నచ్చినవారికి, నచ్చిన రేటుకు రాజధాని భూములు కేటాయించారు.. ఇది మామూలు కుంభకోణం కాదని ఆయన చెప్పారు. చంద్రబాబు పట్ల తనకు ఎలాంటి ద్వేషం లేదు.. అయితే రాష్ట్ర కస్టోడియన్‌గా తాను చేయవలసినదంతా చేస్తానని ఆయన ప్రకటించారు. దేశంలోనే ఏపీ వినూత్నమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతాను.. అవినీతికి స్థానం ఉండదని అన్నారు. రివర్స్ టెండరింగ్‌తోపాటు రాష్ట్రంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటామన్నారు. కుంభకోణం జరిగినట్లు తెలియగానే పాత టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లు పిలిచి అతి తక్కువ కోట్ చేసే వారికి పని అప్పగిస్తామని జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించారు. కాంట్రాక్టుల్లో అత్యున్నత స్థాయి పారదర్శకతను పాటిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం అధినాయకుడు చంద్రబాబు నాయుడు తనపై కేసులు పెట్టారని అన్నారు. తన తండ్రి బతికి ఉన్నప్పుడు, తాను కాంగ్రెస్‌లో ఉన్నంత కాలం కేసులు లేవు.. మా నాన్న చనిపోయిన తరువాత, తాను కాంగ్రెస్ నుండి బైటికి వచ్చిన తరువాత కేసులు పెట్టారని జగన్‌మోహన్ రెడ్డి చెప్పారు. తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెంగళూరులో ఉన్నాను.. అప్పుడప్పుడు హైదరాబాదుకు వచ్చేవాడిని, ఒక్కసారి కూడా సచివాలయంలో అడుగు పెట్టలేదు.. అయినా తనపై కేసులు పెట్టారని ఆయన వాపోయారు. తనపై తప్పుడు కేసులు బనాయించినందుకే రాష్ట్ర ప్రజలు తనకు భారీ మెజారిటీ ఇచ్చి తెలుగుదేశం పార్టీకి గుణపాఠం చెప్పారని జగన్‌మోహన్ రెడ్డి చెప్పారు.