కథ

చిరాకులు -చిగురాకులు (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథల
పోటీలో
ఎంపికైన రచన
...............

అతడు:
అబ్బబ్బా... ఈవిడతో వేగలేక పోతున్నాను. ఇక నా వల్ల కాదు. ఈవిడతో కాపురం చేయలేను. ఈవిడ్ని మార్చాలి అంటే ఇంకొక ఆవిడ్ని తెచ్చుకుంటానని కాదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా.. ఎంత చెప్పినా ఈవిడ్ని మార్చడం నా తరం కాదు.
‘బెడ్ కాఫీ’ అడిగి అరగంట అయ్యింది. అబ్బే రెస్పాన్స్ లేదు. ‘్భర్త’ అనే గౌరవం లేదు. ‘్భయం’ అసలే లేదు. పనిమనిషితో గొడవ. ఈ రోజు పనిమనిషి తొందరగా వచ్చేసిందట.. ఈవిడగారి నిద్ర చెడిపోయిందట..! అందుకు గొడవ. మొన్నొక రోజు పనిమనిషి లేటుగా వచ్చింది. అప్పుడు కూడా గొడవే. ‘ఈ లేటు కామన్.. వదిలెయ్యి..’ అంటే వినదు. తనపై రెట్ట వేసిన కొంగ వైపు కౌశిక ముని చూసినట్లు, నా వైపు గుర్రుగా చూస్తాది. మా పనిమనిషి ఏమీ మాట్లాడదు. ‘వౌనమే నా భాష’ అన్నట్టు తన పని తాను చేసుకొని ఈవిడకి గొంతు నొప్పి మిగిల్చి ఎంచక్కా వెళ్లిపోతాది.
మా బంధువుల పెళ్లిలో ఈవిడగార్ని చూశాను. ‘ఐస్’ అయిపోయాను. పెళ్లికూతురి వెంట చలాకీగా తిరుగుతుంటే చూసి పెళ్లికూతురు కంటే ఈవిడ బాగుంది అనిపించింది. పెళ్లిలో పెళ్లి చూడలేదు. ఈవిడనే చూశాను. ఈవిడ చుట్టూ తిరిగాను... ‘గానుగ ఎద్దు’లా. మనసు పారేసుకున్నాను తెలీక. ఈవిడ కళ్లు బాగుంటాయి (గుర్రుగా చూస్తాదని తెలీదు). ముక్కు బాగుంటుంది (రుసరుస లాడుతాదని తెలీదు.) పెదవులు బాగుంటాయి (ఇష్టం వచ్చినట్లు వాగుతాదని తెలీదు). మొత్తానికి ఈవిడ నచ్చింది. తొందర తొందరగా మధ్యవర్తులను పంపించి, మాట్లాడించి, నెల తిరగకుండానే ఈవిడ్ని పెళ్లాడేసాను.. ఎవడైనా ‘కాంపిటేషన్’కి వచ్చేస్తాడని. నా ఆతృతను గమనించి అత్తమామలు కట్నకానుకలు కూడా తగ్గించేశారు. అది చూసి అమ్మనాన్నలు కోపం తెచ్చేసుకున్నారు.
పెళ్లి అయిన కొత్తలో బాగానే ఉండేది. బాగానే వండేది. (బహుశా అలా ఫీలవుతామేమో) రానురాను ఆమె ప్రవర్తన నచ్చడం లేదు. వంట రుచించడం లేదు. రుచికరమైన భోజనం చేసి ఎన్నాళ్లయ్యిందో..! చెబితే వినదు. చిరాకు ఎక్కువ. సహనానికి మారుపేరు ఈవిడే.
అయితే టీవీ సీరియల్స్ మాత్రం శ్రద్ధగా చూస్తాది. ఐఏఎస్, ఐపిఎస్ పరీక్షలకి ప్రిపేర్ అయినంత సీరియస్‌గా చూస్తాది. దానికి ఎక్కడాలేని సహనం మాత్రం వచ్చేస్తాది. ఏకకాలంలో మూడు, నాలుగు ఛానళ్లు మార్చేసి సీరియల్స్ చూసేస్తాది. ఆ సమయంలో స్టవ్ మీద పాలు ఉంటే పొంగిపోవాలి.. కూర ఉంటే మాడిపోవాలి.. కుక్కర్ ఉంటే పేలిపోవాలి..
