ఆంధ్రప్రదేశ్‌

సూటిగా... స్పష్టంగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 20: ఎటువంటి ఉపోద్ఘాతాలు... ఊకదంపుడు ఉపన్యాసాలు లేకుండా, సూటిగా... స్పష్టంగా మాట్లాడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘పోలవరం’ ప్రాజెక్టు నిర్మాణంపై ఒక స్పష్టతను తీసుకువచ్చారు. తొలిసారిగా గురువారం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి అక్కడే జలవనరుల శాఖ అధికార్లతో నిర్మాణ పనుల తీరుపై సమీక్షించారు. ఆమూలాగ్రం పనులను పరిశీలించిన ఆయన తనదైన శైలిలో అధికారులను ప్రశ్నించి, సమాధానాలు రాబట్టారు. సుతిమెత్తగానే అన్ని అంశాలపై సూటిగా మాట్లాడి అధికారులకు చెమటలు పట్టించారు. కొంత ఆలస్యమైనా తనకు చెప్పిన తేదీకి పనులు పూర్తయ్యేలా కార్యాచరణ తెలియజేయాలని ఆదేశించారు. 2018లోనే గ్రావిటీ ద్వారా నీరిస్తామని, తదనంతరం 2019 ఖరీఫ్‌కు, ఆ తర్వాత డిసెంబర్‌కు గ్రావిటీ ద్వారా నీరిచ్చి, 2020 చివరకు ప్రాజెక్టు పూర్తిచేస్తామని గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వివిధ సందర్భాల్లో ప్రకటించిన సంగతి విదితమే. అయితే నీటి సరఫరాలకు ప్రధానమైన కుడి, ఎడమ ప్రధాన కాలువలపై స్ట్రక్చర్ల నిర్మాణం పూర్తికాకపోవడం, కనెక్టివిటీ పూర్తకాకపోవడం తదితరాల దృష్ట్యా నీరు ఎలా ఇస్తారని అందరిలోనూ సందేహాలు వ్యక్తమయ్యేవి.
తన తొలి సమావేశంలోనే పనులు ఎప్పటికి పూర్తవుతాయో కచ్చితంగా లెక్కించి చెప్పాలని, ఇందులో ఒత్తిడేమీ లేదని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికార్లకు సూచించారు. అధికారులు స్పష్టమైన సమాచారంతో నాయకులకు మార్గదర్శనం చేయాలని, గడియకో మాట చెప్పే తీరు పద్ధతి కాదన్నారు. ఒకసారి ప్రకటిస్తే అది జరిగి తీరాలనేది తన పద్ధతి అని గుర్తించాలని తన తీరును అధికార్లకు స్పష్టంచేశారు. దీనిపై స్పందించిన అధికారులు 2021 జూన్ నాటికి ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేయగలమని ప్రకటించారు. అలాగే అప్పటి నుండి మరో పది నెలల్లో పోలవరం జలవిద్యుత్ కేంద్రాన్ని పూర్తిచేస్తామని ప్రకటించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి నాణ్యతలో రాజీపడకుండా ప్రకటించిన సమయానికి పూర్తిచేయాలని ఆదేశించారు.
ఇదేం పనుల తీరు...
గతంలో పనులు జరిగిన తీరును సమీక్షించిన ముఖ్యమంత్రి జగన్ నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను వ్యక్తంచేశారు. స్పిల్ వే, కాఫర్ డ్యాం పనులను ఒకే సమయంలో కొనసాగేలా చేసి, ఏదీ పూర్తికాకుండా చేశారని అసంతృప్తి వ్యక్తంచేశారు. దీనివల్ల రానున్న వరదల సమయంలో ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతుందో ఊహించలేమన్నారు. ఏదో ఒకపని అయితే పూర్తయివుండేదన్నారు. రెండూ చేయడం వల్ల ఏదీ పూర్తికాలేదన్నారు. 2014 నుంచి 2019 వరకు ఏం పనులు, ఎంతెంత మేర జరిగాయో కచ్చితమైన నివేదిక తనకు కావాలని అధికార్లను ఆదేశించారు. అలాగే జూలై నుంచి అక్టోబర్ వరకు వరదల సమయమైనందున ప్రధాన పనులేవీ జరిగే అవకాశం లేదని, ఆ సమయంలో ఏమేం పనులు చేపడతారో తెలపాలని కోరారు.
అలాగే వరదలు పూర్తయ్యాక నవంబర్ నుంచి స్పిల్ ఛానల్, స్పిల్‌వే, గేట్లు అమరిక వంతి పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. నవంబర్ నుంచి వచ్చే ఏడాది వరదల సీజను వరకు ఉన్న ఏడు నెలల కాలంలో ఏమేం పనలు చేపడతారో కార్యాచరణ రూపొందించాలని, అలాగే ఒక్కో నెలకు ఎంతమేర పనులు పూర్తవుతాయి, ఆ పనులకు ఎంత మొత్తంలో నిధులు అవసరమో కచ్చితమైన సమాచారం తనకు ఇవ్వాలని ఆదేశించారు.
ఇళ్ల నిర్మాణానికి నిర్వాసితులకే నగదు ఇస్తే...
నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణంలో జాప్యం, నాణ్యతపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో వారికే నగదు అందించి, నిర్మాణం చేసుకోవాలని సూచిస్తే ఎలా ఉంటుందో ఆలోచించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రానున్న ఏడు నెలల్లో 41.5 ప్లస్ కాంటూరు పరిధిలో 113 ఆవాసిత ప్రాంతాలకు సంబంధించి నిర్వాసితులకు పునరావాసం పూర్తిచేయాల్సివుందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. ఇలా ఒక్కొక్కటిగా ప్రాజెక్టు నిర్మాణంలోని ప్రతీ అంశాన్నీ స్పృశించిన జగన్మోహన్ రెడ్డి తన తీరును అధికారులకు చెప్పకనే చెప్పారు. మొత్తం మీద పోలవరం ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తన తొలి అడుగు విజయవంతంగా వేశారని చెప్పవచ్చు.

చిత్రాలు.. . మ్యాప్ ద్వారా పోలవరం పనులను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి వివరిస్తున్న అధికారులు
*అధికారులతో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి