మెయిన్ ఫీచర్

సంతోషాల కాంతి.. సందడంతా మనదే! ( రేపు మకర సంక్రాంతి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్యక్ష దైవమైన సూర్యుడు తన వెలుగును లోకానికంతటికీ ప్రసరింపజేస్తూ ఒక రాశిలో నుండి మరో రాశిలోకి సంక్రమణం చేస్తూ జీవులను పోషిస్తున్నాడు. సూర్యుడు ఇలా రాశి మారడం (సంక్రమణం) ‘సంక్రాంతి’గా పిలువబడుతోంది. ‘సమ్యక్ క్రమణం సంక్రమణం’... ‘బాగుగా అడుగిడునది’- సంక్రమణం. సంక్రాంతులన్నీ పర్వదినాలే. విశేషించి కర్కాటక సంక్రమణం, మకర సంక్రమణం జనుల చేత అనాదిగా ఆచరించబడుతున్నాయి. సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించే సమయం కర్కాటక సంక్రమణం. దీనితో దక్షిణాయనం ప్రారంభమవుతుంది. మకరరాశిలోకి ప్రవేశించే సమయం మకర సంక్రమణం. దీనితో ఉత్తరాయణం మొదలవుతుంది. ఈ సంక్రమణల సమయంలో తమ విద్యుక్త ధర్మాలను ధర్మవిదులు ఆచరిస్తారు. సౌరమానాన్ని అనుసరించి జరుపుకునే సంక్రాంతి పండుగలో ఎన్నో అంశాలు ముడిపడి వున్నాయి. అన్ని వర్గాలవారికీ ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పంచేదే సంక్రాంతి పండుగ.
సంక్రాంతి ముఖ్యంగా రైతుల పండుగ. వారికి సంతోషాన్నిచ్చే పండుగ. గ్రామీణ వాతావరణంలో ఈ పండుగను జరుపుకోవాలని ఎందరో ఉవ్విళ్లూరుతూ వుంటారు. పల్లెటూళ్ళలో శోభాయమానంగా సంక్రాంతి కళ ఉట్టిపడుతూ ఉంటుంది. అందుకు కారణం రైతన్నల చేతికి పంట అందిరావడమే. వ్యవసాయంతో ముడిపడిన ఈ పండుగ సమయంలో రైతులకు పంటలపై రాబడి వస్తుంది. రైతుల ద్వారా చేతిలోకి అన్నాన్ని అందుకుంటున్నవారికందరికీ సంక్రాంతి పెద్ద పండుగే. సస్యలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా భావిస్తూ మనం పంటలను ఆరాధిస్తున్నాం.
మగువల్లో ఉత్సాహాన్ని నింపే పండుగ ఇది. ఈ పండుగకు సరిగ్గా నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుర్మాసంలో ఇళ్ళ ముందు రకరకాల రంగవల్లికలను తీర్చడంలో స్ర్తిలు ఆసక్తి చూపుతారు. శ్రీకృష్ణుడు, గోపికలకు ప్రతీకలుగా ఆవుపేడతో గొబ్బెమ్మలను చేసి గొబ్బిపాటలు పాడుతూ, వాటి చుట్టూ తిరుగుతూ గొబ్బెమ్మలను మహిళలు పూజిస్తారు. చేమంతి పూవువంటి చెల్లెలు, తామర పువ్వంటి తమ్ముడు, మొగలి పువ్వు వంటి మొగుడు కావాలని పాడుకుంటూ శుభాలు జరగాలని ఆశిస్తారు. తమ అన్నయ్యలను, అక్కయ్యలను అరటి పువ్వుల్లా భావించడం, తమ వారినందరినీ పూల మాదిరి ఊహించుకోవడం కుటుంబ బాంధవ్యాలకు అద్దం పడతాయి. ఈ పాటల్లో పద విన్యాసం, భావ సౌందర్యం ఆకట్టుకొనే రీతిలో సాగుతాయి. ‘సందె గొబ్బెమ్మలు’ పేరిట జరిగే ఈ వేడుక చూడముచ్చటగా వుంటుంది. సంక్రాంతి సందర్భంగా కొందరు మహిళలు నోములు నోచుకుంటారు. బొమ్మల కొలువులు స్ర్తిలలోని కళాత్మక దృష్టిని, నైపుణ్యాన్ని చాటి చెబుతాయి.