నాకు కాదు.. కాదు... మాకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి, అమ్మాయి. నాకు పిల్లలంటే ఇష్టం. ప్రాణం. నా పిల్లల్ని తిట్టడం అన్నా, కొట్టడం అన్నా నాకు ఇష్టం ఉండదు. ఆవిడకి మాత్రం మహదానందం. నేను ఏ విషయంలోనైనా కోపం తెచ్చుకున్నా, చిరాకు పడినా దాని యొక్క రియాక్షన్ నా పిల్లల మీద చూపిస్తాది. మరుక్షణం స్విచ్ ఆఫ్ చేసిన టీవీలా అయిపోతాను. మరు నిమిషం ఆవిడ ముసిముసి నవ్వులు నవ్వుకోవడం చాలాసార్లు గమనించాను.
మొదటిసారి గర్భవతి అయినప్పుడు ఈవిడగారు చాలా గొడవ చేసింది. ‘నేను కొడుకుని కంటాను.. వాడ్ని పెరంబదూరులో చదివిస్తాను..’ అంది. నేను ఆశ్చర్యపోయాను. ‘పెరంబదూరులో చదివించడం దేనికి..?!’ అని అడిగాను. ‘అక్కడ బాగా చదివించి, ట్రైన్ డ్రైవర్‌ని చేస్తాను..’ అంది. నాకు నవ్వాగలేదు. ‘పెరంబదూర్‌లో రైలు పెట్టెలు తయారుచేస్తారు, డ్రైవర్లను కాదు’ అన్నాను. అప్పుడు చూడాలి ఆవిడ ముఖం ‘కరి మింగిన వెలక్కాయ’లా అయ్యింది. ‘ఏది ఏమైనా రైలు ప్రయాణం అంటే నాకిష్టం. నా కొడుకుని రైలు డ్రైవర్ని చేస్తాను..’ అని అరిచింది. ఎవరైనా డాక్టర్ని చదివిసాతరు, ఇంజనీర్‌ని చదివిస్తారు. లేదంటే ఐఎఎస్, ఐపిఎస్ చదివిస్తారు.. అదేంటో? ఈవిడ పిచ్చి ఈవిడిది. నేను ఏమన్నా అంటే ‘అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు అయిపోతే మరి, ట్రైన్ డ్రైవర్ ఎవరు అవుతారు..?’ అని ప్రశ్నిస్తాది.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నా బాధ ఎవరికి చెప్పుకోను..!? నా గోడు ఎవరు వింటారు? భార్యా బాధితుడ్ని.. ఇహ సహించలేను. ఈవిడకి విడాకులిచ్చేస్తాను. నేనేంటో నిరూపిస్తాను... ఇప్పుడే లాయర్ దగ్గరికి వెళ్తాను. మగాడిగా, మొగుడిగా నా తడాఖా చూపిస్తాను...
ఆమె:
అబ్బబ్బా... ఈయనతో చాలా ఇదిగా ఉంది. జీవితం అంటే రోత పుట్టించేస్తున్నాడు. ఇక నా వల్ల కాదు. ఇతగాడ్ని మార్చాలని చాలాసార్లు ప్రయత్నించాను. ఎంత చెప్పినా ఈయన ధోరణి మారడం లేదు నేనే మారాలి...
ఉదయం అయిదు గంటలకే ‘బెడ్ కాఫీ... కాఫీ’ అని అరుస్తారు. కాసేపు నిద్రపోనివ్వరు. రాత్రి భోజనాలు అయ్యాక అన్నీ సర్దుకొని, బెడ్ మీద వాలేసరికి పదిన్నర, పదకొండు అయిపోతాది. తర్వాత ఈయనగారి సరసాలు. అప్పటికే ఆయన ఒక నిద్ర తీసేసి ఉంటారు. కంటి నిండా నిద్ర తీసి ఎన్ని రోజులైందో...!
మా బంధువుల పెళ్లిలో ఈయనగార్ని చూశాను. నన్ను చూసి నవ్వాడు. బదులుగా నేనూ నవ్వాను. అంతే.. పెళ్లి చూడ్డం మానేసి, నన్ను చూస్తూ, నా వెంట తిరగడం ప్రారంభించాడు. అందగాడేం కాదు గాని ఫర్వాలేదు. ఉద్యోగం మంచిగానే ఉంది. ఆయన కంటికి ఎలా కనిపించానో? ఏమో..! పెళ్లి చేసుకోవడానికి తెగ తొందరపడిపోయాడు.
పెళ్లి అయిన కొత్తలో బాగానే ఉండేవారు. నన్ను ముద్దాడుతూ... నా నడుం గిచ్చుతూ... జోకులు వేస్తూ నా చుట్టూ తిరిగేవారు. నేను ఏం వండినా లొట్టలేస్తూ తినేవారు. ఇప్పుడేం మాయరోగం వచ్చిందో..! ఏది వండినా బాలేదంటాడు. ‘ఈ కూర ఇలా వండాలి.. ఆ టిఫిన్ ఇలా చేయాలి..!’ అని తెగ విసిగించేస్తున్నాడు. ఈ ఉద్యోగంలో చేరక ముందు ఏ హోటల్లోనైనా ‘కుక్’గా చేసేవాడేమో..!
మాకు ఇద్దరు పిల్లలు. వాళ్ల చదువుల గురించి పట్టించుకోడు. పిల్లలు అల్లరి చేసినప్పుడు నేను దండిస్తే, నా మీదకి తాచుపాములా లేస్తాడు. ఆఫీస్ నుండి ఇంటికి వస్తారు అలసిపోయి. అక్కడేదో బస్తాలు, బండరాళ్లు మోసి, అలసిపోయినట్లు బిల్డప్ ఇస్తారు. ఇంటికి రాగానే టీవీ పెట్టుకుని కూర్చుంటారు. ఏ పనిలోనూ సాయం చేయరు.
ఈయన సినీ స్టార్ రాంబాబు ఫేవరెట్. చదువుకునే రోజుల్లో రాంబాబు సినిమాకి మొదటి రోజు, మొదటి ఆటకి ఫ్రెండ్స్ అందర్నీ తీసుకువెళ్లేవాడట తన డబ్బులతో. అంతేకాకుండా వాళ్లకి సమోసాలు, కూల్‌డ్రింక్స్ కూడా కొనిపెట్టేవారట. నిజానికి సినిమా బాగోలేకపోయినా ‘సూపర్... వంద రోజులు గ్యారంటీ’ అని తెగ పొగిడేవారంట. టీవీలో రాంబాబు పాలు వచ్చినా, సినిమాలు వచ్చినా ఈయన ముఖం చాటంత అయిపోద్ది. రాంబాబు డైలాగ్‌లు, స్టెప్పులు వేసి నన్ను, పిల్లల్ని నవ్విస్తారు. విసిగిస్తారు.. ఈయనగారికి సినిమాల పిచ్చి ఎక్కువ. గతంలో సినిమాల్లో ట్రై చేశాడంట...! ప్రేక్షకులు అదృష్టవంతులు కాబట్టి ఈయనకా అదృష్టం పట్టలేదు.
మొదటిసారి గర్భవతి అయినప్పుడు ‘నాకు అమ్మాయి కావలా’ అని అన్నారు. ‘అబ్బ! ఈయనది ఎంత మంచి మనసో...’ అనుకున్నాను. ‘అమ్మాయి అయినా అబ్బాయి అయినా మన చేతుల్లో లేదుగా..’ అన్నాను. ‘ఊహూ... నాకు అమ్మాయి కావాలి...’ అన్నారు. ‘సరే... అమ్మాయి అయితే ఏం చేస్తారు..?! అని అడిగా. తర్వాత ఈయన చెప్పిన సమాధానం విన్నాక.. అసలే వేవిళ్లతో బాధపడ్తున్న నేను స్పృహ తప్పి పడిపోయాను.
‘అమ్మాయిని వీధి బడిలో చదివిస్తాడంట.. తర్వాత బ్యూటీషన్ కోర్సు చదివించి.. ‘మేకప్ విమన్’గా సినిమాల్లోకి పంపిస్తాడంట... సినిమా హీరోయిన్లు ఇంతవరకూ మేకప్ మెన్‌లతో మేకప్ చేయించుకుంటున్నారంట... వాళ్ల ద్వారా చాలా ఇబ్బందులకు గురవుతున్నారట. అందుకని అమ్మాయిన ‘బెస్ట్ మేకప్ విమెన్’గా తయారుచేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డు కొట్టేస్తాడంట...’
ఈయనకి సినిమాల గురించి బాగా తెలుసని తెగ బిల్డప్ ఇస్తారు. అయితే ఇప్పుడొచ్చే హీరోయిన్లు వాళ్ల మేకప్ వాళ్లే చేసుకుంటారనే విషయం మాత్రం తెలీదు. పూర్ ఫెలో...
ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉన్నాయి. మందు పార్టీలకెళ్లొచ్చి రెండుసార్లు చెయ్యి కూడా చేసుకున్నారు. మనసు ప్రశాంతత కోల్పోయింది. సంసారం అంటే విరక్తి కలుగుతుంది. మొగుడంటే అసహ్యం వేస్తుంది. చూస్తూ ఊరుకుంటే లాభం లేదు. పిల్లలు అన్యాయం అయిపోతారు. ఏదో ఒకటి చేయాలి. నేనేంటో చూపించాలి.. చూపిస్తాను...
