జాతీయ వార్తలు

ఎట్టకేలకు కర్నాటక కేబినెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఆగస్టు 20: కర్నాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మూడు వారాల తర్వాత యడియూరప్ప మంగళవారం తన మంత్రివర్గాన్ని విస్తరించారు.
మొత్తం 17 మందికి ఇందులో చోటుకల్పించారు. రాష్ట్ర మంత్రివర్గం వన్‌మ్యాన్ షోగానే నడుస్తోందంటూ ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో యడియూరప్ప మంత్రివర్గ విస్తరణపై దృష్టిపెట్టారు. ఇందులో మంత్రి పదవులు పొందినవారిలో 16 మంది బీజేపీ సభ్యులే కాగా, ఇండిపెండెంట్ సభ్యుడు హెచ్.నగేష్ కూడా ఉన్నారు. వీరందరితో రాజ్‌భవన్‌లో గవర్నర్ రాజూభాయ్ వాలా పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. కేబినెట్‌లో స్థానం పొందినవారిలో మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్, మాజీ ముఖ్యమంత్రులు కేఎస్ ఈశ్వరప్ప, ఆర్. అశోక్ కూడా ఉన్నారు. ఇటు అసెంబ్లీలోగానీ, అటు మండలిలోగానీ సభ్యుడేకాని లక్ష్మణ్ సంగప్పకు కూడా కేబినెట్‌లో చోటు లభించింది. అలాగే ఎమ్మెల్సీకి కోట శ్రీనివాస పూజారికీ పదవి దక్కింది. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో నలుగురు మొదటిసారి మంత్రి పదవులు పొందిన వారు కావడం గమనార్హం.
ఈ కేబినెట్ విస్తరణలో బీజేపీకి బలమైన ఓటుబ్యాంకుగా భావిస్తున్న లింగాయత్‌లకు మెజారిటీ వాటా లభించింది. మొత్తం 17 మందిలో ఏడుగురు లింగాయత్ వర్గాలకు చెందినవారు కావడం గమనార్హం. ముఖ్యమంత్రితో సహాయ మంత్రివర్గంలో లింగాయత్‌ల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. మిగిలినవారిలో ముగ్గురు ఒక్కలింగాలు కాగా, మరో ముగ్గురు ఎస్సీ, ఇద్దరు ఓబీసీ, ఒకరు షెడ్యూల్ తెగలు, మరొకరు బ్రాహ్మణ కులానికి చెందినవారు.
అనుకున్న విధంగానే మంత్రివర్గ విస్తరణ జరిగినప్పటికీ సంగప్పకు చోటు లభించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. త్వరలో జరుగనున్న అథాని అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా అతనిని నిలబెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. బంజారా తెగకు చెందిన ప్రభు చవాన్ ప్రమాణ స్వీకారానికి ఆకర్షణీయ దుస్తుల్లో రావడం అందర్నీ ఆకట్టుకుంది.

చిత్రం...ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మంత్రులతో కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప, గవర్నర్ రాజూభాయ్ వాలా