సంక్రాంతి పండుగ పురుషులకూ ప్రీతికరమైనదే. పల్లెల్లో, పట్టణాల్లో గాలిపటాల సందడి చెప్పనే అక్కరలేదు. ఆధునికతను జోడించుకుంటూ పాటల హోరులో గాలిపటాలను ఎగురవేయడంలో పురుషులు కనబరచే ఉత్సాహం చెప్పనలవి కాదు. వింత వింత బొమ్మలతో, విభిన్న ఆకారాలతో, కాంతులీనే రంగులతో ఎగిరే గాలిపటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. బాలబాలికలకు సంక్రాంతి వచ్చిందంటే సంతోషమే. వారు పెద్దవారికి సహకరిస్తూనో, ముగ్గులు వేస్తూనో, గాలిపటాలు ఎగురవేస్తూనో ఆనందంలో మునిగితేలుతూ వుంటారు. ఇక, భక్తజనులంతా ధనుర్మాస సమయంలో విష్ణ్భుక్తి యుతులై తిరుప్పావై పారాయణలు, పూజలు చేస్తూ విష్ణుమూర్తిని సేవిస్తారు. గోదాదేవి కళ్యాణం జరిపిస్తారు. ఆచారవంతులైన వారు సంక్రాంతిని ఉత్తరాయణ పుణ్యకాలమని పిలుస్తూ ఈ సమయాన్ని పవిత్రమైన సమయంగా భావించి పితృదేవతలకు తర్పణాలిస్తారు. ఈ విధంగా పెద్దల కోసం చేసే పండుగ ఇది. సంక్రాంతి ఏ ఒక్క కుటుంబాన్నో కాదు, మొత్తం సమాజాన్ని కలగలిపే పండుగ. హరిదాసులు, గంగిరెద్దుల వారికి సంక్రాంతి సమయంలోనే తగిన విలువ, గుర్తింపులభిస్తుంది. కొత్త ధాన్యంతో చేసిన అరిసెలు, పొంగలి మొదలైన పిండివంటలు ఈ పండుగకు తప్పనిసరి. ఈ వంటకాలతో కొత్త ధాన్యం తిన్న సంతృప్తి కలుగుతుంది. శరీరంలో ఉష్ణాన్ని సమస్థితిలో వుంచేలా ఈ పండుగ చేస్తుంది. కనుమనాడు మినుములు తినాలనడం కూడా బలవర్థకమైన ఆహారాన్ని, ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని స్వీకరించాలని చెప్పడమే.
పుష్యమాసం పౌష్యలక్ష్మికళను సంతరించుకుని సరికొత్త కాంతులీనుతూ కళకళలాడుతూ వుంటుంది. మంచుదుప్పటి కప్పుకున్నట్లు పచ్చని ప్రకృతి కనువిందు చేస్తుంది. అందుకే సంక్రాంతి సౌందర్యాన్ని ఎందరో కవులు వర్ణించారు. రాయప్రోలు సుబ్బారావుగారు ‘సస్యకేసర కపిశ శోభల చేలు పసుపాడిన విధంబున చూడ కన్నుల వేడుకాయెను భూమి గంధము చల్లగా’ అని వర్ణించారు. ‘సంక్రాంతి ముచ్చట్ల’లో తుమ్మల సీతారామమూర్తిగారు పండుగ విశేషాల్ని అందించారు. స్నేహితుల సంభాషణగా జరిగే ఈ ముచ్చట్లలో- తెల్లవారకముందే స్ర్తిలు అందంగా వేసిన ముగ్గుల గురించి, పిండి వంటల ఘుమఘుమలను గురించి ఆయన ప్రస్తావిస్తారు. ఎన్నో సామాజిక, రాజకీయ విషయాలను కూడా ఆ స్నేహితులు చర్చించుకుంటారు. దీనిలో ముఖ్యంగా ఆత్మీయతతో ఇచ్చిపుచ్చుకోవడాలు, కబుర్లు కలబోసుకోవడాలు మనకు కనిపిస్తాయి. ఆత్మీయతానురాగాల సమాహారంగా మనకు ఈ సంభాషణ కనిపిస్తుంది. ఈ విధమైన సద్భావనలతోనే పండుగకు సంపూర్ణత చేకూరుతుందని అనేలా అనిపిస్తుంది.
