ఆంధ్రప్రదేశ్‌

‘పోలవరం’లో తరగని భూ వివాదాలు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 19: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం రోజుకో వివాదంతో కొట్టుమిట్టాడుతోంది. ముఖ్యంగా భూముల పరిహారంపైనే వివాదాలు నెలకొంటున్నాయి. కొత్త భూసేకరణ చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో భూములకు చెల్లించాల్సిన పరిహారం గణనీయంగా పెరిగిన సంగతి విదితమే.
ఈ నేపథ్యంలో పరిహారం పొందిన పలువురు గిరిజనేతరులు భూములు తమ ఆధీనంలో ఉంచుకోవడం కొత్త వివాదానికి తెరలేపింది. పశ్చిమ గోదావరి జిల్లాలో గిరిజనేతరుల చేతిలో ఉన్న వేలాది ఎకరాలకు గత ప్రభుత్వ హయాంలో యుద్ధప్రాతిపదికన పరిహారం చెల్లించేశారు. అయితే ఈ భూములు ప్రాజెక్టు పూర్తిస్థాయి వరద మట్టానికి (ఎఫ్‌ఆర్‌ఎల్) చేరుకున్నపుడు మాత్రమే అవసరమవుతాయి. ఈ నేపథ్యంలో అప్పటి కొందరు అధికారుల అండదండలతో పరిహారం పొందినవారే భూములు సాగుచేసుకుంటున్నారు. దాన్ని గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. ఇటువంటి భూముల్లో పరిహారం ఎలాగూ పొందారు కాబట్టి కనీసం ముంపునకు గురయ్యేంత వరకైనా ఫలసాయమైనా తాము అనుభవిస్తామని గిరిజనులు కొన్నిచోట్ల జెండాలు పాతడంతో భూ వివాదాలు తలెత్తాయి.
ఈ భూ వివాదాలు ముఖ్యమంత్రి జగన్ దృష్టికి రానున్నాయని తెలుస్తోంది. కాగా నష్టపరిహారం పొందిన గిరిజనేతరులు ఈ భూములను తమ అధీనంలోనే ఉంచుకునేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి వినతి పత్రం ఇచ్చేందుకు సిద్ధపడుతున్నట్టు తెలిసింది. అయితే నష్టపరిహారం చెల్లించిన తర్వాత ఈ భూముల్లోకి గిరిజనేతరులు తిరిగి ప్రవేశిస్తే 1/70 యాక్టుతో పాటు, సమతా కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించినట్టే అవుతుందనేది గిరిజన సంఘాల వాదన.
తూర్పు గోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు కోసం 1633 ఎకరాలు మాత్రమే సేకరించారు. కాలనీల నిర్మాణానికి 5259 ఎకరాలతో పాటు జిల్లాలో కలిసిన 4 ముంపు ముండలాల నిర్వాసితుల కోసం మరో 33,164 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఈమేరకు గత ఏడాది పోలవరం అధారిటీకి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ నివేదిక పంపించారు. ఈ నివేదికలో గిరిజనులు కమ్యూనిటీ హక్కుగా పొందిన వన సంరక్షణ సమితి (వీఎస్‌ఎస్) భూములు చేర్చలేదంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 2 లక్షల ఎకరాల వీఎస్‌ఎస్ భూములకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. ముంపునకు గురవుతున్న గ్రామాల పరిధిలోని వీఎస్‌ఎస్ భూములకు విలువ కట్టి, నిర్వాసితులయిన వీఎస్‌ఎస్ సభ్యులకు కొత్త భూసేకరణ చట్టంలోని సెక్షన్-42 ప్రకారం నష్టపరిహారం చెల్లించాల్సి ఉందని ఆదివాసీ మహాసభ ప్రభుత్వానికి విజ్ఞప్తిచేస్తోంది. వన సంరక్షణ సమితుల భూములతో కలిపిచూస్తే కొత్త చట్టం ప్రకారం పరిహారం దాదాపు రూ.లక్ష కోట్ల వరకు పెరగవచ్చని అంచనా. తూర్పు గోదావరి జిల్లా అంగుళూరులో 844 ఎకరాలు, నేలకోటలో 1096, పరగసానిపాడులో 172, గొందూరులో 1462, గండికోటలో 778, డి రావిలంకలో 582, మంటూరులో 758, మడిపల్లిలో 624, పెనికెలపాడులో 523, దండంగిలో 617, కొండమొదలులో 817, కచ్చులూరులో 941, ఏనుగులగూడెంలో 678, గానుగులగొందిలో 612, గంగంపాలెంలో 720, లింగవరంలో 1105, పెద్దగూడెంలో 839, దామనపల్లిలో 941, కేతనపల్లిలో 1037 ఎకరాల భూమి వీఎస్‌ఎస్‌ల పరిధిలో ఉంది. చట్టప్రకారం సమీపంలోని రిజిస్ట్రార్ కార్యాలయంలో భూముల ధరలను ప్రామాణికంగా తీసుకుని పరిహారాన్ని లెక్కించాల్సివుంది. ఈ విధంగా స్థానిక కోరుకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ మార్కెట్ విలువ ప్రకారం ఎకరానికి రూ.19.5 లక్షలు లెక్కించి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని ఆదివాసీ మహాసభ డిమాండ్ చేస్తోంది. అప్పటి వరకు గ్రామాలు ఖాళీ చేయించరాదని విజ్ఞప్తి చేస్తోంది.
పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించకుండా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నిలుపుదల చేయాలని కోరుతూ ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారుల అయినాపురపు సూర్యనారాయణ జాతీయ మానవహక్కుల కమిషన్‌కు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2007 జూన్ 20న ఇచ్చిన ఆదేశాల మేరకు 276 గ్రామాల నిర్వాసితులకు సహాయ పునరావాసాలు కల్పించకుండా ఖాళీ చేయించరాదని ఆదేశించినట్టు ఆయన తెలిపారు. గ్రామాలను ఖాళీ చేయించకుండా, సహాయ పునరావాసాలు కల్పించకుండా గేట్లు అమరిస్తే తమ గ్రామాలన్నీ మునిగిపోతాయని నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు.
కాగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జగన్మోహన్‌రెడ్డి మొట్టమొదటిసారిగా పోలవరం ప్రాజెక్టును గురువారం సందర్శించనున్నారు. పనుల పరిశీలనతోపాటు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి దృష్టికి భూ సమస్యలను తీసుకువెళ్లడానికి పలువురు ప్రయత్నిస్తున్నారు.