తెలంగాణ

కరీంనగర్‌లో ఆధునిక హంగులతో ఆసుపత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూలై 3: పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా నిరుపేదలకు కార్పొరేట్‌కు దీటుగా మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కరీంనగర్ ప్రభుత్వ ప్రధానాసుపత్రిని ఆధునిక హంగులతో 500 పడక గదులకు పెంచనున్నట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం కరీంనగర్ కేంద్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిని జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, అధికారులతో కలిసి ప్రస్తుతం వినియోగంలో ఉన్న భవనంతో పాటు నూతనంగా నిర్మిస్తున్న భవనాలను మంత్రి ఈటల పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న 350 పడకల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో పాత భవనాన్ని కూల్చినచోట నూతన భవనాన్ని ఏడాదిలోగా నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినట్టు మంత్రి చెప్పారు. 350 పడకల ఆసుపత్రిని నూతనంగా 500 పడకల భవనంగా ఆధునిక హంగులతో నిర్మించనున్నట్టు తెలిపారు. అంతేకాకుండా 150 పడకల మాతా, శిశు కేంద్రానికి అదనంగా 100 పడకల ఆసుపత్రి భవనాన్ని నిర్మించేందుకు నిధులు విడుదల చేసినట్టు వెల్లడించారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి కరీంనగర్ ప్రభుత్వ ప్రధానాసుపత్రికి మెరుగైన వైద్యం కోసం వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని, అవసరమైన వైద్యులను నియమించనున్నట్టు మంత్రి తెలిపారు. కరీంనగర్ ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన వైద్యసేవలు అందుతున్న దృష్ట్యా ఉమ్మడి జిల్లా ప్రజలే కాకుండా ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, ఆసిఫాబాద్ ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ స్థాయిలో రోగుల తాకిడి పెరిగిన దృష్ట్యా ఈ ఆసుపత్రిని ఆధునిక హంగులతో నూతన భవనం నిర్మాణం, అదనపు పడక గదుల విస్తరణతో ఏడాదిలోగా పూర్తి చేయనున్నట్టు మంత్రి తెలిపారు. ప్రధానాసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డులకు వేతనాలు పెంచాలని మంత్రికి మొరపెట్టుకోగా సానుకూలంగా స్పందించిన ఆయన వేతనాలు పెంచడంతో పాటు పిఎఫ్ బకాయిలు ఇప్పిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అంతకుముందు ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి తనిఖీకి వస్తే తప్ప ఆసుపత్రులు పరిశుభ్రం చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టరేమోనని, ప్రతి రోజు మంత్రులు ఆసుపత్రులను పర్యటిస్తే మరింత బాగుంటుందనని రోగులు, వారి బంధువులు చర్చించుకోవడం గమనార్హం.

చిత్రం...వైద్య సేవలపై డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్న మంత్రి ఈటల రాజేందర్