AADIVAVRAM - Others

సమస్త భూమండలం తిరిగిన సుగ్రీవుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(గత సంచిక తరువాయి)
*
ఇవన్నీ కలియజూస్తూ పోతుంటే సెలయేళ్లున్న సర్వసౌవర్ణం అనే పేరున్న కొండ వస్తుంది. ఆ పర్వతానికి మేఘవంతం అనే పేరు. అది దాటిపోతే అరవై వేల కొండలు వస్తాయి. ఆ పర్వతాల మధ్య ప్రదేశంలో ఉత్తర మేరుసావర్ణి అనే పర్వతం వుంది. విశ్వులు, ఆదిత్యులు, మరుత్తులు, వసువులు మొదలైన వారు ప్రసిద్ధులైన దేవతలను సాయంకాల సమయంలో భక్తితో బంగారు కొండ మీద వున్న సూర్యుడిని సేవించడానికి వస్తారు. ప్రాణికోటికంతా కానరానివాడై లోకమంతా చీకటిలో మునిగేట్లు చేసి తానూ పడమటి కొండకు పోతాడు.
గడియకు పదివేల ఆమడల వంతున పోయి సూర్యుడు పడమటి కొండకు చేరుకుంటాడు. ఆ పర్వత శిఖరం కొనలో సూర్యకాంతి కల మేడలతో నిండిన దివ్యమైన ఒక ఇల్లు వుంది. అది విశ్వకర్మ నిర్మితం. అక్కడ అస్తపర్వతానికి, మేరు పర్వతానికి మధ్యన బంగారుమయమై, చిత్రమైన అరుగు కలిగి, పది తలల తాలవృక్షం కళ్లకు ఆనందంగా కనపడుతుంది. సూర్యుడు ఉదయ సమయాన ఇంతదాకా తన తేజస్సుతో చీకట్లను తరిమి పడమటి కొండకు పోతాడు. ఆ తరువాత సూర్యరశ్మి వుండదు. కాబట్టి ఏమున్నదో తెలియదు, చీకట్లు వ్యాపించి ఉంటాయి.
ఆ తరువాత సుగ్రీవుడు మహాబలవంతుడైన శతవలి అనే వాడిని ఉత్తర దిక్కుకు పొమ్మంటాడు.
ఉత్తరాన హిమవత్పర్వతం వుంది. మ్లేచ్చ దేశంలో శూరసేన, పుళింద, ప్రస్థర, మద్రక, భారత (హస్తినాపుర) దక్షిణ కురుభూములు, కాంభోజ, యవన, శక దేశం, అరట్ట, బాహ్లిక, పౌరవ, టంకణ, ఋషిక దేశాలు, జీనా దేశం, పరమ చీన (మంచూరియా - మంగోలియా) దేశం, నిహార, దరద ప్రదేశాలు, హిమవత్పర్వత ప్రాంతం వుంటాయి. సోమాశ్రమం, కాలపర్వతం అవతల వైపున గుహలుంటాయి. ఆ పర్వతం దాటిపోగా సుదర్శనం అనే పర్వతం వస్తుంది. అది దాటిపోయిన తరువాత దేవసఖమనే పర్వతం ఉంటుంది. దానికి అవతల కొండలు, నదులు, చెట్లు, జీవజంతువులు లేని నూరామడల పొడవున్న దేశం ఉంటుంది. దీన్ని గోబి, శాము ఎడారి అంటారు. ఆ మరుభూమిని దాటిపోతే కైలాస పర్వతం కనబడుతుంది. (హిమాలయానికి ఉత్తరాన టిబెట్ దేశం వుందిప్పుడు). అక్కడ తెల్లటి మేఘంతో సమానమై, బంగారంతో అలంకృతమై, తెల్లటి కాంతికల కుబేరుడి ఇల్లుంది. దాన్ని విశ్వకర్మ నిర్మించాడు.’
