రాష్ట్రీయం

నేటి నుంచి భక్తులకు ముందస్తు వసతి సౌకర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 13: వేసవికాలం నేపధ్యంలో శ్రీవారిని దర్శించుకోడానికి తిరుమలకు వచ్చే భక్తులకు వసతి పొందే సులభ సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు టిటిడి ఇఓ డాక్టర్ డి.సాంబశివరావు దృష్టి సారించారు. ఇందులో భాగంగా శనివారం నుంచి ముందస్తు వసతి సౌకర్యాలు పొందే సౌకర్యం కల్పిస్తున్నారు. ఏప్రిల్ పది నుంచి ఇ-దర్శన్ కౌంటర్లలోను, ఏప్రిల్ 14 నుంచి ఇంటర్నెట్ ద్వారా భక్తులు వసతి సౌకర్యాన్ని కూడా కల్పించేందుకు టిటిడి రంగం సిద్ధం చేస్తోంది.

పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు
విజయవాడ డిఆర్‌ఎం అశోక్‌కుమార్
రాజమండ్రి, మార్చి 13: యాత్రికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గోదావరి పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతామని విజయవాడ డివిజినల్ రైల్వే మేనేజర్ అశోక్‌కుమార్ వెల్లడించారు. పుష్కరాలకు కేంద్రబిందువైన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు రైల్వే స్టేషన్లను శుక్రవారం ఆయన తనిఖీచేశారు. ఈసందర్భంగా రాజమండ్రిలో తనను కలిసిన విలేఖర్లతో మాట్లాడారు. పుష్కరాల్లో ఉండే రద్దీకి అనుగుణంగా తగినన్ని రైళ్లు నడుపుతామని, ఎన్ని ప్రత్యేక రైళ్లు నడపాలన్న అంశంపై చర్చిస్తున్నామన్నారు. పుష్కరాల్లో రోజుకు లక్ష మంది ప్రయాణీకులను అదనంగా వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. పుష్కరాల పనులు జూలై నాటికి పూర్తి చేస్తామన్నారు. రాజమండ్రి రైల్వేస్టేషన్‌లో తూర్పురైల్వే బుకింగ్ వైపు 4వ ప్లాట్‌ఫారంతో పాటు, ఎస్కలేటర్, ఫుట్‌ఓవర్ వంతెన నిర్మిస్తున్నామన్నారు. ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా తొక్కిసలాట జరగకుండా స్టేషన్ లోపలికి, బయటికి వెళ్లేందుకు 4 ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే అదనపు టిక్కెట్ బుక్కింగ్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు డిఆర్‌ఎం చెప్పారు. పుష్కరాల్లో గ్రామీణ ప్రయాణీకుల సౌకర్యార్థం కొన్ని స్టేషన్లలో ప్యాసింజర్ రైళ్లకు ప్రత్యేక హాల్టులు కల్పిస్తామన్నారు. అంతకు ముందు ఆయన రాజమండ్రి రైల్వేస్టేషన్‌లోని ఫుట్‌ఓవర్ వంతెన, విఐపి గేటు, తూర్పుబుకింగ్ కౌంటర్, 4వ ప్లాట్‌ఫారం, వెయిటింగ్ హాళ్లు, పుష్కరాల పనులను పరిశీలించారు. పనుల ప్రగతిపై డిఆర్‌ఎం అశోక్‌కుమార్ సంతృప్తి వ్యక్తంచేశారు.
హామీలు మాఫీ చేసే బడ్జెట్

అనంతపురం టౌన్, మార్చి 13: ఎన్నికల హామీలను మాఫీచేసే బడ్జెట్‌ను తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిందని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం అనంతపురంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడ్జెట్ ప్రజల్లో విశ్వాసం కల్పించలేకపోయిందన్నారు. అన్నివర్గాల ప్రజలకు న్యాయం చేయాల్సిన బడ్జెట్‌లో టిడిపి ప్రభుత్వం చేతగానితనాన్ని బయటపెట్టుకుని దద్దమ్మగా మారిందన్నారు. కేంద్రం, రాష్ట్రంలో భాగస్వాములుగా ఉన్న టిడిపి, బిజెపి నిధులు తీసుకురావటంలో వైఫల్యం చెందాయన్నారు. రైతు, డ్వాక్రా, చేనేత రుణాల మాఫీకి నిధుల కేటాయింపు జరగలేదన్నారు. హంద్రీనీవా రెండవదశకు చాలినన్ని నిధుల కేటాయించలేదన్నారు. పోలవరానికి పది వేల కోట్లు ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తే కేంద్రం మొండిచేయి చూపించిందన్నారు. అలాగే పోలవరానికి నిధులు రాబట్టడంలో టిడిపి ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. పట్టిసీమను ఏడు మాసాల్లో పూర్తిచేస్తామనటం నిధులు బొక్కడానికేనని ధ్వజమెత్తారు. పోలవరమే సాగునీటి సమస్యల పరిష్కారానికి శరణ్యమన్నారు. వాటర్‌గ్రిడ్ ఊసేలేదన్నారు. ప్రైవేట్ భాగస్వామ్యంతోనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటూ బడ్జెట్‌లో పేర్కొనడాన్ని రఘువీరా తప్పుబట్టారు. అంగన్‌వాడీల వేతనాలు పెంచుతామని టిడిపి ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొందని, అయితే అధికారంలోకి వచ్చాక మాటమార్చడం క్షమార్హం కాదన్నారు. ఇంటిలో ఉద్యోగం, నిరుద్యోగభృతి తదితర ఎన్నికల హామీల ప్రస్తావనే లేకపోవడాన్ని బట్టి చూస్తే ఏరుదాటిన తర్వాత తెప్ప తగలేసిన చందంగా ఉందన్నారు. గవర్నర్ ఉపన్యాస సారాంశాన్ని ప్రభుత్వ బడ్జెట్ ప్రతిబింబించలేదన్నారు. ప్రతిపక్షాలు బడ్జెట్‌ను వ్యతిరేకించి సవరణలు జరిగేలా చూడాలని ఆయన కోరారు.
అంగన్‌వాడీల ఆందోళనకు రఘువీరా మద్దతు
న్యాయమైన డిమాండ్ల కోసం అనంతపురం నగరంలో అంగన్‌వాడీలు చేపట్టిన ఆందోళనకు పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి మద్దతు పలికారు. శుక్రవారం నగరంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీలు సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనకు రఘువీరా సంఘీభావం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీల వేతనాలు పెంచాతామని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొని ఆ తరువాత మాటమార్చిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరహాలో రాష్ట్రంలో అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.

అనంతపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట జరిగిన అంగన్‌వాడీల ఆందోళనలో ప్రసంగిస్తున్న పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి

రామకృష్ణ అరెస్టుకు నిరసనగా వైకాపా వాకౌట్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 13: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన సమయంలో పార్లమెంటులో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సిపిఐ కార్యదర్శి రామకృష్ణ తదితరులను నాన్ బెయిల్ కింద అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ వైకాపా శుక్రవారం అసెంబ్లీలో జీరో అవర్‌లో సభ నుంచి వాకౌట్ చేసింది. ఈ సందర్భంగా ప్రతిపక్షనేత జగన్ మాట్లాడుతూ, రాష్ట్రప్రభుత్వం రాజకీయ నేతలను వేధించే విధంగా నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం తగదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం మాత్రమే సిపిఐ నేతలు అనంతపురంలో ఆందోళన చేశారన్నారు. రోజుల తరబడి సిపిఐ నేతలను జైల్లో పెట్టడం భావ్యం కాదని, వారిని వెంటనే విడుదల చేయాలని, నాన్‌బెయిలబుల్ కేసులను ఎత్తివేయాలన్నారు. అంతకు ముందు వైకాపా ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ, గత నెల 27వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కడప జిల్లా పర్యటన సందర్భంగా వైకాపా ఎమ్మెల్యేలను జిల్లా కలెక్టర్ అవమానపరిచారని, సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసు ఇస్తున్నట్లు జీరో అవర్‌లో తెలిపారు. తమను అవమానించిన జిల్లా కలెక్టర్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. ముందుగా కలెక్టర్ ఏడుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలను గండిపేట జలాశయంకు సంబంధించిన కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారన్నారు. తాము బయలుదేరే సమయానికి ఈ మీటింగ్‌కు రావద్దని కోరారన్నారు. టిడిపి ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాఘవేంద్ర సాగునీటి ప్రాజెక్టును వెంటనే పూర్తి చేసి ఎమ్మిగనూరు ప్రాంతంలో మెట్ట ప్రాంత రైతులకు సాగునీటిని అందించాలన్నారు.
మత్స్య పరిశ్రమ అభివృద్ధికి చర్యలు
రాష్ట్రంలో మత్స్య పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని, వ్యవసాయేతర భూమి మదింపు పన్నును కూడా మాఫీ చేశామని, సాంకేతిక మద్దతు, వ్యాధి నియంత్రణ, శిక్షణ సదుపాయాలను కల్పిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శుక్రవారం శాసనసభలో ఎమ్మెల్లే ఐ ఆనందరావు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ మత్స్య పరిశ్రమను వృద్ధి వాహకంగా గుర్తించామన్నారు.
పన్ను ఎగవేసే గ్రానైట్ కంపెనీలపై చర్యలు
పన్నులు ఎగవేసే గ్రానైట్ కంపెనీలపై చర్యలు తీసుకుంటామని గనుల శాఖ మంత్రి పీతల సుజాత శాసనసభకు హామీ ఇచ్చారు. టిడిపి ఎమ్మెల్యే డి నరేంద్రకుమార్ తదితరులు అడిగిన ప్రశ్నకు ఆమె బదులిస్తూ వర్తమాన సంవత్సరంలో మైనింగ్ ద్వారా 193 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేసినట్లు చెప్పారు.
ఆక్రమణదారులను ఖాళీ చేయిస్తాం
నంద్యాల పట్టణంలో రోడ్లను ఆక్రమించుకుని వాహనాల రాకపోకలకు, ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగిస్తున్న ఆక్రమణదారులను తొలగిస్తామని, దీనిపై ఇప్పటికే పొలీసులు, రోడ్లు భవనాల శాఖకు ఆదేశాలు ఇచ్చామని మంత్రి శిద్దారాఘవరావు శాసనసభకు తెలిపారు. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ నంద్యాలలో ఫ్లైవోవర్ వంతెన కింద అనదికారికంగా దుకాణాలను నిర్వహిస్తున్న విషయం వాస్తవమేనన్నారు.