భోగి, సంక్రాంతి, కనుమ అని సంక్రాంతి పండుగను మూడు రోజులు జరుపుకుంటారు. భోగినాడు తెల్లవారు జామునే- పనికిరాని వస్తువులన్నీ మంటల్లో తగలబెడుతూ మంటలు వేస్తారు. తమ పీడలన్నీ ఇలా దగ్ధం కావాలని కోరుకుంటారు. ఎముకలు కొరికే చలి కాలంలో భోగి మంటలు వెచ్చదనాన్నిచ్చి సంతోషపరుస్తాయి. భోగినాడు చిన్నపిల్లల తలపై రేగుపండ్లు, చామంతి, బంతి పువ్వుల రేకలు, చిల్లర పైసలు, అక్షతలు, చెరకు ముక్కలు కలిపి భోగిపండ్లు పోసే సంప్రదాయం తెలుగువారిలో వుంది. పిల్లల్లో దృష్టి దోషాలను పరిహరించడానికే ఈ ఆచారం ఏర్పడింది. సంక్రాంతి పండుగ సూర్యునికి సంబంధించినది గనుక సౌరశక్తికి ప్రతీకలుగా రేగుపండ్లను పిల్లల తలపై పోయడం ద్వారా వారికి సౌరశక్తిని అందించేలా ప్రయత్నించడమే ఇందులోని అంతరార్థం. కనుమ నాడు పశువులను అలంకరిస్తారు. ఇలా సంక్రాంతి పండుగ పిన్నా పెద్దలందరికీ ఆనందాన్ని కలిగించే పండుగ. సామాజికంగా, ఆధ్యాత్మికంగా కూడా ఈ పండుగ మేలు చేస్తుంది. సంక్రాంతి సందర్భంగా బంధువులను ఆహ్వానించి వేడుకగా జరుపుకుంటాం. బంధువర్గంలో బాంధవ్యాలను బలోపేతం చేయడానికి ఇది తోడ్పడుతుంది. ప్రత్యేకించి కొత్త అల్లుళ్ళకు సరదా ఇచ్చే పండుగ ఇది. కొత్తకోడలు ఏ విధంగా అత్తవారింట్లో కలిసిపోతుందో అలాగే కొత్త అల్లుడు కూడా అత్తవారింట అరమరికలు లేకుండా సత్సంబంధాలు పెంపొందించుకోవడం అవసరం. బొమ్మల కొలువు పేరుతో, భోగిపళ్ళ పేరుతోనో, నోముల పేరుతోనో ఇరుగు పొరుగు వారిని పిలిచి వారితో పేరంటాలు, పూజలు జరుపుకోవడం ద్వారా మహిళల మధ్య బంధాలు, స్నేహాలు బలపడతాయి.
పారమార్థికంగా చూస్తే సంక్రాంతి విశేషమైన పండుగ. మానవ జన్మకు కారకులైన పూర్వీలకులను సంస్మరించుకోవడం, కృతజ్ఞతను కలిగి వుండడం అవసరం. పితృదేవతలను ఆరాధించే సదాచారం, సంస్కారం సంక్రాంతిలో వుంది. పశుపక్ష్యాదులను ఆరాధించడం మన సంస్కృతిలో భాగం. గోమాతను పూజించడం, గంగిరెద్దులకు కానుకలివ్వడం, దానధర్మాలు చేయడం మొదలైనవి మానవునిలోని దయాగుణాన్ని ప్రోది చేస్తాయి.
ఎంత అందంగా వుండి మురిపించినా బొమ్మలకు ఉద్వాసన తప్పదు. ఎంత కనువిందు చేసి ఆహ్లాదరపరిచినా రంగవల్లులు కనుమరుగు కాక తప్పదు. ఎంత ఎత్తుకు ఎగిరి ఆకాశంలో విహరించినా గాలిపటం చివరకు నేలకొరగక తప్పదు. ఈ సత్యాన్ని గుర్తించాలి. శక్త్యానుసారం పోరాటం చేస్తూ జీవితాన్ని చక్కగా మలచుకోవడం విజ్ఞుల లక్షణం. సూర్యుని గమనం వలే మనిషి జీవన గమనంలోని ప్రతి అడుగూ మార్గదర్శకం కాగలగాలి. తాము సుఖ సంతోషాలతో వుంటూ అందరిలోనూ సుఖ సంతోషాలు వెల్లివిరిసేలా పాటుపడాలి. ఇలాంటి సద్భావనలతో పండుగను జరుపుకుంటే సంక్రాంతి సౌరభం దశదిశలా గుబాళిస్తుంది.

-కె.లక్ష్మీ అన్నపూర్ణ