రాష్ట్రీయం

శ్రీశైలంలోకి గోదావరి సాధ్యమేనా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూన్ 30 : సాగునీటి కష్టాలు ఎదురవుతున్న నేపథ్యంలో శ్రీశైలం జలాశయంలోకి తెలంగాణ నుంచి గోదావరి జలాలను తరలించడం సాధ్యమేనా అనే అనుమానాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అంతేగాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీలో శ్రీశైలం జలాలు కేవలం సాగునీటికి మాత్రమే వినియోగించుకోవాలని గేట్లు ఎత్తే అవకాశం ఉన్నపుడు మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పెట్టిన ప్రతిపాదనలకు తెలంగాణ సీఎం కే.చంద్రశేఖర్‌రావు అంగీకరిస్తారా అన్న ప్రశ్నలపై రైతుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను తరలించడం ద్వారా రెండు పెద్ద నదులను అనుసంధించామని గత ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంది. నాడు పట్టిసీమను వ్యతిరేకించిన ప్రస్తుత సీఎం జగన్ తాజాగా అదే ప్రాజెక్టును వినియోగించి కృష్ణా డెల్టాకు నీటిని అందించేందుకు అంగీకరించడాన్ని టీడీపీ గర్వంగా చెప్పుకుంటోంది. ఈ నేపథ్యంలో కృష్ణా, గోదావరి నదులను అనుసంధానించి శ్రీశైలం జలాశయంలోకి గోదావరి జలాలను తరలించాలని ఉభయ రాష్ట్రాల ప్రతిపాదనలు ఇప్పుడు జనంలో చర్చకు దారి తీశాయి. అయితే మహారాష్ట్ర నుంచి తెలంగాణ సరిహద్దుల్లో అడుగిడిన తరువాత గోదావరి జలాలు పూర్తిగా తగ్గిపోతాయని సాగునీటి రంగ నిపుణులు వెల్లడిస్తున్నారు. గోదావరిపై మహారాష్టల్రో నిర్మించిన ప్రాజెక్టుల కారణంగా తెలంగాణకు గోదావరి చేరే సమయానికి వరద నీరు గణనీయంగా తగ్గిపోతుందని వెల్లడిస్తున్నారు. గోదావరి నదికి తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా సరైన నీరు లభ్యం కాదని వారంటున్నారు. అంతేగాక నదీ పరివాహక ప్రాంతాల్లో కురిసే వర్షాల ద్వారా కూడా గోదావరి నదిలోకి నీరు చేరడం అతి తక్కువగా ఉంటుందని పేర్కొంటున్నారు. దీని కారణంగా భద్రాచలం వరకూ ఎగువ మహారాష్టల్రో కురిసే వర్షాల ఆధారంగా గోదావరి వరద ఆధారపడి ఉందని స్పష్టం చేస్తున్నారు. అయితే గోదావరి నది ఖమ్మం, పశ్చిమగోదావరి జిల్లా సరిహద్దులో ఆంధ్రప్రదేశ్‌లో అడుగిడిన తరువాత ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌ఘడ్ అడవుల్లో కురిసే ప్రతి వర్షం చినుకు గోదావరిలోకి వచ్చి చేరుతుందని వారంటున్నారు. గోదావరి రాష్ట్రంలో అడుగుపెట్టిన చోట నుంచి దాదాపు రాజమండ్రి నగరం వరకూ ఉన్న అటవీ ప్రాంతంలో ఉన్న పెద్ద, ఉప నదులన్నీ గోదావరిలో కలిసేవేనని వారంటున్నారు. దీని కారణంగా గోదావరి నదిలో వరద నీరు తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువగా లభ్యమవుతాయని వారంటున్నారు. ఈ నేపథ్యంలో గోదావరి జలాలను తెలంగాణ నుంచి శ్రీశైలం తరలించే ప్రక్రియపై పూర్తి అధ్యయనం చేసిన తరువాతే స్పష్టమైన నిర్ణయానికి రావడానికి వీలవుతుందని స్పష్టం చేస్తున్నారు. గోదావరి నుంచి శ్రీశైలం జలాశయానికి నీటిని తరలించడానికి ఆంధ్రప్రదేశ్ ఆసక్తి చూపుతుండగా తెలంగాణ నాగార్జున సాగర్ జలాశయానికి తరలించి అక్కడి నుంచి శ్రీశైలం జలాశయానికి తరలించాలన్న ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది. అయితే మధ్యే మార్గంగా గోదావరి నుంచి శ్రీశైలం జలాశయ సరిహద్దుల వరకూ ఒక కాలువ అక్కడి నుంచి నాగార్జున సాగర్ వరకూ మరో కాలువ ద్వారా నీటిని తరలించాలని రాష్ట్ర అధికారులు సూచిస్తున్నారు.
ఈ పనులు ఎప్పుడు ప్రారంభించాలి ఎప్పటికి పూర్తవుతాయన్నది ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉందని సాగునీటిరంగ నిపుణులు పేర్కంటున్నారు. కాగా శ్రీశైలం జలాశయం నుంచి విద్యుత్ ఉత్పత్తిని ఇరు రాష్ట్రాలు పూర్తిగా చేపట్టకూడదని ఏపీ సీఎం జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సూచించారు. దీని కారణంగా శ్రీశైలంలో ఉన్న కొద్ది నీరు పూర్తిగా సాగునీటి రంగానికి వినియోగించుకోవచ్చన్నది ఆయన అభిప్రాయంగా అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఇందుకు కేసీఆర్ ఏ మేరకు అంగీకరిస్తారన్నది ప్రశ్నార్థకమేనని అనుమానిస్తున్నారు. తెలంగాణకు సాగునీటి ప్రయోజనాలు శ్రీశైలం జలాశయం కంటే నాగార్జున జలాశం నుంచే ఎక్కువగా ఉన్నాయని వెల్లడిస్తున్నారు. ఈ కారణంగా శ్రీశైలంలో నిల్వ చేసే అత్యధిక నీటి శాతం ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రయోజనాలకు వినియోగించుకుంటారని, దీని వల్ల తెలంగాణకు ఎలాంటి లబ్ధి లేకపోవడమేనని వారు స్పష్టం చేస్తున్నారు. ప్రజల ప్రశ్నలు, అనుమానాలకు తెరదించాలంటే మరి కొద్దిరోజులు వేచి చూసి పూర్తిగా రెండు ప్రభుత్వాల అభిప్రాయాలు, నిర్ణయాలు వెలువడాల్సి ఉంటుందని సాగునీటిరంగ నిపుణులు వెల్లడిస్తున్నారు. అంతా సవ్యంగా జరిగితే శ్రీశైలం నుంచి రాయలసీమకు మేలు చేకూరుతుందని వారంటున్నారు.