ఆంధ్రప్రదేశ్‌

కూల్చివేతలు కొనసాగుతాయా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), జూన్ 24: అక్రమంగా, అవినీతితో, లోకాయుక్త సూచనలను పట్టించుకోకుండా, పర్యావరణ పరిరక్షణను కాదని ప్రజావేదికను నిర్మించారని దానిని మరో రెండు రోజుల్లో కూల్చివేస్తామని కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రకటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ అవసరాల కోసం నిర్మించిన ఈ ప్రజావేదిక కేంద్రంగా గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు, చర్చలు జరుగుతున్న నేపథ్యంలో సోమవారం సీఎం జగన్ చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. నదీ పరీవాహక ప్రాంతంలో నిర్మించిన అక్రమ కట్టడాలన్నింటినీ కూల్చి వేస్తామని హెచ్చరించే క్రమంలో ప్రథమంగా ప్రజావేదికతోనే మొదలు పెడుతున్నామని సీఎం చేసిన ప్రకటన ప్రస్తుతం చర్చనీయాంశమయింది. అయితే కేవలం ప్రభుత్వానికి చెందిన ప్రజావేదికను మాత్రమే కూల్చుతారా, లేక నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న అన్ని కట్టడాలను కూల్చుతారా అనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది. ఎందుకంటే ఏళ్ల నుండి కృష్ణా తీరంలో ఉన్న కట్టడాలు అక్రమ కట్టడాలే అంటూ గతంలో పలువురు కోర్టులను ఆశ్రయించారు. ఆందోళనలు కూడా చేశారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో దేవినేని ఉమామహేశ్వరరావు నదీ గర్భంలో ఉన్న ఒక కట్టడంపై పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అయితే అధికారంలోనికి వచ్చాక దానిపై నోరు మెదపలేదు. అదే సమయంలో ఆయా కట్టడాలకు సంబంధించిన యజమానులు కట్టడాలకు సంబంధించి పంచాయితీ, ఉడా అనుమతులు ఉన్నాయంటూ ముందుకు వచ్చారు. ఇదే నిజమైతే ఇప్పుడు ప్రభుత్వం ఒక్క ప్రజావేదికనే కూల్చి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించేందుకు ప్రతిపక్షానికి అవకాశం కల్పిస్తుందా లేక అన్నింటిపైనా చర్యలు తీసుకుంటుందా అని చర్చ జరుగుతోంది. నదీ ప్రవాహం కారణంగా గ్రామాలు ముంపునకు గురి కాకుండా అప్పట్లో కృష్ణానదీ పరివాహ ప్రాంతం పరిధిలో సుమారు 97 కిలో మీటర్ల మేర కృష్ణా కరకట్టను ఎంతో పగడ్బందీగా నిర్మించారు. అయితే ఏళ్లు గడుస్తున్న కొద్ది నదీ పరివాహక ప్రాంతాల్లో భవనాలు, ఇళ్ల నిర్మాణాలు జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. ప్రకాశం బ్యారేజీ నుండి మొదలు పెడితే అన్ని కట్టడాలు ప్రముఖులకు చెందినవే. ప్రజావేదికతోపాటు నదీ పరివాహక ప్రాంతాల్లో ముఖ్యమైన వ్యక్తులకు చెందిన 21 కట్టడాలున్నాయి. అందులో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలతో పాటు ప్రకృతి వైద్యం అందించే వైద్యశాలలు కూడా ఉన్నాయి. ఇవి దేశ వ్యాపంగా ఎంతో ప్రాచుర్యం పొందినవి కూడా. మొదటిగా గణపతి సచ్చిదానంద అవధూత పీఠంతో పాటు ఇస్కాన్ ఆశ్రమం, తులసీ వనం, చిగురు బాలల ఆశ్రమంతో పాటు మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం కూడా ఇక్కడే ఉంది. అదే విధంగా పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారులు, వైద్యులు, ఇతర ప్రముఖులకు చెందిన గెస్ట్ హౌస్‌లు ఇక్కడే వరుసగా ఉన్నాయి. వీటితో పాటు ఇస్కాన్ ఆశ్రమం, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివసిస్తున్న భవనం, రివర్ వ్యూ గెస్ట్ హౌస్‌లు కూడా ఉన్నాయి. ఎప్పటి నుండో ఉన్న ఈ కట్టడాలను కూల్చి వేసేందుకు ఇప్పటివరకు ఏ ప్రభుత్వమూ ముందుకు రాలేదు. అయితే ప్రజావేదిక ప్రభుత్వ సొమ్ముతో కట్టింది కాబట్టి దానిని కూల్చుతారే తప్పించి, మిగతా వాటి జోలికి వెళ్లరని విశే్లషకులు చెబుతున్నారు.