డైలీ సీరియల్

యమహాపురి 50

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలీసులు నాకోసం వెదుకుతున్నారు. వాళ్లకి ఆసరాగా పేపర్లో నా ఫొటో కూడా వచ్చింది..’’ రాజా గొంతు వానాకాలపు మేఘంలా ధ్వనించింది.
రాణి అతడిమీద జాలి పడుతూనే ఆ విషయమై తీవ్రంగా ఆలోచిస్తోంది. ఉన్నట్లుండి, ‘ఐడియా’ అంది.
‘ఏమిటది?’’ ఆశగా అడిగాడు రాజా.
‘‘నువ్వు మా ఊరెళ్లి మా ఇంట్లో కొన్నాళ్లుండు. పోలీసులు అడుగెట్టలేని చోటది. ప్రస్తుతానికి యమ కూడా అక్కడ లేడు. ఆయనొచ్చేలోగా నీకు కాస్త ఊపిరి పీల్చుకునే సమయం వస్తుంది’’ అంది రాణి.
‘‘మీ ఊరంటే నరకపురి. అక్కడకి ఎవర్ని పడితే వారిని రానివ్వరుగా!’’ అన్నాడు రాజా.
‘‘నువ్వు నా పేరు చెప్పుకుని మా బంధువుగా వెళ్లు. నిదర్శనంగా పేపర్లో ఈ ఫోటో చూపించు. మా వాళ్లకి మన కథంతా చెప్పు. వాళ్లు నిన్ను బాగానే ఆదరిస్తారులే’’ అంది రాణి.
రాజా ఆలోచనలో పడ్డాడు.
‘‘ఇప్పటికి ఇంతకుమించిన ఉపాయం లేదు. ఐనా ఇదంతా దైవనిర్ణయంలా వుంది. జగదానందస్వామి దీవెన నిన్ను నరకపురికి పంపుతోంది. ఏదో అద్భుతం జరుగుతుందని నాకు ఆశగా ఉంది’’ అంది రాణి.
రాజా ఆలోచిస్తూనే, ‘‘అమ్మనీ, తమ్ముణ్ణీ వదిలేసి వెళ్లలంటే నాకింకా మనస్కరించడం లేదు’’ అన్నాడు.
‘‘నేనిక్కడే ఉంటానుగా. నీ వాళ్ల గురించి ఎప్పటికప్పుడు నీకు చెబుతూంటాను. కానీ నిన్ను కాంటాక్ట్ చెయ్యడం..’’ నసిగింది రాణి.
‘‘నువ్విందాకా హాస్టల్నించి చేసిన నంబరు నేను సేవ్ చేసుకుంటాను. దానితో నిన్ను కాంటాక్ట్ చేస్తాను. ఇక నరకపురిలో నేను మొబైల్ వాడ్డం ఎలాగంటావా, నువ్వన్నట్లు ఏదో అద్భుతం జరగక్కపోదులే’’ అన్నాడు రాజా.
****
‘‘అంటే రాజా ఇప్పుడు నరకపురిలో ఉన్నాడన్నమాట!’’ అంది వసంత.
‘‘ఔను మేడమ్!’’ అంది రాణి.
‘‘తర్వాత నిన్ను కాంటాక్ట్ చేశాడా?’’ అడిగింది వసంత కుతూహలంగా.
‘‘చేశాడు మేడమ్!’’
‘‘ఎలా?’’ ఆశ్చర్యంగా అడిగింది వసంత.
‘‘ఏం మాయ చేశాడో అక్కడ! యధేచ్చగా మొబైల్ వాడుతున్నాడు. అస్తమానూ హాస్టల్ ల్యాండ్ లైనెందుకులే అని- నిన్ననే మొబైల్ ఒకటి కొన్నాను’’ అంది రాణి.
‘‘మొబైల్ కొనడానికి నీకు డబ్బిబ్బంది లేదా?’’ తటపటాయిస్తూనే అడిగింది వసంత.
‘‘ఏమనుకుంటున్నారు మేడమ్! నన్ను చదివిస్తున్నది యమ. నా సమస్య స్వేచ్ఛ. డబ్బు కాదు’’ అంది రాణి.
వసంత లేచి నిలబడింది. ‘‘నువ్విచ్చిన సమాచారానికి థాంక్స్. దీనివల్ల ప్రయోజనమేమిటో మావారు చెప్పాలి. నీకు మానుంచి ఆశించినదానికంటే ఎక్కువ సహాయమే లభిస్తుందని నా నమ్మకం. ముందు ముందు కాంటాక్ట్‌కి నీ మొబైల్ నంబరివ్వు’’ అంది వసంత.
రాణి తన మొబైల్‌లో వసంత నంబరు ఫీడ్ చేసుకుని ఆ నంబరుకి ఓ మిస్డ్ కాల్ ఇచ్చింది.