అక్కడ వస్వౌకసార అనే కొలను వుంది. కుబేరుడు ఎల్లప్పుడూ అక్కడ వినోదంగా క్రీడిస్తుంటాడు. ఆ ప్రదేశంలో పూర్వం కుమారస్వామి శక్తి ప్రయోగంతో నిర్మించిన శిబిరం ఉంది. ఆ దారిలోనే హంసలు మానస సరస్సుకు పోయి వస్తుంటాయి. ఆ బిలంలోకి పోవడం అంత సులభం కాదు. అక్కడ వృక్షం, కామశైలం, మానసం అనే పర్వతాలున్నాయి. దేవదానకులకు కూడా మాంసం అనే పర్వతం దగ్గరికి పోవడానికి సాధ్యంకాదు.
క్రౌంచ పర్వతం దాటిన తరువాత మైనాక పర్వతం వస్తుంది. ఆ పర్వతం మీద మయుడనే దానవుడు కట్టుకున్న సుందరమైన గృహం వుంది. అక్కడ సిద్దులుండే ప్రదేశంలో వైఖానసం అనే సరస్సు వుంది. ఆ సరస్సుకు ఆవల సూర్యకాంతి, చంద్రకాంతి, నక్షత్ర కాంతి లేదు. అక్కడ మేఘాలు లేవు. ఆకాశం శబ్దం లేకుండా ఉంటుంది. మీరది దాటిపోతే శైలోదం అనే శిలానది వుంది. దానికి ఇవతల, అవతల కీచకాలు అనే పేరు కల వెదుళ్ల పొదలుంటాయి. ఆ ఏటి నీళ్లలో దిగిన వారు రాళ్లుగా మారిపోతారు కాబట్టి ఆ నది దాటాలంటే, ఆ పొదల వెదుళ్లు పట్టుకొని పోవాలి, రావాలి. ఆ దరిన, ఈ దరిన వెదుళ్లు కలిసికొని అల్లుకుని వుంటాయి. ఆ ఉత్తర కురుభూములు పుణ్యం చేసిన పురుషులకు భోగస్థానాలై వుంటాయి.’
అక్కడ అనేక నదులున్నాయి. వాటిల్లో వైఢూర్యాలున్న ఆకులు కలిగిన బంగారు కమలాలుకల తామరతూండ్లు వున్నాయి. అక్కడ ఎర్రటి కలువల వనాలున్నాయి. అక్కడి సరస్సులు బంగారువనె్న, బాలసూర్యుడి వనె్న కలిగి వుంటాయి. చూడడానికి చాలా సంతోషకరములై వుంటాయి. జాతినీలాల కాంతికల రేకులు, అపరంజి బంగారు కాంతికల కింజల్కాలున్న నల్లటి కలువలతో నిండిన సరస్సులు అక్కడ అందంగా ఉంటాయి. అగ్నితో సమానంగా బంగారు కాంతితో కొండలక్కడ దండిగా ఉన్నాయి.
ఆ ఉత్తర కురు భూముల్లో కొన్ని పర్వతాలు అసమానమైన, ఆశ్చర్యకరమైన పీటలు, మంచాలు కాస్తాయి. దాన్ని దాటి ఉత్తరంగా పోతే, సముద్రంలో సోమశైలం అనే పేరున్న బంగారుమయమైన పర్వతం వుంటుంది. దాన్ని ఇంద్రలోక వాసులు, బ్రహ్మలోక వాసులు కాపాడుతుంటారు. ఆ ప్రదేశంలో సూర్యకాంతి లేకపోయినా ఆ బంగారు కాంతివల్ల వస్తువులు కనబడుతుంటాయి.
అక్కడ షాడ్గుణ్య పరిపూర్తి కలిగి ప్రపంచ స్వరూపుడైన విష్ణువు, ఏకాదశ మూర్తులు ధరించి, మన్మథ విరోధి అయిన శివుడు, ప్రపంచాన్ని సృష్టించిన బ్రహ్మ కాపురం వుంటారు. ఉత్తర కురుభూములకు ఉత్తరంగా వున్న సోమపర్వతం చేరబోవడం సాధ్యపడదు. ఆవలి దేశం కట్టుపాటు లేనిది. సూర్యకాంతి వుండదు. అక్కడ ఏమున్నదో ఎవరికీ తెలియదు.
*
(ఆంధ్ర వాల్మీకి వావిలికొలను సుబ్బారావు (వాసుదాసు)గారి ఆంధ్ర వాల్మీకి రామాయణం ఆధారంగా.)

- వనం జ్వాలా నరసింహారావు