ఆ రాత్రి:
వెనె్నల రాత్రి.. పెరట్లో జామ చెట్టు దగ్గర నల్లటి పూల తెల్లటి దుప్పటి పరిచిన మంచం మీద ఎర్రటి పూల తెల్లని చీర కట్టుకొని ఆమె...
చల్లని పిల్లగాలికి రంగువేసిన నల్లని కురులు ఆమె నుదుటిపై చిందర వందరగా పడుతుంటే.. వాటిని అతను సరిచేస్తూ ‘మొదటిసారి నిన్ను చూసినప్పుడు నాకు మతిపోయింది. ఇద్దరు పిల్లలు పుట్టినా నీలో అందం చెరగలేదు.. నీ మీద ప్రేమ తరగలేదు.. పోయిన నా మతి తిరిగి రాలేదు... అందుకే తిరుగుతున్నా నీ చుట్టూ ‘హచ్’ కుక్కపిల్లలా...’ అన్నాడు.
ఆమె మత్తుగా గర్వంగా నవ్వింది. ‘అలా మాట్లాడకండి... మీరు మాత్రం నన్ను పడేయలేదూ...! అచ్చు సినీ హీరో రాంబాబులా ఫోజులిచ్చి, ప్రేమ కబుర్లు చెప్పి, ఆలోచించుకోవడానికి అవకాశం ఇవ్వకుండా తొందర... తొందరగా పెళ్లాడేశారు...’
ఆ వెనె్నల రాత్రి వాళ్లు నిద్రపోలేదు. జరిగిపోయిన తీపి గుర్తులు నెమరు వేసుకున్నారు. ముద్దులాడుకున్నారు.. ముచ్చట తీర్చుకున్నారు... ఆ వెనె్నల వానలోనే కాదు వలపు తలపుల్లో కూడా తడిసి ముద్దయ్యారు.
‘నిన్ను వదిలి నేను పోలేనులే... ఇది నిజములే...’ ఇద్దరి హృదయాలు వౌనరాగాలు పాడుకోసాగాయి.
అతడు:
‘మారాలి.. మారాలి...’ అంటాను. కాని మారాల్సింది ఆవిడ కాదు.. నేను. కేవలం ఉద్యోగం చేసి ‘నేను మగాడిని’ అని అహంకారం ప్రదర్శిస్తే సరిపోదు. ఇంటి పనుల్లో కూడా సాయపడాలి. పిల్లల చదువుల గురించి పట్టించుకోవాలి. సంసారం అన్నాక చిన్నాచితక ఇబ్బందులు కలుగుతాయి... మనస్పర్థలు వస్తాయి... వాటిని చిరునవ్వుతో, సహనంతో సరిచేసుకోవాలి. భార్యాభర్తల్లో ఎవరికి ఎవ్వరూ ఎక్కువ కాదు.. తక్కువ కాదు... ఇద్దరూ సమానమే. ఈ సూక్ష్మం గ్రహించకే ఈ మనస్పర్థలు. ఇష్టపడి వెంటబడి పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు కాదనుకుంటే ఎలా..!? కుదరదు.. ఆవిడ అంటే ‘ఇష్టం’...
ఆమె:
సంసారం అంటే మొగుడు, పిల్లలు. పొద్దస్తమానం టీవీ చూస్తూ కూర్చుంటే ఎవరికైనా మండుతాది. టీవీ సీరియల్స్ చూసి, ‘ఆడ విలన్’లా తయారై సంసారాన్ని పాడు చేసుకుంటున్నానా...!? నిజమేననిపిస్తుంది. ఇష్టపడి పెళ్లి చేసుకున్న భర్త... ముత్యాల్లాంటి పిల్లలు. ఏ ఆడదానికైనా ఇంకేం కావాలి. మరి నాలో ఎందుకీ అసహనం..?! ఏం సాధించాలని..!? నేను మారాలి. నా ఆలోచనా విధానం మార్చుకోవాలి. ఆయన ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ప్రేమగా చూసుకుంటున్నారు. నాకే చిరాకు, కోపం. లాభం లేదు నేను మారతాను. నా సంసారాన్ని స్వర్గమయం చేసుకుంటాను.
ఆ రాత్రి:
అమావాస్య రాత్రి.. పెరట్లో జామచెట్టు దగ్గర మంచం మీద అతడు ఆమె ఒకర్నొకరు తన్మయత్వంతో చూసుకుంటున్నారు. చుట్టూ చీకటి... అయినా వారిరువురి హృదయాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి.

-అభిమన్యు
బి.సత్య ఈశ్వరరావు, ఆంధ్రాబ్యాంక్, తాటిపాక -533 242, తూ.గో.జిల్లా
94402 04748

-అభిమన్యు