10
సన్నగా పొడవుగా ఉన్న ఆ యువకుడు నరకపురి చెక్‌పోస్ట్ ముందాగాడు. వయసు ఇరవైకీ, పాతిక్కీ మధ్య ఉండొచ్చు. బూడిద రంగు పాంట్‌మీద లేత నీలం టీషర్టు వేసుకున్నాడు. చదువుకున్న మధ్య తరగతివాడిలా ఉన్నాడు. అతడి భుజానికి ఓ సంచీ వ్రేలాడుతోంది.
చెక్‌పోస్టు దగ్గిర పొట్టిగా నల్లగా వికారంగా యమభటుడిలా నిలబడి ఉన్నాడు అప్పన్న.
యువకుణ్ణి చూసి ‘‘ఎవర్నువ్వు?’’ అన్నాడు.
‘‘నా పేరు రాజా’’ అన్నాడు యువకుడు.
‘‘నువ్వు మా ఊరివాడివి కాదు. నీకు మా ఊళ్ళో ఏం పని?’’ అన్నాడు అప్పన్న.
యువకుడు క్రాపు సవరించుకుని ‘యమ నన్ను ఒక ప్రత్యేకమైన పనిమీద పంపాడు’’ అన్నాడు.
అప్పన్న కళ్లు పెద్దవయ్యాయి. వాడు రాజాని నఖశిఖ పర్యంతం చూసి ‘పనేమిటో చెప్పాలి’ అన్నాడు.
‘‘నీకు చెప్పమని ఆయన చెప్పలేదు’’ అన్నాడు రాజా.
‘‘నీ గురించి ఆయన మాకు చెప్పలేదు’’ అన్నాడు అప్పన్న.
‘‘చెప్పకపోతే వెళ్లనివ్వవా? నేను లోపలికి వెళ్లకపోతే ఊరికి అనర్థం జరుగుతుంది. యమ తిరిగొచ్చాక ఆయనకి ఏం సంజాయిషీ ఇచ్చుకుంటావో నీ ఇష్టం. నేను వెడుతున్నాను’’ అంటూ రాజా వెనక్కి తిరిగాడు.
అప్పన్న తడబడ్డాడు. ‘‘ఏయ్, వెళ్లిపోకు’’ అన్నాడు.
‘‘మరి నన్ను లోపలకి వెళ్లనిస్తావా?’’ అన్నాడు రాజా.
‘‘మా ఊళ్ళో నీకెవరైనా తెలుసా?’’ అన్నాడు అప్పన్న సాలోచనగా.
‘‘ఊ.. ఆమె పేరు రాణి. కానీ ఆమె ఊళ్ళో లేదు. పట్నంలో చదువుతోంది’’ అన్నాడు రాజా.
‘‘రాణి అంటే ఎవరు?’’ అన్నాడు అప్పన్న తనకి తెలియనట్లు.
‘‘ఇదిగో, ఈ ఫొటో చూడు’’ అంటూ రాజా తన సంచీలోంచి ఓ పేపర్ కటింగ్ తీసి చూపించాడు.
అప్పన్న అది చూస్తుంటే- ‘‘జగదానందస్వామి అని ఓ మహానుభావుడు పట్నం వచ్చి ఓ సభ చేశాడు. ఆ సభకి రాణి, యమ కూడా వచ్చారు. స్వామి- నన్నూ మీ ఊరి రాణినీ వేదికమీదకి పిలిచి మా ఇద్దర్నీ కలిపి దీవించాడు. ఆ దీవెన లభించడమంటే దేవుడు దీవించినట్లే! ఆ విషయం యమకి తెలుసు’’ అన్నాడు రాజా.
‘‘ఐతే?’’ అన్నాడు అప్పన్న చిరాగ్గా.
‘‘తన ఊరి అమ్మాయికి జగదానందస్వామి దీవెన లభించిందని యమ తెగ మురిసిపోయాడు. ఆమెతో కలిసి దీవెన పొందానని నన్ను పరిచయం చేసుకున్నాడు. నా మీద ఆయనకి ప్రత్యేకమైన అభిమానం కూడా కలిగింది. తను విదేశ యాత్రకి వెడుతున్నాననీ- రెండు నెలలదాకా తిరిగి రాననీ చెప్పాడు. తను తిరిగొచ్చేదాకా నన్ను నరకపురిలో ఉండమని కోరితే ఆయన మాట కాదనలేక ఇలా వచ్చాను’’ అన్నాడు రాజా.
‘‘నీ కథ చాలా బాగుంది. తను లేనప్పుడు ఇక్కడ నీ అవసరమేమిటిట- దానికీ ఆయన ఏదో చెప్పే ఉంటాడు. చెప్పు’’ అన్నాడు అప్పన్న కాస్త వెటకారంగా.

ఇంకా ఉంది

వసుంధర