ఆంధ్రప్రదేశ్‌

రైతుల ప్రయోజనాలు పరిరక్షిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రైతుల ప్రయోజనాలను పరిరక్షించాలని, విద్యుత్ టారిఫ్ నిర్ణయంలో ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఏపీఈఆర్సీ) చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి తెలిపారు. వినియోగదారులు, రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు, విద్యుత్ సంస్థల్లో జవాబుదారీతనాన్ని మెరుగుపరిచేందుకు కమిషన్ చర్యలు ప్రారంభించిందని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్ టారిఫ్ నిర్ణయంపై ప్రజాభిప్రాయ సేకరణ ముగిశాక కమిషన్ ఈమేరకు చర్యలకు ఉపక్రమించింది. ఈనేపథ్యంలో ఆదివారం ఆయన అధికారులతో మాట్లాడుతూ విద్యుత్ టారిఫ్‌పై వివిధ వర్గాల ప్రజలు అభిప్రా య సేకరణలో పాల్గొనడం తనకు సంతోషంగా ఉందని చెప్పా రు. విద్యుత్ టారిఫ్‌ల నిర్ణయంలో వారి సలహాలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. వినియోగదారులు ఫిర్యాదు చేసేందుకు వీలుగా అసిస్టెంట్ ఇంజనీర్ కార్యాలయాలు, డిస్కం కార్యాలయాల వద్ద ఫిర్యా దు పెట్టెలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేసే వ్యవస్థను అందరూ ఉపయోగించుకోలేక పోవచ్చన్నారు. అధికారుల్లో జవాబుదారీతనాన్ని, వ్యవస్థలో పారదర్శకతను తెచ్చేందుకు ఈ చర్య దోహదపడుతుందన్నారు. వినియోగదారులు సంతృప్తి చెందేలా ఫిర్యాదులపై వేగంగా స్పందించాలన్నారు. విద్యుత్ వ్యవస్థలో తామూ భాగమనే అభిప్రాయం కలిగేలా వినియోగదారులతో అధికారులు, ఉద్యోగులు మమేకం కావాలని పిలుపునిచ్చారు. విద్యుత్ టవర్లు, హైటెన్షన్ లైన్ల నిర్మాణానికి భూములు సేకరించే
సమయంలో తప్పనిసరిగా రైతులను ఒప్పించి, వారి అనుమతితోనే పొందాలని స్పష్టం చేశారు. ప్రజాప్రయోజనాల కోసం భూమిని సేకరించే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ, జీవనాధారమైన భూమిని కోల్పోవడం రైతులకు బాధాకరమని గుర్తించాలన్నారు. కుటుంబ అవసరాలు తీర్చుకునేందుకు తమ భూమిపై వచ్చే ఆదాయం పైనే రైతులు ఆధారపడతారన్నారు. రైతులు తమ జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఉండకూడదని చెప్పారు. ఇలాంటి సందర్భాల్లో రైతులకు న్యాయం జరిగేలా జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించాలని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ను ఆదేశించారు. రైతులకు నష్టపరిహారం నిర్ణయించడం, చెల్లింపుల్లో జాప్యం లేకుండా చూడాలన్నారు.
ప్రమాదాల నివారణపై దృష్టి
విద్యుత్ ప్రమాదాలపై కూడా దృష్టి సారించాలని ఇంధన శాఖ కార్యదర్శికి జస్టిస్ నాగార్జునరెడ్డి సూచించారు. ఈ ప్రమాదాలను కనిష్ట స్థాయికి తెచ్చేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో విద్యుత్ వైర్లు తెగిపోవడం, వేలాడటం వల్ల ఎవరూ విలువైన ప్రాణాలు కోల్పోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రూరల్ ఎలక్ట్రిక్ కో-ఆపరేటివ్ సొసైటీ (రెక్స్)లను డిస్కంలలో విలీనం చేసేందుకు ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నట్లు వెల్లడించారు. డిస్కంల పనితీరు మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు చేపడతామన్నారు. విద్యుత్ సంస్థలు, వినియోగదారులు తమ కమిషన్‌కు రెండు కళ్ల వంటివని, రెండింటి మధ్య సమతూకం పాటిస్తామని చెప్పారు. 50వేల కొత్త వ్యవసాయ కనెక్షన్ల లక్ష్యాన్ని మార్చిలోగా పూర్తి చేయాలన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో నిరంతర విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం చేస్తున్న కృషిని వినియోగదారుల దృష్టికి తీసుకెళ్లినందుకు అధికారులను జస్టిస్ నాగార్జునరెడ్డి అభినందించారు.

'చిత్రం... ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జునరెడ్డి