రాష్ట్ర వార్తలు

సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా మళ్ళీ బివి రాఘవులు

  • 05/02/2012

ఖమ్మం, ఫిబ్రవరి 4: సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా బివి రాఘవులు మరోసారి ఎన్నికయ్యారు. 1997లో నల్గొండలో జరిగిన రాష్ట్ర మహాసభల్లో తొలిసారి రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన ఆయన తరువాత వరంగల్, అనంతపురంలలో జరిగిన రాష్ట్ర మహాసభల్లోనూ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగారు. ఖమ్మంలో జరుగుతున్న మహాసభల్లో ఆయనను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తున్నారని ప్రచారం జరిగినప్పటికీ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పార్టీ అభివృద్ధి దృష్ట్యా మరోసారి రాఘవులునే రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకోవాలని రాష్ట్ర మహాసభ భావించి తిరిగి ఏకగ్రీవంగా ఎన్నుకుంది. కాగా రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా పాటూరి రామయ్య, తమ్మినేని వీరభద్రం, పి మధు, ఎస్ పుణ్యవతి, ఎంఏ గఫూర్, వి కృష్ణయ్య, వై వెంకటేశ్వరరావు, సిహెచ్ నర్సింగరావు, ఎస్ వీరయ్య, సారంపల్లి మల్లారెడ్డి, సిహెచ్ సీతారాములు, జి నాగయ్య, మిడియం బాబురావు, సి రాములు ఎన్నికయ్యారు. వీరితోపాటు మరో 66మందిని రాష్ట్ర కమిటీ సభ్యులుగా, ఐదుగురిని ప్రత్యేక ఆహ్వానితులుగా ఎన్నుకున్నారు. రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్‌గా బిఆర్ తులసీరావు, సభ్యులుగా హరికిశోర్, రత్నమాలను ఎన్నుకున్నారు. గత కమిటీలోని వి శ్రీనివాసరావు, జక్కా వెంకయ్యలను తొలగించి వారి స్థానంలో మిడియం బాబురావు, రాములును ఎన్నుకున్నారు.
ఐక్యతకే ప్రాధాన్యం: రాఘవులు
సోదర కమ్యూనిస్టు పార్టీలతో వైరుధ్యాలకంటే ప్రజాసమస్యలపై ఐక్యంగా కలిసి పోరాడేందుకే ప్రాధాన్యమిస్తామని తిరిగి రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన అనంతరం బివి రాఘవులు మీడియా సమావేశంలో చెప్పారు. మూడురోజుల పాటు ఖమ్మంలో జరిగిన రాష్ట్ర మహాసభల్లో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. మద్యం మహమ్మారిని పారదోలేందుకు సమగ్ర చట్టం తేవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ చార్జీలు పెంచితే 2000వ సంవత్సరం తరహా ఉద్యమం మరోసారి పునరావృతం అవుతుందని హెచ్చరించారు. ప్రజాసమస్యలపై శాసనసభలో కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగంపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని అవలంబించాలని, ప్రజలను ఆదుకునేందుకు ప్రయత్నించాలని, లేనిపక్షంలో ప్రజలందరినీ సమీకరించి ఆందోళనలు చేస్తామని రాఘవులు హెచ్చరించారు.

Add new comment

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading