మంచి మాట

కాశీ ఖండం.. 65

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇక ఈ గుణనిధి ఒనరించిన పుణ్య కర్మని తెలుపుతున్నాం. వినవలసిందే.
‘‘ఈ మహీసురుడు ఆహారం లభింపకున్నా శివరాత్రి రోజున ఓ రంత ప్రొద్దు ఉపవాసం ఉన్నాడు. అన్నాన్ని అపహరించడానికైనా పొంచి పొంచి వుండి తెల్లవారు జామునదాకా జాగారం చేశాడు. అన్న పాత్రను అవలోకించడం అనే నెపంతో వెలవెలపోతున్న దివ్వె ఘనం కాకుండా (కొండెక్కకుండా) వత్తి ఎగసనద్రోసి వెలుగజేశాడు. దర్శించే వాంఛ కలుగకున్నా శంభువౌళిని అన్యులు చేసిన కుసుమ పూజను కనుగొన్నాడు. కాలం మూడినా శివాలయ ప్రాంగణంలో వున్న రాచబాట నట్టనడుమ మృతి చెందాడు. సూక్ష్మదృష్టితో వితర్కించి చూసినప్పుడు ఇంత కంటె గొప్ప పుణ్య కార్యాలు ఏమున్నాయి కనుక?’’
అని శివ పార్శ్వచరులు యమకింకరుల్ని వీడ్కొలిపారు. గుణనిధిని విమానారూఢుణ్ణి కావించి, శివలోకానికి కొంపోయి పరమ శివుడి సన్నిధిలో నిలిపారు. సదాశివుడున్ను ఆ గుణనిధి ఒనర్చిన దీప సంధుక్షణాది పుణ్య కార్యానురూపం అయిన ఫలాన్ని దృష్టిలో వుంచుకొని, కళింగ దేశానికి అధిపతి అయిన అరిందముడు అనే ప్రభువుకి కుమారుడై దముడు అనే నామధేయంతో ఆ దేశానికి రాజుగా అనుగ్రహించి పంపివేశాడు. శివానుగ్రహంవల్ల అతడు కళింగ రాజ్యాభిషిక్తుడు అయాడు.
కళింగ దేశానికి పట్ట్భాషిక్తుడు అయిన వెంటనే ఆ ప్రభువు తన నృపధానిలోను, దేశంలోను వెలసిన శివాలయాల్లో కోటానుకోట్ల దివ్వెలు కళికలట్లు ఎల్లవేళలా వెలుగుతూ వుండాలని చాటింపు వేయించాడు. తన దేశ పౌరులు దినముకొక్కక్కరుగా ఇలువరుసను శివాలయాల్లో దివ్వె నిలబెట్టాలని ఆ విధంగా నిల్పని వారి తలలు తెగగొట్టాలనీ తన భటులకి ఆనలు పొడిచాడు.
ఆ దీపికా దాన పుణ్య ఫలంవల్ల ఆ కళింగాధీశ్వరుడు మరో జన్మలో కుబేరుడు అయి ఈశ్వర సఖుడు అయాడు. అతడు కుబేరుడయిన వృత్తాంతాన్ని వివరిస్తాము. సావధాన మనస్కుడవై ఆకర్ణించు.
పద్మకల్పంలో పద్మసంభవుడి మనఃపద్మం నుంచి పులస్త్య ప్రజాపతి సంభవించాడు. ఆ పులస్త్య బ్రహ్మకి మహాముని ప్రవరుడు విశ్రవస్సు ఉదయించాడు. ఆ మునివతంసడు విశ్రవసువుకి వైశ్రవణుడు ఉద్భవించాడు. ఈ వైశ్రవణుడు శివుడి చెలిమికాడు. ఇతడు లంకా పట్టణాన్ని పాలించాడు. అనంతరం మహాయశస్సంపన్నుడు యజ్ఞదత్తపుత్రుడు గుణనిధి మేఘవాహన కల్పంలో కుబేర పదవిని అలంకరించాడు. తర్వాత జ్ఞాన ప్రకాశిక అయిన కాశీ నగరాన్ని చేర ఏతెంచి ఈ అవిముక్త స్థానంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు.
అవిముక్తకానన క్షేత్రంలో వెనుక గుణనిధి అయిన నేటి కుబేరుడు పార్వతీ పతి అయిన పరమశివుణ్ణి పదివేల యేండ్లు రెప్పపాటు లేని కనుగవతో చర్మం, ఎముకలు, రక్తనాళాలు శుష్కములయిపోగా (ఎండి బెరడులట్లు కాగా) తన తపో నియతిని ముజ్జగాలవారు ఎల్లవేళ, ఎల్ల యెడల కొనియాడుతూ ఉండగా చూచువాడు చూచుచున్నట్లే అచంచలుడై వున్నాడు.
అనన్య చిత్తస్థైర్య సంపత్తి కలిగిన ఆ యజ్ఞదత్తపుత్రుడు గుణనిధి గజాసుర సంహారుడైన పరమ శివుడే ప్రత్తి దూతితో బత్తి చేసిన దీపవర్తిగాను, మంచు గుబ్బలి రాచ వారి అనుగు కూతురు పార్వతీదేవియే ఆధార స్తంభ యష్టిగాను, పరమ విశ్వాస తత్పరత తోడి నిశ్చల భక్తి సంపత్తియే చమురుగాను, సంతత ధ్యాన ధారాసమున్నతియే ఉజ్జ్వల తరం అయిన దీపజ్వాలగాను, కామక్రోధ లోభ మద మాత్సర్యాదులైన అరిషడ్వర్గాలే శలభాలుగా విమల సుజ్ఞాన దీపాన్ని ప్రకాశింపజేశాడు.

-ఇంకా ఉంది

శ్రీపాద కృష్ణమూర్తి